దేవాలయంలో విగ్రహంపై దాడి: నిందితులు పరారీ
భక్తుల రూపంలో ఆలయంలో ప్రవేశించడమే కాకుండా అపై ప్రార్థన చేస్తున్నట్లు నటిస్తూ మూల విరాట్ హనుమంతుని విగ్రహనికి నిప్పంటించిన సంఘటన పాకిస్థాన్ దక్షిణ సింధ్ ప్రావెన్స్ ప్రాంతంలోని లతీఫాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....ముసుగు ధరించిన ముగ్గురు యువకులు హనుమంతుని ఆలయంలోకి ప్రవేశించారు. రామభక్తుడిని ప్రార్థన చేస్తున్నట్లు నటిస్తూ... ఒక్కసారిగావారితో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆ విగ్రహంపై పోసి నిప్పు అంటించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసి తమకు సహాయం చేయండి అంటూ బిగ్గరగా అరుస్తూ పరుగులు తీశారు. దేవాలయంలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఆ పరిణామానికి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారు జనంలో కలసిపోయారు.
దేవాలయంలో దాడి వార్త తెలిసిన వెంటనే స్థానిక హిందువులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు నిరసనలు తెలిపారు.పోలీసులు దేవాలయానికి చేరుకుని జరిగిన సంఘటన విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారని పోలీసుల అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
స్థానికంగా మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 14న ఆ హనుమంతుడి దేవాలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు.మరో రెండు వారాలలో వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానిక హిందువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాడి ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.