జాదవ్, ఖడీవాలే సెంచరీలు
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ బౌలర్లు పేలవ ప్రదర్శనతో తొలి రోజే ప్రత్యర్థికి దాసోహమన్నారు. ఫలితంగా మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ (231 బంతుల్లో 175 బ్యాటింగ్; 24 ఫోర్లు, 1 సిక్స్), హర్షద్ ఖడీవాలే (194 బంతుల్లో 107; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.
దాంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 32 పరుగులకే మహారాష్ట్ర 2 వికెట్లు కోల్పోగా...జాదవ్, ఖడీవాలే మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. జాదవ్‌తో పాటు మొత్వాని (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. రవికిరణ్, షిండే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచిన మహారాష్ట్ర ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రవికిరణ్ చక్కటి బౌలింగ్‌తో వరుసగా తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను ఆనందంలో ముంచెత్తాడు. ఖురానా (19) ఎల్బీగా వెనుదిరగ్గా...ఫామ్‌లో ఉన్న విజయ్ జోల్ (4) ఖాద్రీకి క్యాచ్ ఇచ్చాడు.
అయితే ఇక్కడి నుంచి మహారాష్ట్ర పుంజుకుంది. హైదరాబాద్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాదవ్, ఖడీవాలే ధాటిగా బ్యాటింగ్ చేశారు. చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగెత్తించారు. ఎనిమిది మంది హైదరాబాద్ బౌలర్లు ప్రయత్నించినా ఈ జోడి జోరును ఆపలేకపోయారు.