కాంట్రాక్టు కార్మికుల పోరుబాట
‘హైపవర్’ వేతనాల కోసం డిమాండ్
జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం
విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మిక మహిళలు
గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2013లో జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ కమిటీ (హెచ్పీసీ) వేతనాల కోసం ఇక పెద్ద ఎత్తున ఉద్యమం సాగనున్నారు. అన్ని ఏరియాలలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతృత్వంలో పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం ఇటీవల కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోగా...ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేయూ, ఐఎన్టీయూసీ, బీఐటీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీవీ సంఘాల ఆధ్వర్యంలోని కాంట్రాక్టు కార్మిక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాలుగా హైపర్ కమిటీ వేతనాలు, బోనస్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలోని జీఎం కార్యాలయాల ఎదుట దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంట్రాక్టు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.
ఇవీ డిమాండ్లు....
సకలజనుల సమ్మె వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల.
ఎన్సీడబ్ల్యూయూ–9లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, అలవెన్స్‌లు, సౌకర్యాలను నిర్ణయించి అమలు చేయాలి.
సింగరేణిలో సీఐఎల్ ఆదేశాల ప్రకారం 8.33 శాతం బోనస్‌ను అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలి.
అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి.
సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలి.
ఓబీ డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలి.
ఇతర విభాగాల వారిని సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి.
సెలవులు, బట్టలు, విద్య, వైద్యం, రక్షణ, నష్టపరిహారం చర్యలు, సౌకర్యాలను అమలు చేయాలి.
చట్టబద్ద హక్కులను అమలు చేయాలి.
సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్లను వెంటనే కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి.
అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్‌ను వర్తింపజేయాలి.
సింగరేణి లాభాలలో ఇస్తున్న బోనస్‌ను పర్మినెంట్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి.