పెళ్లిలో ఆత్మాహుతి దాడి.. రక్తపుటేరు
డెమాస్కస్: ఎప్పుడూ ప్రభుత్వ సంస్థలు, రద్దీ ప్రదేశాలు, కీలక స్థావరాలను లక్ష్యం చేసుకునే ఉగ్రవాదులు ఈసారి ఓ పెళ్లి వేడుకను టార్గెట్ చేసుకొని దాడి చేశారు. వివాహ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి దిగడంతో 30మంది అమాయకులు బలయ్యారు. 90మందికి పైగా గాయాలపాలయ్యారు. సిరియాలోని హసాక ప్రావిన్స్ లో ఓ కుర్దిష్ కళ్యాణ వేడుక వద్ద ఈ దాడి జరిగింది.
సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపిన వివరాల ప్రకారం హసాక, కామిష్లి అనే రెండు ప్రాంతాల మధ్య ఉన్న రహదారి పక్కనే ఉన్న ఓ పెద్ద వివాహ వేడుక హాల్ లోకి దూసుకొచ్చిన ఉగ్రవాది గుంపులోకి వెళ్లి అనూహ్యంగా పేల్చుకున్నాడని, దీంతో రక్తపు టేరులు పారినంతపనైంది. రెండు తనిఖీ ప్రాంతాలు దాటుకొని అతడు ఎలా లోపలికి వెళ్లగలిగాడనేది కూడా ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా తన బాధ్యతను ప్రకటించుకోలేదు.