బాంబులకే భయపడలేదు వీళ్లకు భయపడతానా?
ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెసోళ్లు అంటున్నారు.. నేనేదో భయపడుతున్నానని.. నా జీవితంలో ఎప్పుడైనా భయమనేది చూశారా తమ్ముళ్లూ..? బాంబులకే భయపడలా. 2003లో నామీద 24 క్లెమోర్ మైన్లు బ్లాస్ట్ చేస్తే అవి అటు ఇటు పోయినాయి తప్ప నన్నేమీ చేయలేదు! ఆ రోజు వేంకటేశ్వర స్వామి దగ్గరికి పోతా ఉంటే ఆయనే నన్ను కాపాడాడు. రాజకీయాల్లోనూ నేను ఎవరికీ భయపడ లేదు. ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు..’’ అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు ఆయన హైదరాబాద్‌లోని సనత్‌నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిగడ్డ, మెట్టుగూడ, హబ్సిగూడ, ఎల్బీనగర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు.
‘‘హైదరాబాద్‌లో నాకేం పని అంటున్నారు? నాకు లేని హక్కు ఎవరికుంది ఈ హైదరాబాద్‌లో. 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉన్నా. 1978లో వీరందరి కన్నా ముందే హైదరాబాద్‌లో అసెంబ్లీలో అడుగుపెట్టా. టీడీపీ పుట్టింది అసెంబ్లీ క్వార్టర్స్‌లో. తెలుగుజాతి ఎక్కడుంటే టీడీపీ అక్కడుంటుంది. ఆపదొస్తే అర్ధరాత్రి పిలిచినా నేను వస్తా..’’ అని బాబు పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ నా మానసపుత్రిక. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్ ప్రాంతమే. నేను హైదరాబాద్‌ను విస్తరించా. హైటెక్‌సిటీ రాకతో కుగ్రామమైన మాదాపూర్ ఇప్పుడు సిటీ అయింది.
హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరిగా. ఫైల్స్ చంకన పెట్టుకొని మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు బిల్‌గేట్స్‌ను కలిశా. ఎన్నో దేశాధినేతల చుట్టూ తిరిగి హైదరాబాద్‌కు కంపెనీలను, ఆదాయాన్ని తీసుకొచ్చా’’ అని చెప్పారు. హైదరాబాద్ గల్లీల్లో సిమెంటు రోడ్లు మొదలు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు వరకు తన హయాంలోనే వచ్చాయని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచానని పేర్కొన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి తెలంగాణలో జెండా ఎగురవేస్తుందని చెప్పారు. చంద్రబాబు రోడ్‌షోలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎ.రేవంత్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య, మాగంటి గోపీనాథ్, బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలి
టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్లి నన్నే తిడుతున్నారు. నేను బాధపడడం లేదు. ప్రజా జీవితంలో ఇవన్నీ మామూలే. టీడీపీ జెండా పట్టుకుని, సింబల్ పెట్టుకుని గెలిచి టీడీపీనే తిడుతున్నారంటే వారెంత పెద్ద మనుషులో అర్థం చేసుకోవాలి.’’ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులకు సహకరించి ఓట్తేస్తారా, గుణపాఠం చెపుతారా? అని ప్రశ్నించారు.
‘‘నీతి, నిజాయితీ ఉండాలి. రాజకీయాల్లో విలువలు ఉండాలి. కొంతమంది నాయకులకు నీతి లేకపోయినా ప్రజలకు నీతి ఉంది. ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలి. సనత్‌నగర్ నుంచి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?’’ అని మంత్రి తలసానిని ఉద్దేశించి పాటిగడ్డలో జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. ఇతర బహిరంగ సభల్లో సైతం ఫిరాయింపుదారులపై విమర్శలు గుప్పించారు.