సాగు జాగు !
అరకొరగా నీటి విడుదల
గత ఏడాది ఆగస్టు 10 నాటికి 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఈ ఏడాది 82 వేల ఎకరాల్లోనే..
మచిలీపట్నం : కృష్ణాడెల్టా రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులు నిండినా దిగువకు అరకొరగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా బ్యారేజీ నుంచి 6300 క్యూసెక్కులు విడుదల చేశారు. రోజుకు 16 వేలకు పైగా క్యూసెక్కులు విడుదల చేస్తేనే శివారు ప్రాంతాలకు సాగునీరందే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద బుధవారం నాటికి 9.2 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇది 12 అడుగులకు చేరితేనే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ ఈఈ గంగయ్య చెప్పారు.
బుధవారం రైవస్ కాలువకు 3003 క్యూసెక్కులు, బందరు కాలువకు 1011, ఏలూరు కాలువకు 1021, కేఈబీ కాలువకు 1008 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అరకొరగా నీటిని విడుదల చేయడంతో రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో పూర్తిస్థాయిలో సాగునీటిని కాలువలకు విడుదల చేసేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
వరినాట్లు పూర్తయ్యేదెప్పటికో..
గత ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి జిల్లాలో 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది కేవలం 82 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు, మిగిలిన 5.52 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు ఆశించిన మేర వర్షం కురవలేదు. కాలువలకు నీరు విడుదల కాలేదు. జిల్లాలోని పలు మండలాల్లో 22,500 ఎకరాల్లో వేసిన వరి నారుమళ్లు నీరందక ఎదుగుదల లోపించి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అరకొరగా నీటిని విడుదల చేస్తుండటంతో శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడానికి మరో నాలుగు రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలకు నీరందించేందుకు కాలువల వెంటే తిరుగుతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు.
పశ్చిమకృష్ణాలో ప్రత్యామ్నాయం వైపు దృష్టి...
ఆగస్టు 15 నాటికి వరినాట్లు పూరి కాకుంటే 120 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే 1010, 1001 వరి వంగడాలను రైతులు సాగు చేయాల్సిందేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బీపీటీ 5204 వరి వంగడం 145 రోజులకు కోతకు వస్తుందని, సెప్టెంబరులో వరినాట్లు వేయాల్సి వస్తే ఈ రకం సాగు చేసేందుకు సమయం చాలదని అంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి పంటకు ప్రత్యామ్నాయం లేదని, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వంగడాలనే సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమకృష్ణా ప్రాంతంలోని తిరువూరు, నూజివీడు, కంచికచర్ల, గంపలగూడెం, బాపులపాడు మండలాల్లో వరికి బదులుగా మొక్కజొన్న సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 1.40 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగాల్సి ఉండగా వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో ఇంకా విత్తడం పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. నూజివీడు తదితర ప్రాంతాల్లో వేరుశనగ సాగు ఇంకా ప్రారంభం కాలేదని సెప్టెంబరులో ఈ సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారుల అంచనాగా ఉంది.
జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఆగస్టు 12 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 371.3 మిల్లీమీటర్లు. కురిసిన వర్షపాతం 260.0 మి.మీ. జూలై నెలాఖరు నాటికి 308 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 246.4 మి.మీ. మాత్రమే కురిసింది. 15 రోజులుగా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో నారుమళ్లు ఎండుతున్నాయి.