స్టే విధింపునకు హైకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: ఆలయం కూల్చివేతను అడ్డుకోవాలంటూ పిటిషన్ దాఖలుచేసిన కిర్పాల్ కో-ఆపరేటివ్ గ్రూపు హౌసింగ్ సొసైటీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ సొసైటీకి డీడీఏ సదరు స్థలాన్ని కేటాయించిందని రుజువు చేసుకునేందుకు కిర్పాల్ కో-ఆపరేటివ్ గ్రూపు హౌసింగ్ సొసైటీ తగు ఆధారాలు చూపలేదని పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ వి.కె.శాలి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా సదరు సొసైటీ నగరంలోని ఐపీ ఎక్స్టెన్షన్లో ఓ ఆలయాన్ని నిర్మించింది. అయితే ఈ స్థలం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)కి చెందినది. సరైన పత్రాలు సమర్పించకపోకపోయినట్టయితే తామేమీ చేయలేమంది.
తగినంత సిబ్బందిని పంపండి
స్థానిక ఐపీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేత కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)కి తగినంత సిబ్బందిని పంపాలంటూ పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ సంస్థ కోరిన మూడురోజుల వ్యవధిలోగా పంపాలంటూ జస్టిస్ వి.కె. షాలి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఆ ప్రాంతంలో యథాతథస్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించినప్పటికీ అక్కడ అక్రమ నిర్మాణాలు ఆగడం లేదని డీడీఏ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
కొంతమంది తొలుత అక్కడ చిన్న గదిని నిర్మించారని, ఆ తర్వాత దానిని దేవాలయంగా మార్చేశారని తెలిపింది.అంతటితో ఆగకుండా అక్కడ మొక్కలు కూడా నాటారని సదరు పిటిషన్లో పేర్కొంది. దీంతో భద్రత అవసరమంటూ పోలీసు శాఖకు అనేక పర్యాయాలు లేఖలు రాశామని, అయినప్పటికీ సరిగా స్పందించలేదని ఆరోపించింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా ఉత్తర్వులు జారీచేసింది.
పిటిషన్ స్వీకరణకు హైకోర్టు నో
నిబంధనలను గాలికొదిలేసి కార్యకలాపాలను నిర్వహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉబర్ కంపెనీపై దాఖలుచేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ను బీజేపీ మాజీ నాయకుడు గోవిందాచార్య దాఖలు చేశారు. ఉబర్ సంస్థలో గ్రీవియెన్స్ విభాగం లేదని, అయితే హైకోర్టు గతంలో జారీచేసిన ఆదేశాల ప్రకారం అది తప్పనిసరని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ నేతృత్వంలోని ధర్మాసనం... వెబ్ ఆధారిత సంస్థల్లో గ్రీవియెన్స్ విభాగాన్ని నియమించుకోవాలని ఆదేశించనందుకుగాను ప్రభుత్వంపై ఉల్లంఘన పిటిషన్ను దాఖలు చేయాలని సూచించింది.