పాల నురగలతో.. సిరులు కురిపిస్తాం
‘సాక్షి’ కథనం మహిళా లోకాన్ని కదిలించింది.. ఒక ఆలోచన మరో ఆవిష్కృతానికి మూలమైంది.. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి.. పాల నురుగులతో సిరుల వర్షం కురిపించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. తమ గ్రామంలో డెయిరీ సొసైటీ ఏర్పాటు చేసేందుకు లక్ష్మీనగర్ మహిళలు శనివారం వరంగల్ జిల్లా ముల్కనూర్‌కు బయల్దేరి వెళ్లారు. స్పందన ఫౌండేషన్, లక్ష్మీనగర్ వెల్పేర్ సొసైటీల సహకారంతో మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
‘‘లక్ష్మీనగరం.. ఓ క్షీర సాగరం’’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో రెక్కలు ముక్కలు చేసుకుని క్షీర విప్లవం సృష్టిస్తున్నా.. దళారులు లాభాపేక్షతో ఆ గ్రామ మహిళలు అనుకున్న లాభాలు సాధించలేకపోతున్నారు. లక్ష్మీనగర్‌లో డెయిరీ సొసైటీని ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం చేస్తే అనుకున్న లాభాలు ఆర్జించవచ్చన్న విషయాన్ని ‘సాక్షి’ కథనం ద్వారా తెలుసుకున్న వారిలో ఓ ఆలోచన అంకురించింది.
లక్ష్మీనగర్ గ్రామ అల్లుడైన పెండ్యాల ప్రసాద్ అనే ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ వీరికి అండగా నిలిచారు. స్పందన ఫౌండేషన్ సహకారంతో ఓ బస్సును అద్దెకు తీసుకొని 50 మంది మహిళలను వరంగల్ జిల్లా ముల్కనూర్‌లో గల పాల డెయిరీ సొసైటీ పరిశీలించేందుకు తరలివెళ్లారు. అక్కడి స్థితిగతులను చూసిన అనంతరం స్థానికంగా తామే ఓ పాడి పరిశ్రమ సొసైటీని ఏర్పాటు చేసుకొని పాల వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గ్రామాభివృద్ధి కోసం సంక్షేమ సొసైటీ...
ఎవరో వస్తారని.... ఏదోచేస్తారని ఎదురు చూడకుండా లక్ష్మీనగర్ గ్రామస్తులంతా కలిసి 2014 జనవరి 14న లక్ష్మీనగర్ వెల్పేర్ సొసైటీ ఏర్పాటు చేసుకుని ఓ వెబ్సైట్ సైతం రూపొందించుకున్నారు. బిందువులన్నీ కలిస్తేనే.. సింధువైనట్లు గ్రామస్తులంతా కలిసి తమకు తోచిన రీతిలో చందాలు పోగుచేసి రూ.8 లక్షలు జమచేశారు.
ఈ నిధులతో బాలవికాస్, స్పందన ఫౌండేషన్ సహకారంతో వాటర్ ఫ్లాంట్, జెనరిక్ మెడికల్ షాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 3న ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 11న ఉచిత వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమం, 13న స్వచ్ఛ లక్ష్మీనగర్ పేరిట పారిశుద్ధ్య కార్యక్రమం, జనవరి 14న భోగి మంటలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు బాపరావు, పెండ్యాల ప్రసాద్ తెలిపారు.