పంతంగి పంతం
చిత్రహింసకు విచిత్ర సమాధి
గ్రామీణ మహిళకు అవమానం అంటే ఏంటో తెలియదు!
తాము అవమానానికి గురువుతున్నారన్నది గ్రహించలేని వ్యవస్థలో
కూరుకుపోయారేమో అనిపిస్తుంది.
అత్తమామల సేవలు, పిల్లల పెంపకం, భర్తకు ఊడిగం, ఇంటి పని, కూలి పని...
ఇంత చేస్తున్నా...
గుర్తింపు మాట దేవుడెరుగు... అవమానం మాత్రం రోజూ మింగాల్సిన ముద్దే.
ఇది కాకుండా అప్పుడప్పుడూ... చీత్కారాలు, చిత్రహింసలు!
ఇంకొన్నిసార్లు చావు దెబ్బలే!
పంతంగి పంతం పట్టింది.
భార్యను చంపిన భర్త ఇంటి ముందే ఆవిడ సమాధి కట్టింది.
కట్టింది... ఈ దుర్మార్గపు వ్యవస్థను కూల్చడానికే.
చిత్రహింసకు ఇంతకంటే విచిత్రమైన సమాధి మనం ఎప్పుడూ చూసి ఉండం.
హైదరాబాద్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ గ్రామం. పేరు పంతంగి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉండే ఈ గ్రామంలో నాలుగు నెలల క్రితం ఓ దారుణ హత్య జరిగింది. మిర్యాల శ్రీశైలం అనే అతను తన భార్య పార్వతమ్మను తలపై రోకలిబండతో బాది చంపాడు.
ఊరు ఊరంతా ఈ సంఘటనతో అదిరిపోయింది. పంచనామా తర్వాత అందరిలాగే పార్వతమ్మ మృతదేహాన్ని కూడా శ్మశానంలో ఖననం చేసేవారే! కానీ, ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితుడి ఇంటి ఎదుటే మృతదేహంతో ఆందోళనకు దిగారు ఆ గ్రామ మహిళలు.
అయితే శ్రీశైలం కుటుంబ సభ్యుల నుంచి స్పందన కరువైంది. దీంతో నిందితుని ఇంటి ఎదుటే గుంతను తవ్వి శవాన్ని పూడ్చిపెట్టారు. దానిపై సమాధిని నిర్మించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల సహకారంతో నిందితుని ఇంటి పక్కనే ఉన్న రెండెకరాల స్థలంలో పార్వతమ్మ మృతికి స్మారకంగా స్థూపాన్ని నిర్మించారు. అక్కడే సంతాపసభ నిర్వహించారు. స్త్రీలపై జరిగే ఇలాంటి కిరాతక చర్యలకు పూనుకునేవారికి ఈ సంఘటన ఓ గుణపాఠం కావాలని నినదించారు.
అసలు ఏం జరిగిందంటే...
పార్వతమ్మ వయసు 24, శ్రీశైలం వయసు 28. ఇద్దరిదీ ఒకే గ్రామం. నాలుగేళ్ల క్రితం వీరికి వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి శ్రీశైలం నిత్యం పార్వతమ్మను వేధింపులకు గురి చేసేవాడు. అతనికి అతని కుటుంబసభ్యులూ మద్దతుగా ఉండేవారు. ఈ వేధింపులు తాళలేక పార్వతమ్మ ఆర్నెల్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. శ్రీశైలం అప్పుడప్పుడు పార్వతమ్మ దగ్గరికి వెళ్లి, ఇంటికి రమ్మని పిలిచేవాడు. పార్వతమ్మ ససేమిరా అనేది. రెండు నెలల క్రితం మళ్లీ పార్వతమ్మ దగ్గరికి వెళ్లిన శ్రీశైలం ‘ఇంటికి రమ్మని, లేదంటే కత్తిపీటతో కోసుకుంటా’నని బెదిరించాడు.
ఆమె భయపడి కత్తిపీటను లాక్కుంది. శ్రీశైలమే చాకుతో చేయి కోసుకున్నాడు. ఇంటికి రమ్మని పిలిచినందుకు పార్వతమ్మే తనను కత్తితో కోసిందని ఊర్లో అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య సమస్య మరింత జటిలమైంది. నెల రోజుల తర్వాత శ్రీశైలం మళ్లీ పార్వతమ్మ వద్దకు వెళ్లాడు. ఇంటికి రమ్మని అడిగాడు. ‘కత్తితో చేయి కోసిందెవరో తేలాలి, ఈ విషయం ఊళ్లో అందరికీ తెలియాలి. అప్పుడే వస్తాన’ని చెప్పింది. అందుకు శ్రీశైలం పెద్ద మనుషుల సమక్షంలో తప్పు ఒప్పుకుంటానని చెప్పాడు.
తప్పు ఒప్పుకున్ననాడే వస్తానని చెప్పి, తన పనిలోకి వెళ్లిపోయింది పార్వతమ్మ. తనను భార్య ఏ మాత్రం లెక్కచేయడం లేదని కోపంతో ఉడికిపోయాడు శ్రీశైలం. అక్కడే ఉన్న రోకలిబండను అందుకుని, పార్వతమ్మ కోసం వెదుక్కుంటూ వెళ్లాడు. నీళ్ల సంపు వద్ద బట్టలు ఉతుకుతున్న పార్వతమ్మ కనిపించింది. ఆమె తలపై రోకలిబండతో మోదాడు.
దాంతో పార్వతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీశైలం, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. శ్రీశైలం జైలులోనే ఉన్నాడు. అతని కుటుంబసభ్యులు మాత్రం విడుదలయ్యారు. ఊర్లోకి వచ్చిన వారు ఇంటి ముందు సమాధి, స్మారకస్తూపాన్ని చూసి బెంబేలెత్తిపోయారు.
- కనకల లింగస్వామి
సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా
కరెక్టు కావచ్చు కానీ...
పార్వతమ్మను క్రూరంగా హత్య చేసిన భర్త, అత్తమామలను రెండు రోజుల్లోనే రిమాండ్ చేశాం. పకడ్బందీ సాక్ష్యాలతో చార్జిషీటు వేశాం. ఇక అతని ఇంటి ముందే పార్వతమ్మ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం సామాజిక న్యాయపరంగా ప్రజలకు సమర్థనీయమైన చర్యగా అనిపించినా, చట్టపరంగా ఇది సరికాదు.
- భూపతి గట్టుమల్లు
పోలీస్ ఇన్స్పెక్టర్,
చౌటుప్పల్
మరణ శిక్ష విధించినా తక్కువే
అన్యాయంగా నాబిడ్డను పొట్టన పెట్టుకుండు, నా ఇంటికే వచ్చి, ఇక్కడున్న నాబిడ్డను కొట్టిచంపిండు. వాడికి మరణశిక్ష విధించినా తక్కువే. జీవితాంతం జైలులోనే ఉంచాలి. ఇంటి ముందు శవాన్ని పూడ్చిపెడితే, వాళ్ల ఇంటిని ధ్వంసం చేశామని, ఇంట్లోని విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లామని మాపైనే, 18మందిపై పోలీసు కేసు పెట్టిండ్రు. కోర్టు చుట్టు తిరుగుతున్నం.
- కడగంచి బీరప్ప
పార్వతమ్మ తండ్రి
మరో మహిళకు జరగకూడదు
పార్వతమ్మ తల్లిదండ్రులకు ఇద్దరే కూతుళ్లు. పెద్ద కూతురే పార్వతమ్మ. పెళ్లి అయిన నాటి నుంచే పార్వతమ్మను నానా రకాలుగా వేధింపులకు గురి చేసేవాడు శ్రీశైలం. ఏ పనీచేసేవాడు కాదు. కుటుంబ సభ్యులు కూడా అతనికి వంతపాడారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటిలో తలదాచుకుంటున్న పార్వతమ్మను ఆమె బతుకేదో ఆమెను బతకనీయకుండా దారుణంగా చంపాడు. మరో మహిళకు ఇలా జరగకూడదు.
- బోయ కవిత, గ్రామస్థురాలు
పార్వతమ్మ మరణాన్ని అంతా తలుచుకోవాలి
భార్యలను వేధించే వారు పార్వతమ్మ మరణాన్ని తలుచుకోవాలి. ఆ కుటుంబంలో అలుముకున్న చీకట్లు తమ జీవితంలోనూ పొడసూపవచ్చని గుర్తించాలి. నేరస్థుడి కుటుంబ సభ్యులు పార్వతమ్మ సమాధిని, స్థూపాన్ని చూసి నిత్యం పశ్చాత్తాపపడాలి. అందుకే వారి ఇంటి ఎదుటే సమాధిని కట్టించాం.
- కడగంచి ధనమ్మ
గ్రామస్థురాలు