ఉద్యోగానికి పరుగు
పాడేరు రూరల్: కేంద్ర పోలీసు బలగాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు ఐటీడీఏ, పోలీసుశాఖ సంయుక్తంగా ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. శిక్షణ ఎంపికకు మండలంలోని లగిసపల్లి కస్తూర్బాగాంధీ పా ఠశాల సమీపంలోని మైదానంలో సోమవారం పరుగు పోటీ నిర్వహించారు. తొలి రోజు పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన 500 మంది హాజరయ్యారు. తొలుత మహిళలకు 800 మీటర్లు, పురుషులకు 1600 మీటర్ల పరుగుపోటీ నిర్వహించారు. దీనిని ఏఎస్పీ బాబూజీ ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం ఏజేన్సీ 11 మండలాల నుంచి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు ఉంది. అభ్యర్థులు నేరుగా పాడేరు ఏఎస్పీ కార్యాలయంలో ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. యువత సంఘ విద్రోహక శక్తులకు దూరంగా ఉండాలన్నారు. పరుగు పోటీలు మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కిశోర్, డీఎస్పీ జగన్మోహన్, పాడేరు, జి. మాడుగుల సీఐలు నల్లి సాయి, శ్రీనివాసరావు, ఎస్ఐ భరత్‌కుమార్ పాల్గొన్నారు.