అక్రమార్కుల ఆవాసాలు
► జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు
► లక్షల్లో వసూళ్లు.. నకిలీ మంజూరు పత్రాలు
► రికార్డుల్లో ఖాళీ ఇళ్లు.. వాస్తవానికి నకిలీల లోగిళ్లు
► జీవీఎంసీ సిబ్బంది, దళారులు కుమ్మక్కై దందా
► మంత్రి అనుచరులకు ఆ ఇళ్ల కేటాయింపుతో వెలుగులోకి
► 30 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
► ముగ్గురు అధికారులతోప్రత్యేక విచారణ
జేఎన్ఎన్యూఆర్ఎం గృహాలు.. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికోసం కేంద్రం నిర్మించిన ఇళ్లు..ఇప్పటికీ వందల్లో ఖాళీగా ఉన్న ఈ ఇళ్లపై ఓ అమాత్యుడి కళ్లు పడ్డాయి.. వాటిని తన అనుచర గణానికి కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చాడు.. నిబంధనలు అంగీకరించవని వారు చెప్పినా.. పెడచెవిన పెట్టాడు.. ఒత్తిడి పెంచి మరీ కేటాయింపు పత్రాలు ఇప్పించుకున్నాడు..
వాటిని పట్టుకొని తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లిన అనుచరులకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది.. ఆ ఇళ్లలో అప్పటికే వేరేవారు తిష్ట వేయడం చూసి అవాక్కయ్యారు.. మంత్రి అనుచరులకు కేటాయించడమే అక్రమమైతే.. ఆ ఇళ్లను అప్పటికే వేరే వారు ఆక్రమించుకోవడం అక్రమాలకు పరాకాష్ట..ఈ పరిస్థితి చూసి బిత్తరపోయిన అధికారులు తీగ లాగడం ప్రారంభించారు.. దాంతోపాటు పెద్ద అవినీతి డొంకే కదులుతోంది..దళారులు.. జీవీఎంసీ సిబ్బంది కుమ్మక్కై నడుపుతున్న ఇళ్ల కేటాయింపు కుంభకోణంవెలుగుచూస్తోంది.
విశాఖ సిటీ:
జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద జీవీఎంసీ పరిధిలో దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు కేంద్రం 15,320 ఇళ్లు మంజూరు చేసింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం 24 సముదాయాలుగా 2006లో వీటి నిర్మాణాలు పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం బీపీఎల్ కుటుంబాలతో పాటు రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి వీటిని కేటాయించాలి. ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా 1.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా దశల వారీగా 12,300 మందికి ఇళ్లు కేటాయించారు. వీటిలో గాజువాక పరిధిలోని మదీనాబాగ్‌లో 2080 ఇళ్లకుగాను 1380 మందికి ఇళ్లు కేటాయించారు.
మిగిలిన 700 ఇళ్లు కొంతకాలంగా ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి తన అనుచరులకు 173 ఇళ్లు కేటాయించాలని జీవీఎంసీ అధికారులకు సిఫారసు చేశారు. వారిలో చాలా మంది బీపీఎల్ కేటగిరీలో లేని విషయాన్ని వారు ప్రస్తావించినా.. మంత్రి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఇళ్లు కేటాయించక తప్పలేదు. మంజూరు పత్రాలు తీసుకొని ఇళ్ల వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆయా ఇళ్లలో వేరే కుటుంబాలు నివాసం ఉండటం చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఖాళీగా ఉండాల్సిన ఇళ్లలోకి ఆ కుటుంబాలు ఎలా చేరాయని విచారణ చేపట్టడంతో అవినీతి వ్యవహారం మొత్తం బట్టబయలైంది.
రూ.2 వేల నుంచి రూ.2 లక్షల వరకు
కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఇళ్లపై దళారుల కన్ను పడింది. అంతే సంబంధిత జీవీఎంసీ సిబ్బందితో కుమ్మక్కై దందా ప్రారంభించారు. ఇళ్లు కావాలంటే ఫలానావారిని సంప్రదించాలంటూ ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మి వచ్చిన వారితో బేరం పెట్టుకున్నారు. బాగా తెలిసిన వారి నుంచి రూ.2 వేలు, తెలీని వారి నుంచి రూ.2 లక్షల వరకూ వసూలు చేశారు. ఎంత డబ్బుకట్టినా.. జీవీఎంసీ పేరుతో అధికారికంగా చెల్లించాల్సిన రూ.20,300 డీడీ కట్టించారు. మంజూరు పేరిట పత్రాలు ఇచ్చేశారు. జోన్–5లో ఫెడరేషన్ ఫెసిలిటేలేటర్గా పనిచేస్తున్న వ్యక్తి సహా మరి కొంతమంది సిబ్బంది ఈ విషయంలో దళారులకు సహకరించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా రూ. 20 కోట్లకు పైగా వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.
ఖాతాలో డబ్బు పడుతున్నా తెలీదా..?
దళారులు వసూలు చేసిన డబ్బులతో పాటు జీవీఎంసీ పేరుతో రూ.20,300 చొప్పున డీడీలు కట్టించి జీవీఎంసీ ఖాతాల్లో పడేలా చేశారు. వేరే మార్గం నుంచి వస్తున్న ఈ డబ్బులు ఎవరు చెల్లిస్తున్నారనే విషయాన్ని జీవీఎంసీ అధికారులు గానీ, అప్పటి కమిషనర్ కానీ గుర్తించకపోవడం గమనార్హం.
ఎక్కడ.. ఎన్ని.. సముదాయాలు
మధురవాడ 16
ఆరిలోవ 02
గాజువాక 03
పెందుర్తి 03
మొత్తం 24
జీవీఎంసీలో జేఎన్ఎన్యూఆర్ఎం స్వరూపం
మంజూరై, నిర్మించిన ఇళ్లు... 15,320
లబ్ధిదారులకు కేటాయించినవి.. 12,300
ఖాళీగా ఉన్నవి... 3,020
పోలీసుల అదుపులో 30 మంది
ఈ నకిలీ మంజూరు పత్రాల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన జీవీఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమించారు. అధికారికంగా కేటాయించని ఇళ్లలో నివాసముంటున్న వారి వద్ద నుంచి ఇప్పటి వరకూ 300 పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.జీవీఎంసీ జారీ చేసిన అధికారిక పత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అవి ఉండటం చూసి విస్తుపోయారు. ఇళ్లలో ఉంటున్న వారిని ఆరా తీయగా.. తమ వద్ద డబ్బులు తీసుకున్న దళారులు, అధికారుల పేర్లను వారు బయటపెట్టారు. దాంతో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వీరిపై సెక్షన్ 420 సహా.. బెయిల్‌కు వీల్లేని 15 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నారని సమాచారం. మరోవైపు.. ఇళ్లు వస్తాయన్న ఆశతో లక్షలు కట్టామని జీవీఎంసీకి డీడీలూ చెల్లించామని బాధితులు కమిషనర్‌తో మొరపెట్టుకున్నారు. ఈ వ్యవహారంపై జీవీఎంసీ ప్రత్యేకాధికారైన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఇటీవల సమావేశమయ్యారు. డబ్బులు చెల్లించిన వారిలో బీపీఎల్ కేటగిరీలో ఉన్న వారికి మినహాయింపు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
గతంలోనూ రూ.25 కోట్ల కుంభకోణం
గతంలోనూ జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లలో చాలా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో జేఎన్ఎన్యూఆర్ఎం ఏపీడీగా పనిచేసిన శివరాంప్రసాద్పై ఆరోపణలు వచ్చాయి. వెండి, బంగారు వస్తువులతో పాటు లక్షల రూపాయలు ఆయనకు చెల్లించుకున్నామంటూ పలువురు బాధితులు ఆధారాలతో సహా.. పలు పోలీస్ స్టేషన్లలోనూ, జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు.
వీటిపై విచారణ జరిపిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు నిజమని నిర్ధరిస్తూ అప్పట్లో నివేదికలు ఇచ్చారు. జిల్లా మంత్రి, నగర ఎమ్మెల్యేల ఒత్తిడి వల్ల ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా.. రిటైర్ అయినప్పుడు సత్కరించి మరీ పంపిన ఘనత అధికార యంత్రాంగానికే చెల్లుతుంది. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపు రూ. 25 కోట్లు దండుకున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కుంభకోణం కూడా ఆయన హయాంలో జరిగినదే. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాక.. బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.