కమల్’ ఎఫెక్ట్
♦ ప్రభుత్వానికి నోటీసు
తమిళసినిమా: లోకనాయకుడు కమల్ చేసిన అవినీతి ఆరోపణలు ప్రభుత్వానికి నోటీసులు అందేలా చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ అవినీతి గుట్టు రట్టు చేయాలని అభిమానులకు కమల్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మంత్రుల ఫోన్ నెంబర్లు సైతం వారి బయోడేటాల నుంచి తొలగించబడ్డాయి. దీనిపై డీఎంకే ఎమ్మెల్యే పళనివేల్ త్యాగరాజన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాగా ప్రభుత్వ వెబ్‌సైట్స్‌లో మార్పులేమిటో, మంత్రుల వివరాలు, ప్రత్యేక ఖాతాలు మొత్తం మూసివేయడానికి గల కారణాలు ఏమిటోనని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ రెండు వారాల గడువుతో ప్రభుత్వానికి ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు.