సూరీడుకి కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపీ రామచంద్రరావు మరోసారి తెరవెనుక చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు ఆయన పావులు కదుపుతున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. కూకట్పల్లి టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సూరీడును పోటీకి దించాలని ఆయన భావిస్తున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
కాగా,తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కేవీపీ హస్తముందని తెలిపింది. టీపీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించనివిధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. అయితే పొన్నాల నియామకం వెనుక తన ప్రమేయం ఉన్నట్టు వచ్చిన వార్తలను కేవీపీ ఖండించారు.