చైర్మన్‌గిరి.. తమ్ముళ్ల కిరికిరి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీబీ) చైర్మన్‌గిరి కైవసానికి తమ్ముళ్లు కుస్తీ పడుతున్నారు. పదవి తమకిస్తేనే అవిశ్వాసంలో పాల్గొంటామని కొందరు డెరైక్టర్లు తెగేసి చెబుతుండటం గందరగోళానికి తావిస్తోంది. ఈ విషయంలో తొందరపడితే మొదటికే మోసం వస్తుందేమోనని టీడీపీ అధినేత ఆచితూచి అడుగేస్తున్నారు. ముందుగా చైర్మన్‌ను ఆ పదవి నుంచి దించాకే స్పష్టతనిస్తామని తేల్చి చెప్పినట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది.
చైర్పర్సన్ శ్రీదేవిపై అవిశ్వాసానికి టీడీపీ రంగం సిద్ధం చేయడం తెలిసిందే. కాంగ్రెస్ ఖాతాలోని చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వీరి సహకారంతో ఎట్టకేలకు అవిశ్వాసానికి తెర తీశారు. అయితే చైర్మన్‌గిరి ఎవరికనే విషయం తమ్ముళ్లలో చర్చకు తావిస్తోంది. అవిశ్వాసానికి మద్దతు పలికిన డెరైక్టర్లు కొందరు ఈ విషయంలో స్పష్టతకు పట్టుబడుతున్నారు. అవుకుకు చెందిన రఘునాథరెడ్డి, నాగలాపురానికి చెందిన శ్రీనివాసులు, నంద్యాలకు చెందిన వీరేంద్రసింహారెడ్డి, మరో డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఆ మేరకు టీడీపీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని అధినేత తేల్చి చెప్పడంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా ఆ తర్వాత పదవి తమకు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటని కొందరు డెరైక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టతనిస్తేనే మద్దతివ్వాలని వీరు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అవిశ్వాసానికి మద్దతిచ్చేందుకు కొందరు డెరైక్టర్లకు ఇప్పటికే టీడీపీ నేతలు కొంత మొత్తం ముట్టజెప్పగా.. ఆ మొత్తాన్ని చైర్మన్ అభ్యర్థి ద్వారా రాబట్టుకునేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.