మొక్కు కోసం రెండు కిలోల నువ్వుల నూనె తాగింది
సంప్రదాయం, ఆచార వ్యవహారాలకు ఆదివాసీ గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. మండల కేంద్రమైన నార్నూర్‌లో ఆదివారం రాత్రి ఖాందేవ్ జాతర ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి సందర్భంగా తోడసం వంశస్థులు పూజలు చేసి డోలు వాద్యాల మధ్య పూజలు ప్రారంభించారు.
తోడసం వంశానికి చెందిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కును తీర్చుకోవడం ఆనవాయితీ. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకోవచ్చిన నువ్వుల నూనె సేకరిస్తారు. రెండు కిలోల నూనెను దేవుని సన్నిధిలో సోమవారం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశం ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి తమ మొక్కును తీర్చుకుంది.
గత రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాదితో మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని ఈ వంశం వారి నమ్మకమని ఆలయ పూజారి తోడసం ఖమ్ము, తోడసం సోనేరావ్ తెలిపారు.