సంతోషమే... సంపూర్ణ బలం!
అధ్యయనం
సంతోషమే సగం బలం అనేది పాత మాట. సంపూర్ణ బలం అనేది కొత్త మాట. ‘సంతోషంగా ఉండడం వెనక రహస్యం’ కొందరికి బ్రహ్మపదార్థం అయితే మరికొందరికి అరటిపండు ఒలిచినంత తేలిక. ‘ఇతరులకు సహాయపడడం’ ‘ఎప్పటికప్పుడు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడం’ అనేవి సంతోషానికి మూలం అంటున్నారు స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. ‘సంతోషానికి మూలం ఏమిటి?’ అనే కోణంలో లోతుగా అధ్యయనం చేసిన ఈ పరిశోధక బృందం స్పష్టత లేని, ఆచరణసాధ్యం కాని లక్ష్యాలు విషాదానికి కారణమవుతాయని చెబుతోంది.
‘‘ఫలానా పనిచేస్తే మేము సంతోషంగా ఉంటాం అనుకుంటారు. తీరా అది చేశాక ఆశించిన సంతోషమేది కనిపించదు. మనం ఏవైతే సంతోషకారకాలు అనుకుంటామో... అవి అన్ని సందర్భాలలోనూ నిజం కాకపోవచ్చు. మనం ఎప్పుడూ ఊహించని పనుల్లో సంతోషం దొరకవచ్చు’’ అంటున్నారు పరిశోధకులలో ఒకరైన జెన్నీఫర్ ఎకర్. కామెడీ సినిమాలు చూడడం, స్నేహబృందంతో ఆహ్లాదకరమైన చర్చల కంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, విజయం సాధించినప్పుడు పెరిగే ఆత్మవిశ్వాసం... అపారమైన సంతోషానికి కారణమవుతుంది అంటున్నారు.