పుస్తకశిల్పి..!
జాతీయం
పద్మభూషణ్ అవార్డు గ్రహీత జతిన్‌దాస్ భారతీయ పెయింటర్, శిల్పి. ఒరిస్సాలోని మయూర్భంజ్ ఆయన జన్మస్థానం. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బాంబేలో చదివాడు. అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌లో పాల్గొన్నాడు. పారిస్, వెనిస్లలో ప్రదర్శనలిచ్చారు. తను వేసిన చిత్రపటాలను, శిల్పాలను అనేక సంస్థలకు బహుమతిగా ఇచ్చారు. బాలీవుడ్ నటి నందితాదాస్, డిజైన ర్ సిద్ధార్థ దాస్ ఈయన సంతానం.
భార్య, కుమారులతో ఢిల్లీలోని లీఫీ ఆసియాడ్ విలేజ్‌లో ఉంటున్న జతిన్‌దాస్ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆయన వేసిన కళాకృతులు కనిపిస్తాయనుకుంటే పొరపాటే. అన్ని గదులూ పుస్తకాల మయం. ‘‘పుస్తకాలు నా ప్రాణం. నేను వేసిన చిత్రాలలో నా స్టూడియో కోసం కొన్నింటిని మాత్రం ఉంచుతాను. వాటిని అందరికీ చూపించాలనే ఆసక్తి నాకు లేదు’ అంటారు కుడ్య చిత్రాల ప్రముఖుడు, గ్రాఫిక్ ఆర్టిస్ట్, కవి అయిన దాస్. దాస్ ఇంట్లోకి ప్రవేశిస్తే... ముగ్గురు కూర్చోవడానికి అనువుగా ఉండే పురాతన కాలం నాటి సోఫా, చిన్న టేబుల్, పుస్తకాలతో నిండిన అల్మరా, కేన్ టేబుల్ స్వాగతం పలుకుతాయి.
వంటిల్లు, డ్రాయింగ్రూమ్లోకి వెళ్లడానికి అనువుగా అయిదారు మెట్లు, గదికి రెండువైపులా పుస్తకాల షెల్ఫ్‌లు, మెట్లకు కుడిపక్కగా మూడు బెడ్రూమ్లలోకి దారులు. ఆ ఇంటి గురించి ‘‘స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎందరో ఇక్కడ ఆనందంగా గడిపారు’’ అంటారు దాస్. ఆ గదిలోనే భూటాన్ నుంచి తెచ్చిన బుద్ధ ప్రతిమ, రాగితో తయారైన పూజాసామాగ్రి ఉంటాయి.
దాస్ ప్రకృతి ప్రేమికుడు. ‘‘సూర్యోదయాన్నే గార్డెన్లో కూర్చుని పేపర్ చదువుతూ, వేడివేడిగా టీ తాగుతూ, దినచర్య ప్రారంభించడమంటే నాకు ఎంతో ఇష్టం’’ అంటూ సంబరంగా చెబుతున్న దాస్ అదర్‌సైడ్ ఇది!