మళ్లీ గెలుపే లక్ష్యం
► తిరిగి కాంగ్రెస్ గద్దెనెక్కాలి
► మీతో కలిసి పనిచేస్తా
► పార్టీ నూతన ఇన్చార్జ్ వేణుగోపాల్
► తొలిసారి నగరానికి రాక
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి కాంగ్రెస్ పార్టీనే గద్దెనెక్కాలని పార్టీ నూతన ఇన్చార్జ్ కే.వేణుగోపాల్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కొత్త బాధ్యతలు స్వీకరించాక తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆయనను పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ తదితర నాయకులు ఘనంగా సన్మానించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించాలన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవడంతోనే కేరళలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పొందామని చెప్పారు. అదే తప్పు తిరిగి కర్ణాటకలో పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. మీకు ఆదేశాలు జారీ చేయడానికి రాలేదని, మీ అందరితో కలసి పనిచేసి పార్టీని మళ్లీ గద్దెనెక్కించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
అందుకోసం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే ప్రణాళికను ప్రారంభించామన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి పార్టీ సీనియర్ నాయకుల వరకు అందరితో చర్చించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. కేపీసీసీ కొత్త అధ్యక్షుని నియామకంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, శాసనసభ సభ్యులు, నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానన్నారు.