ముందస్తుగా పాఠ్య పుస్తకాలు
మెదక్, న్యూస్‌లైన్: గడిచిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి విద్యాధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. వేసవి సెలవుల ప్రారంభం నాటికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాకు మొత్తం 20,72,623 పుస్తకాలు అవసరం కాగా ప్రస్తుతం మెదక్ పట్టణానికి 5,36,652 పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి.
నిల్వ ఉన్న 2,44,096 కలిపి బుధవారం నాటికి మొత్తం 7,80,748 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కాగా పదో తరగతికి ఈసారి సిలబస్ మారినప్పటికీ ఏప్రిల్ 23 నాటికే ప్రస్తుతం 9వ తరగతిలో ఉన్న ప్రతి విద్యార్థికి అన్ని టైటిల్స్ అందజేయనున్నారు. శుక్రవారం నుంచి మెదక్ కేంద్రం నుంచి నిర్ణీత షెడ్యూల్‌కనుగుణంగా పంపిణీ చేయనున్నట్లు పుస్తక నిల్వ కేంద్ర ఇన్చార్జి లక్ష్మీనర్సింహగౌడ్ తెలిపారు.
పంపిణీకి చర్యలు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విద్యార్థులకు 1994వ సంవత్సరం నుంచి అన్ని పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
కాగా గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల వరకూ పుస్తకాల పంపిణీ జరిగేది. ఈ జాప్యాన్ని నివారించడానికి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాణీమోహన్ 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ముందస్తుగా చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్రంలో 6.50 కోట్ల పుస్తకాల ముద్రణ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత జనవరి 3వ వారం నుంచి జిల్లాల గోదాములకు పుస్తకాల ను విడతల వారీగా తరలిస్తున్నారు.
అలాగే ఈ నెల 14 నుంచి మండల స్థాయి గోదాములకు, మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు పంపిణీ జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 9వ తరగతిలో ఉన్న విద్యార్థికి వచ్చే విద్యాసంవత్సరం పదో తరగతికి సంబంధించి పుస్తకాలను ఏప్రిల్ 23 వరకు అందజేస్తారు.
విద్యార్థులకు కావాల్సిన టైటిల్స్ ఇవే..
1వ తరగతికి ఆరు టైటిల్స్, 92,527 పుస్తకాలు అవసరం. రెండో తరగతికి 6 టైటిల్స్, 89,848 పుస్తకాలు, 3వ తరగతికి 10 టైటిల్స్ 1,33,914 పుస్తకాలు, 4వ తరగతికి 9 టైటిల్స్ 1,45,179 పుస్తకాలు. 5వ తరగతికి 10 టైటిల్స్, 1,72,076 పుస్తకాలు, 6వ తరగతికి 15 టైటిల్స్ (ఆంగ్లం, తెలుగు మీడియం) 2,39,919 పుస్తకాలు, 7వ తరగతికి 15 టైటిల్స్, 2,30, 138 పుస్తకాలు, 8వ తగరతికి 18 టైటిల్స్, 2,93. 575 పుస్తకాలు, 9వ తరగతికి 18 టైటిల్స్ 3.30 లక్షల పుస్తకాలు, పదో తరగతికి 18 టైటిల్స్ 3,45,075ల పుస్తకాలు అవసరమవుతాయి.