కబాలి కోసం.. రాత్రి నుంచి థియేటర్ల దగ్గరే..!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా హై ఎక్స్పెక్టేషన్ల మధ్య తెల్లవారుజామునే విడుదలైంది. చాలావరకు థియేటర్లలో ఉదయం 4గంటల నుంచే సినిమా ప్రదర్శనలు మొదలైపోయాయి. రజనీ వీరాభిమానులు భారీ ఎత్తున అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తాము రాత్రంతా థియేటర్ల దగ్గరే ఉన్నామని, రాత్రి 11 గంటలకే వచ్చి అక్కడ బ్యానర్లు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టామని చెన్నైలోని కాశీ థియేటర్ వద్ద మదన్ కుమార్ అనే అభిమాని చెప్పాడు. 65 ఏళ్ల హీరో మలేషియా నుంచి వచ్చిన డాన్ పాత్రలో నటించిన ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే కబాలి ఫీవర్ దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ మొదలైపోయింది. ఒమన్ లాంటి దేశాల్లో కూడా కబాలి టికెట్లు కొనడానికి భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించాయి. ఈ విషయాన్ని రజనీ అభిమాని ఒకరు తన ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను పోస్ట్ చేశారు.
రజనీ సినిమా ఎప్పుడో ఒకప్పుడు చూస్తే కుదరదని, మొట్ట మొదటి రోజు.. అది కూడా మొట్ట మొదటి షో మాత్రమే చూడాలని, అందుకే గత కొన్ని రోజులుగా టికెట్ల కోసం నిద్రాహారాలు మాని ప్రయత్నించానని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సుమంత్ చెప్పాడు. చెన్నై నగరంతో పాటు మదురై లాంటి ప్రాంతాల్లో కూడా ఉదయం 3 గంటలకే కబాలి విడుదలైంది. మొదటి వీకెండ్లో.. అంటే ఈ మూడు రోజుల పాటు మదురైలో దాదాపు 300 షోలు ప్రదర్శిస్తారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, అమెరికా లాంటి దేశాల్లో గురువారం రాత్రే ప్రీమియర్ షోలు వేశారు. అమెరికాలో విడుదలకు ముందే బుక్ చేసుకున్న టికెట్లతో దాదాపు 7 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చేశాయి. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లోనూ విడుదలైంది. మలయా భాషలోకి డబ్ చేసిన వెర్షన్ ఈనెల 29.. అంటే వచ్చే శుక్రవారం విడుదల అవుతుంది.