ఆస్కార్ 2020 : కొరియోత్సవం
ప్రపంచ సినిమాల తీర్థస్థలి – ఆస్కార్ వేడుకలో– ఈసారి మన గాలి వీచింది. మన ఖండపు దేశానికి అభిషేకం జరిగింది. హాలీవుడ్ పండితులు దక్షిణ కొరియా సినిమా ‘పారసైట్’కు మరో మాట లేనట్టుగా టెంకాయ్ కొట్టి దండం పెట్టారు. నాలుగు అవార్డులు సమర్పించుకున్నారు. హాలీవుడ్ పెత్తనాన్ని కొరియన్ సినిమా ఓడించిన సందర్భం ఇది. కొరియా భాష గెలిచిన సన్నివేశం ఇది. నిజంగా ఇది ఆసియావాసుల గెలుపు. మన గెలుపు.
‘తలచినదే జరిగినదా? జరిగేదే తలచితిమా?’ అని పాడుతున్నారు ఆస్కార్ అవార్డులను తీక్షణంగా అనుసరించేవాళ్లు. అవును.. ఈ ఏడాది ఆస్కార్‌లో ఆశ్చర్యాలు పెద్దగా లేవు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. గెలుస్తారు అనుకున్న విజేతల పేర్లే ప్రకటించబడ్డాయి. ‘పారసైట్’ హవా ఉంటుంది అనుకున్నారు. అదే జరిగింది. ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ స్పీచ్ వినబోతున్నాం అనుకున్నారు. అలాగే అయింది. ఇలా ఆస్కార్ వేడుక జరగక ముందు జరిగిన చర్చల్లో ఊహించినవి ఊహించినట్టే ఎక్కువ శాతం జరగడం ఓ విశేషం. మరి విషయానికి వస్తే... 92వ అకాడమీ అవార్డుల వేడుక ఆదివారం సాయంత్రం లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది.
గత ఏడాది జరిగిన 91వ ఆస్కార్ వేడుకలానే ఈసారి కూడా వ్యాఖ్యాత లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది అత్యధికంగా 11 నామినేషన్లు దక్కించుకున్న ‘జోకర్’ కేవలం రెండు అవార్డులతో సరిపెట్టుకుంది. ‘ది ఐరిష్ మేన్’, ‘1917’, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాలు ఒక్కోటి పది నామినేషన్లు చొప్పున దక్కించుకుంటే ‘1917’ మూడు అవార్డులు, ‘వన్సపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ రెండు అవార్డులు, ‘ది ఐరిష్ మేన్’ ఒక్క అవార్డు గెలుచుకున్నాయి. ఆరు విభాగాల్లో నామినేషన్లు పొందిన ‘పారసైట్’ ఈ ఏడాది అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుపొందింది. ఇంగ్లిష్‌లో తెరకెక్కించని ఒక సినిమాకు ‘ఉత్తమ చిత్రం’ అవార్డు రావడం 92 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఆ విధంగా ‘పారసైట్’ చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. సౌత్ కొరియాకి తొలి ఆస్కార్ తీసుకెళ్లిన ఘనత కూడా ఈ సినిమాదే.
ఉత్తమ సహాయనటిగా తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు లారా డెర్న్. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘మ్యారేజ్ స్టోరీ’ సినిమాలో కీలక పాత్ర చేశారామె. ఈ ఆస్కార్ అవార్డు ఆమెకు బర్త్‌డే గిఫ్ట్‌గా మారింది. లారా ఫిబ్రవరి 10న జన్మించారు. ఆస్కార్ వేడుక ఫిబ్రవరి 9న జరిగింది. ‘‘బర్త్‌డే వేడుకలు కొంచెం ముందస్తుగా మొదలయ్యాయి’’ అని పేర్కొన్నారు లారా తోటి నటులు. ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్ పిట్ తన తొలి ఆస్కార్ అందు కున్నారు. ఉత్తమ సినిమాటో గ్రాఫర్‌గా ‘1917’ చిత్రానికిగాను రోజర్ డీకిన్స్ అవార్డు అందుకున్నారు. ‘బ్లేడ్ రన్నర్ 2049’ (2017) చిత్రానికి ఆయన తొలి ఆస్కార్ దక్కించుకున్నారు.
మళ్లీ దక్కింది
ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్
ఓక్విన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటారని అందరూ ఊహించినట్టే ఉత్తమ నటిగా రెనీజెల్ వెగర్ గెలుస్తారని కూడా ఊహించారు. ఆస్కార్‌కు ముందు జరిగిన ‘బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్స్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్, ఎస్ఏజీ (స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్) ల్లో ‘జూడి’ చిత్రానికిగాను అవార్డును అందుకున్నారు రెనీజెల్ వెగర్. హాలీవుడ్ ఐకాన్ జూడి గార్లాండ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘జూడి’. జూడి పాత్రను పోషించినందుకుగాను నటి రెనీజెల్ వెగర్ ఆస్కార్‌ను అందుకున్నారు. ఈ అవార్డును అందుకుంటూ తనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలందర్నీ గుర్తు చేసుకున్నారు రెనీజెల్. ‘‘జూడి గార్లాండ్ ఆస్కార్‌ను అందుకోలేకపోయారు. ఆమె వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ అవార్డు లభించిందని అనుకుంటున్నాను. మనకు స్ఫూర్తిగా నిలిచిన హీరోలే మనలోని అత్యుత్తమ ప్రతిభను బయటకు తీసుకురాగలరు. మనల్ని ఏకం చేయగలరు’’ అన్నారు రెనీజెల్. ఆమెకు ఇది రెండో ఆస్కార్. గతంలో ‘కోల్డ్ మౌంటేన్’ చిత్రానికి సహాయ నటిగా అవార్డు అందుకున్నారు.
సాహో బాంగ్ జూన్ హూ
ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ హూ
ఒక కల నెరవేరింది. చరిత్ర సృష్టింపబడింది. ఆస్కార్ అవార్డు కోసం కొరియా ప్రయత్నం ఫలించింది. ఆస్కార్ నుంచి ప్రశంసగా చిన్న జల్లు కోరుకుంటే జడివానే కురిపించింది. ఇటీవలే కొరియన్ సినిమా నూరేళ్ల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఎన్నో ప్రపంచ స్థాయి సినిమాలను, ప్రపంచస్థాయి ప్రతిభను ఇంతకాలంగా ప్రదర్శిస్తూనే ఉంది. అయినప్పటికీ కొరియన్ కళామతల్లికి నైవేద్యంగా పెట్టడానికి ఆస్కార్ లేకుండాపోయింది. ఆ దేశపు దర్శకులు పార్క్ చాన్ ఊక్, జాంగ్ హూన్, కిమ్ జీ ఊన్, లీ జూ–ఇక్ ఆస్కార్ తీసుకొస్తారనుకున్నా గతంలో నిరాశే మిగిలింది. కానీ ఆ లోటుని బాంగ్ జూన్ హూ తీర్చేశారు. ప్రస్తుతం కొరియా అంతా బాంగ్ జూన్ çహూను ‘సాహో’ అని కీర్తిస్తోంది.
ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘పారసైట్’ చిత్రం ఈ ఏడాది నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. మొత్తం 6 విభాగాల్లో (ఉత్తమ చిత్రం, విదేశీ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్) నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రం 4 అవార్డులు (ఉత్తమ చిత్రం, దర్శకుడు, విదేశీ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగల్లో) కైవసం చేసుకుంది. సుమారు 50 మిలియన్ల జనాభా ఉండే దేశం సౌత్ కొరియా. విస్తీర్ణంలో చూసుకుంటే చాలా చిన్నది. ఇరుకైనది. చోటు కోసమే అందరి పోటీ అంతా. నీకు మరింత చోటు కావాలంటే మరింత ధనికుడివై ఉండాలన్నది అక్కడి సిద్ధాంతం. సినిమా ఎప్పుడూ సమాజానికి అద్దమే అంటారు. అవును.. ‘పారసైట్’ కూడా అద్దమే. కొరియన్లో తయారైన అద్దం. కొరియాలో జరుగుతున్న వర్గ వివక్షను చూపెట్టిన అద్దం. ‘పారసైట్’లో కిమ్ కుటుంబం చాలా పేదది. ఆకలి తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత. మరోవైపు పార్క్ కుటుంబం చాలా డబ్బున్నది. అవసరమైన ప్రతీ పనికి పనివాళ్లను నియమించుకునేంత. చాలా తెలివిగా పార్క్ ఫ్యామిలీలోకి ప్రవేశిస్తారు కిమ్ కుటుంబ సభ్యులు.
ఆ తర్వాత జరిగే కథాంశమే ‘పారసైట్’. రెండు భిన్న జాతులకు చెందిన జీవుల మధ్య సావాసం ఏర్పడినప్పుడు, ఒక జీవి రెండోదానికి నష్టం కలిగిస్తూ లాభం పొందుతూ జీవిస్తుంది. లాభం పొందే దాన్నే పరాన్న జీవి (పారసైట్) అంటారు. క్లుప్తంగా కథనంతా టైటిల్లోనే చెప్పారు దర్శకుడు బాంగ్ జూన్ హూ. ‘‘కొరియా పరిస్థితులను ఆధారం చేసుకుని తయారు చేసిన కథ ఇది. కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇది కేవలం కొరియన్ సమస్య కాదు ప్రపంచంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య’’ అంటారు బాంగ్. ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాక ‘‘ఉత్తమ విదేశీ చిత్రానికి అవార్డు అందుకున్నప్పుడే ఈసారికి మన కోటా అయిపోయిందిలే అనుకున్నాను. కానీ థ్యాంక్యూ. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లేకి అవార్డులు వచ్చాయి.
నేను సినిమా గురించి నేర్చుకుంటున్న సమయంలో ‘మన పని ఎంత వ్యక్తిగతమైనది అయితే అంత సృజనాత్మకంగా ఉంటుంది’ అని మార్టిన్ స్కోర్సిసీ చెప్పిన మాటలు నాలో ఉండిపోయాయి. నేను మార్టిన్ సినిమాల ద్వారా చాలా నేర్చుకున్నా. గెలవడం సంగతి పక్కన పెట్టండి, ఆయనతో కలసి నామినేషన్ పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవేళ అకాడమీ వాళ్లు అనుమతి ఇస్తే ఈ అవార్డుని ఐదు భాగాలు చేసి ఈ విభాగంలో (దర్శకులు) నామినేట్ అయిన అందరికీ వాటా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రాత్రంతా తాగుతూనే కూర్చుంటాను’’ అని ప్రసంగాన్ని ముగించారు బాంగ్.
జోకర్ బన్ గయా హీరో
ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్
‘ప్రతిభకు పట్టాభిషేకం జరగడం ఆలస్యం అవుతుందేమో కానీ జరక్కుండా మాత్రం ఉండదు’... ఉత్తమ నటుడిగా ఓక్విన్ ఫీనిక్స్ పేరుని ప్రకటించినప్పుడు ఎంతో మంది అనుకున్న మాట ఇది. గతంలో ‘ది మాస్టర్’, ‘వాక్ ది లైన్’, ‘గ్లాడియేటర్’ చిత్రాలకుగానూ ఉత్తమ నటుడిగా నామినేట్ అయ్యారు ఓక్విన్. ఆస్కార్ తనదే అని ఆశగా ఎదురుచూశారు. నిరాశే ఎదురయింది. ఈసారి మాత్రం ఉత్తమ నటుడు ఓక్విన్ ఫీనిక్సే అని ముక్తకంఠంతో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కారణం ‘జోకర్’గా ఆయన నటన ముగ్ధుల్ని చేయడమే. ముఖానికి రంగేసుకుని కామెడీ చేసేవాడే మనందరికీ తెలిసిన జోకర్. కానీ తనలోని ట్రాజెడీని తెలియజెప్పిన చిత్రం ‘జోకర్’. కామిక్ బుక్స్‌లో బ్యాట్‌మేన్ ఎదుర్కొన్న విలన్ జోకర్. బ్యాట్‌మేన్ చిత్రాల్లో చాలా ఏళ్లుగా ఈ పాత్రను చూస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. అసలెవరీ జోకర్? అతని పుట్టుపూర్వోత్తరాలేంటి? అతను అలా మారడానికి (తయారవడానికి) కారణాలేంటి? అనే విషయాలను ప్రస్తావిస్తూ ‘జోకర్’ సినిమాను రూపొందించారు దర్శకుడు టాడ్ ఫిలిప్ (ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ పొందారు కూడా).
‘జోకర్’ కథ విషయానికొస్తే... సందర్భంతో పనిలేకుండా పగలబడి న వ్వుతుండే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతుంటాడు ఆర్థర్ ఫ్లెక్ (ఓక్విన్ ఫీనిక్స్). స్టాండప్ కమేడియన్ అవ్వాలన్నది అతని ఆశ. కానీ అతను నివసిస్తున్న గోతమ్ సిటీలో అప్పటికే నిరుద్యోగం, క్రైమ్ పెరిగిపోయి ఉంటుంది. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తన మానసిక æస్థితి తనని ఎలాంటిగా మనిషిగా మార్చాయి? తను ఎంచుకున్న మార్గమేంటి? అనే కథాంశంతో ‘జోకర్’ సినిమా తెరకెక్కింది. చట్ట విరుద్ధమైన పనులు చేసేందుకు ప్రేరేపించేలా ఉందని కొద్దిపాటి కాంట్రవర్శీ కూడా ఈ సినిమాను చుట్టుకుంది. అయినప్పటికీ విపరీతమైన జనాదరణ లభించింది. ఓక్విన్ నటనకు ఆస్కార్ అతని ఇంటికొస్తుంది అనే ప్రశంసల జల్లు కురిసింది. ఈ మధ్య జరిగిన ‘బాఫ్తా’, ‘క్రి టిక్స్ ఛాయిస్ అవార్డ్స్’, ‘ఎస్ఏజీ అవార్డ్స్’, ‘గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్’ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎన్వలప్స్‌లో కూడా ఓక్విన్ ఫీనిక్స్ పేరే ఉంది.
కొత్త ప్రపంచం తయారు చేద్దాం
ఓక్విన్ తన ప్రసంగంలో ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కొన్ని సీరియస్ సమస్యలను చర్చించారు. ‘‘ప్రస్తుతం మనందరం లింగ వివక్ష, వర్ణ వివక్ష, జంతు హక్కులు వంటి సమస్యలపై పోరాడుతున్నాం. ఒక జాతి (అది దేశం అయినా, వర్ణం అయినా, వర్గం అయినా సరే) మరో జాతిని కంట్రోల్ చేయొచ్చు, వాళ్లను దోచుకోవచ్చు అనే నమ్మకానికి విరుద్ధంగా పోరాడుతున్నాం. మనం చేసే ప్రతీ పనిలో ప్రేమ, కరుణ అనేవి ముఖ్య ఉద్దేశాలైతే మనందరం కలసి అందరికీ ఉపయోగపడే ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేయవచ్చు. గతంలో నేను చాలాసార్లు స్వార్థంగా ప్రవర్తించాను. కానీ ఈ హాల్లో (ఆస్కార్ థియేటర్లో వాళ్లను ఉద్దేశిస్తూ) ఉన్నవాళ్లు నాకు రెండో అవకాశం ఇచ్చారు. మనం తిరిగి పుంజుకోవడానికే ఈ రెండో అవకాశం’’ అని పేర్కొన్నారు ఫీనిక్స్.
సూట్‌గా చెప్పారు
అవార్డు ఫంక్షన్ జరిగేది ప్రతిభను పురస్కరించుకోవడానికే అయినా హంగూ ఆర్భాటాలను ప్రదర్శించడానికి కూడా. కాని ఓక్విన్ ఆ హంగు లేకుండా గత అవార్డు ఫంక్షన్లకు వేసుకున్న సూట్‌నే వేసుకొచ్చారు. ఏం అని అడిగితే ఎందుకూ... అనవసర ఖర్చు అని తేల్చేశారు.
ఒబామాకి ఆస్కార్
బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా నిర్మాణ సంస్థలో రూపొందిన ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. వాళ్ల నిర్మాణ సంస్థ ‘హయ్యర్ గ్రౌండ్’ నిర్మించిన తొలి డాక్యుమెంటరీ ఇది. ‘‘ఉత్తమ కథలన్నీ చాలా తక్కువ సందర్భాల్లోనే శుభ్రంగా, పర్ఫెక్ట్గా ఉంటాయి. నిజాలన్నీ అలాంటి కథల్లోనే దాగుంటాయి’’ అని ట్వీట్ చేశారు ఒబామా. ఈ అవార్డు ఫంక్షన్‌కి ఒబామా హాజరు కాకపోవడంతో ఈ సినిమా కో డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.
గ్లామర్ గౌన్లు
ఆస్కార్ వేడుకలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అంటే.. రెడ్ కార్పెట్‌పై స్టార్స్ ‘క్యాట్‌వాక్’. డిజైనర్ గౌన్లు, నగలతో చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నట్లుగా తయారై వస్తారు. ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న సింథియా ఎరివో తెలుపు రంగులో మెరిశారు. నగలేవీ ధరించకుండా సింపుల్‌గా వచ్చేశారామె. సిల్క్ గౌనులో నటి, గాయని స్కార్లెట్ జోహాన్సన్ అందరి కళ్లూ తనవైపు తిప్పుకున్నారు. ఆమె ధరించిన 27 క్యారెట్ల వజ్రపు చెవి దుద్దులు ఓ ఎట్రాక్షన్. లైట్ పింక్ కలర్లో తళుకులీనుతున్న బ్రీ లార్సన్ గౌన్ చూశారు కదా. çపూసలు, రాళ్లతో ఈ గౌనుని డిజైన్ చేశారు. మొత్తం 1200 గంటలు పట్టిందట. అంటే.. ఈ గౌను తయారీకి 50 రోజులు పట్టింది. ఇంకా నటి పెనిలోప్ క్రూజ్ నలుపు రంగు గౌను, నడుముకి ముత్యాల బెల్ట్‌తో, ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చార్లెస్ థెరాన్ నలుపు రంగు గౌనులో.. ఇలా తారలందరూ రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడిచి వచ్చిన వేళ కాలం స్తంభించిపోతే బాగుండు అనిపించే చిలిపి ఆలోచన రానివాళ్లు ఉండరేమో.
విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం: పారసైట్
ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్ (జోకర్)
ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
ఉత్తమ సహాయనటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ çహూ (పారసైట్)
ఉత్తమ సంగీతం: హిల్డర్ (జోకర్)
బెస్ట్‌మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: ఐయామ్ గాన్నా లవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారసైట్
మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్: బాంబ్ షెల్
ఉత్తమ డాక్యుమెంటరీ: అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్)
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్‌స్టోరీ 4
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బాంగ్ జూన్ (పారసైట్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917
బెస్ట్ సినిమాటోగ్రఫీ: 1917
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ బెస్ట్ లైవ్ యాక్షన్
షార్ట్ ఫిల్మ్ : ది నైబర్స్ విండో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ లిటిల్ ఉమెన్
తెల్ల రంగు ఆధిపత్యం
ఆస్కార్ అవార్డ్స్ విజేతల ఎంపికలో జరుగుతున్న ‘వర్ణ వివక్ష’పై ఐదేళ్లుగా ‘ఆస్కార్ సో వైట్’ అంటూ అవార్డు కమిటీ వివాదాలు ఎదుర్కొంటోంది. మహిళా డైరెక్టర్ల నామినేషన్ విషయంలోనూ వివాదం జరుగుతోంది. అందుకే ఈసారి ‘వెరీ మేల్.. వెరీ వైట్’ అంటూ పలువురు బాహాటంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. డైరెక్టర్ల విభాగంలో పురుషాధిక్య ధోరణి కనబడుతోందని, మొత్తం అవార్డుల ఎంపిక పరంగా తెల్ల జాతీయుల ఆధిక్యం కనబడుతోందని సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. 2017లో 18, 2018లో 13, 2019లో 15 మంది నల్ల జాతీయులకు నామినేషన్ దక్కింది. ఈసారి సంఖ్య బాగా తగ్గింది. జస్ట్ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు.
ఉత్తమ నటి విభాగంలో ఒకే ఒక్క నల్ల జాతీయురాలికే నామినేషన్ దక్కడం బాధాకరం అని నామినేట్ అయిన ‘సింథియా ఎరివో’ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల విషయంలోనే కాదు.. రెడ్ కార్పెట్ దగ్గర కూడా వర్ణ వివక్ష ఉందని, తెల్ల రిపోర్టర్ల హవానే ఉందన్నారామె. బ్లాక్ రిపోర్టర్స్కి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రతిభకు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని, రంగుకి కాదని అన్న సింథియా ‘వైట్ రిపోర్టర్స్’కి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. లోలా అనే బ్లాక్ ఫిమేల్ రిపోర్టర్ని పలకరించి, ‘నేను మాట్లాడాలి’ అంటూ చిన్న చాట్ సెషన్లో పాల్గొన్నారు.
మహిళా దర్శకులు ఎక్కడ?
హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఏ భాషలో అయినా ఇరవై ముప్పై మంది మేల్ డైరెక్టర్లు ఉంటే నలుగురైదుగురు ఫిమేల్ డైరెక్టర్లు ఉంటారు. ఆ ఉన్న తక్కువమందికి ప్రోత్సా హం దక్కకపోతే? ఇదే విషయాన్ని సూచిస్తూ నటి, దర్శక–నిర్మాత నటాలీ పోర్ట్మేన్ ఆస్కార్ అవార్డుల జాబితాలో నామినేట్ కాని మహిళా దర్శకుల పేర్లను తన డ్రెస్ మీద కుట్టించుకున్నారు. ఆమె డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ చేసిన పేర్లలో ‘హస్లర్స్’ చిత్రదర్శకురాలు లోరెనీ స్కఫారియా, ‘ది ఫేర్వెల్’ దర్శకురాలు లులు వ్యాంగ్, ‘లిటిల్ ఉమన్’ దర్శకురాలు గ్రెటి గెర్విగ్ తదితరులవి ఉన్నాయి. ఆస్కార్ చరిత్ర చూస్తే ఇప్పటివరకూ కాత్రిన్ బిజెలో, లీనా వెర్ట్ముల్లర్, జేన్ కాంపియన్, సోఫియా కొప్పోలా, గ్రెటి గెర్విగ్.. ఈ ఐదుగురు మాత్రమే నామినేషన్ దక్కించుకున్నారు.
వీళ్లల్లో 82వ ఆస్కార్ అవార్డ్స్ (2010)లో ‘ది హర్ట్ లాకర్’ చిత్రానికి గాను కాత్రిన్ బిజెలో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ని సొంతం చేసుకున్నారు. లేడీ డైరెక్టర్ల విభాగంలో తొలి ఆస్కార్ అందుకున్న దర్శకురాలు ఆమే కావడం విశేషం. ఈ రికార్డ్ భవిష్యత్తులో వేరే లేడీ డైరెక్టర్‌కి దక్కే ఆస్కారం లేదని, ఎందుకంటే అకాడమీ కమిటీ వివక్ష చూపిస్తోందని అర్థమవుతోందనే విమర్శలు ఉన్నాయి. అసలు ఫిమేల్ డైరెక్టర్స్‌కి నామినేషన్ దక్కడమే గగనం అనే పరిస్థితి. గడచిన పదేళ్లల్లో 2018లో ‘లేడీ బర్డ్’ సినిమాకిగాను గ్రెటా గెర్విగ్ నామినేషన్ దక్కించుకున్నారు.. అంతే.
జాలీ బిల్లీ
నటుడు, గాయకుడు బిల్లీ పోర్టర్ కొంచెం జాలీ టైప్. అమ్మాయిలా డ్రెస్ చేసుకుని సరదాపడేంత జాలీ మేన్. గతేడాది ఆస్కార్ అవార్డ్ వేడుకకు బిల్ నలుపు రంగు గౌనులో హాజరయ్యారు. ఈ ఏడాది కూడా అమ్మాయిలా డ్రెసప్ అయి వచ్చారు.
జూలియా బటర్స్
విశేషాలు
►యాంగ్ లీ (2012, లైఫ్ ఆఫ్ పై) తర్వాత ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నది బాంగ్ జూన్ హూ మాత్రమే.
►గతంలో ‘జోకర్’ పాత్రను పోషించినందుకు ఉత్తమ నటుడిగా (2008) హీత్ లెడ్జర్ ఆస్కార్ అందుకున్నారు. ఇప్పుడు ఓక్విన్ ఫీనిక్స్.
►‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’తో ఆకట్టుకున్న బాల నటి జూలియా బటర్స్ ఆస్కార్స్ వేడుకకు సాండ్విచ్ తెచ్చుకుంది. ‘‘కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లో ఏమీ పెట్టరు లేదా నాకు నచ్చేవి ఏమీ ఉండవు. అందుకే సాడ్విచ్ తెచ్చుకున్నాను’’ అని చెప్పింది జూలియా.