కువైట్ మసీదులో ఆత్మాహుతి దాడి, 13 మంది మృతి
గల్ఫ్ దేశం కువైట్ రాజధాని కువైట్ నగరంలోని ఓ షియా మసీదులో ప్రధానమైన ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. దాంతో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. రంజాన్ మాసంలోని శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రార్థనలకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడని భద్రతాధికారి ఒకరు తెలిపారు. ఈ దాడి తామే చేశామని ఐఎస్ఐఎస్ చెబుతోంది.
మధ్యాహ్నం ప్రార్థనల సమయంలోనే ఈ ఆత్మాహుతి దళ సభ్యుడు మసీదులోకి ప్రవేశించాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అల్-ఇమామ్-అల్-సదీక్ మసీదులో ఈ దాడి జరిగింది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా, యెమెన్ దేశాల్లో ఇలాంటి దాడులే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఇంతకుముందు తెలిపింది.