భారతీయ అమెరికన్‌కు యంగ్ సైంటిస్ట్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డును ఈ ఏడాదికిగానూ కరణ్ జెరాత్ (18) అనే భారతీయ అమెరికన్ గెలుచుకున్నాడు. సముద్రగర్భంలోని చమురుబావుల నుంచి చమురు, సహజ వాయువు, నీటి లీకేజీని వెంటనే అరికట్టగల పరికరాన్ని కనిపెట్టినందుకు కరణ్‌కు ఈ అవార్డు లభించింది. శుక్రవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్ నగరంలో జరిగిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్-2015లో కరణ్ ఈ అవార్డు అందుకున్నాడు.
అవార్డు కింద సుమారు రూ. 31 లక్షలు (50 వేల డాలర్లు) అతనికి లభించాయి. అలాగే ‘ఇండో-యూఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరం విజి ట్ టు ఇండియా అవార్డు’కు ఎంపికైన ఐదుగురు విద్యార్థుల్లో ఒకడిగా నిలిచాడు. కరణ్‌తోపాటు మరో ఇద్దరు టీనేజర్లు ఇదే అవార్డును గెలుచుకున్నారు. హెచ్ఐవీ వల్ల సోకే ఇన్ఫెక్షన్లను త్వరగా నిర్ధారించేందుకు నూతన విధానాన్ని ఒకరు కనిపెట్టగా విమానాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచే సాఫ్ట్‌వేర్‌ను మరొకరు రూపొందించారు.