పోరుగడ్డ మధిర
మధిర, న్యూస్‌లైన్: పోరాటాల పురిటిగడ్డ మధిర అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. నాటి నుంచి 2009 ఎన్నికల వరకు మధిర నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ ఒకసారి, కాంగ్రెస్ ఏడు సార్లు, సీపీఎం ఐదు సార్లు, టీడీపీ ఒకసారి గెలుపొందాయి. 1952లో తొలిసారి నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 55,400 ఓట్లు ఉండేవి. 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మకంటి సత్యన్నారాయణరావు, తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ పార్టీకి చెందిన ఎస్పీ రావుపై 2,587 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
1962 నాటికి నియోజకవర్గ ఓట్లు 61,466కు చేరాయి. ఆ ఎన్నికల్లో 49,792 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య స్వతంత్ర అభ్యర్థి ఆర్. శంకరయ్యపై 5,456 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 నాటికి 76,526 ఓట్లు ఉండగా 61,736 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య, సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై 10,404 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, సీపీఎం మధ్యనే సాగుతుండేది. ఈ సారి కూడా అదేపునరావృతం కావచ్చని విశ్లేషకుల అంచనా.
నియోజకవర్గం నుంచి శీలం సిద్దారెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు వంటి నేతలు ఘనతికెక్కారు. శీలం సిద్దారెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా, బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శాసనసభ పక్ష నేతగా పలుమార్లు పనిచేశారు.
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు...
1972లో దుగ్గినేని వెంకట్రావమ్మ సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు.
1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి బండారు ప్రసాదరావు జనతాపార్టీకి చెందిన మద్దినేని నర్సింహారావుపై గెలిచారు.
1983లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన శీలం సిద్దారెడ్డి సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.
1985లో సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు.
1989లో బోడేపూడి వెంకటేశ్వరరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు.
1994లో బోడేపూడి వెంకటేశ్వరరావు శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు. శాసన సభ్యునిగా కొనసాగుతూ బోడేపూడి అకాలమృతి చెందారు.
1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య తన సమీప అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ తొలిసారిగా మధిర నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిని బరిలో నిలిపింది.
1999 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యపై టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అప్పట్లో ఎమ్మార్పీఎస్ కూడా పోటీలో ఉంది.
2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21,443 ఓట్లతో విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో కట్టా వెంకటనర్సయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కూడా పోటీచేశారు.
2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,83,475 ఓట్లు ఉండగా 1,60,002 ఓట్లు పోలయ్యాయి. మధిర నియోజకవర్గ ఎన్నికల చరిత్రలోనే 86.93 శాతం పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధిక ఓట్ల నమోదులో రాష్ట్రంలో రెండోస్థానంలో నియోజకవర్గం నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లోనూ రాజశేఖరరెడ్డి చరిష్మా బాగా పనిచేసింది. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయానికి దోహదపడింది. తన సమీప సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై భట్టి 1417ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న జరగబోయే మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక రసవత్తరం గా మారనుంది. గత ఎన్నికల్లో విడిగా పోటీచేసి దాదాపు 15వేల ఓట్లు సాధించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. నూతనంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. వైఎస్ఆర్సీపీ, సీపీఎం పొత్తుతో మరోసారి సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నా రు. కాంగ్రెస్, సీపీఐతో జట్టుకట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క మరో పరీక్షకు సిద్ధమయ్యారు. తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి బొమ్మెర రామ్మూర్తి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పోటీలో ఉన్నారు. గతంలోని రాజకీయ సమీకరణాలకు, నేటి సమీకరణాలకు పూర్తి తేడా కనిపిస్తోంది. దాదాపు పోటీ సీపీఎం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి మధ్యే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
2008-09 పునర్విభజనకు ముందు మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. పునర్విభజన తర్వాత మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌కు తోడు చింతకాని, ముదిగొండ మండలాలు వచ్చి చేరాయి. వైరా ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా, తల్లాడ సత్తుపల్లి నియోజకవర్గంలో కలిసిపోయింది.