తమిళ మ్యాగజైన్‌పై దుమారం..
చెన్నై: మహిళలు, అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యానాలు చేస్తూ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించిన తమిళనాడులోని ఓ పత్రికపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. 'లెగ్గింగ్స్ ఆర్ వల్గర్ వేర్' అనే పేరుతో వచ్చిన ఈ కథనంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెడితే తమిళనాడులో 'కుముదం' అనే వార పత్రిక 'నేటి యువత హద్దులు దాటుతున్నారు. మహిళలు ధరించే లెగ్గింగ్స్ చాలా అసభ్యంగా ఉంటున్నాయంటూ' ఈ కథనాన్ని ప్రచురించింది. దీనితో పాటు కొన్ని ఫోటోలను కూడా ఆ పత్రిక... కవర్ పేజీపై ప్రచురించింది. దీంతో దుమారం చెలరేగింది. ఈ కథనాన్ని విమర్శిస్తూ కొంతమంది మహిళలు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఆడవాళ్లను అవమానిస్తున్న ఈ కథనంపై కుముదం పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఆడవాళ్ల దుస్తుల గురించి అసభ్యంగా రాసిన సదరు పత్రిక కవర్ పేజీపై అలాంటి ఫోటోలు ఎందుకు ప్రచురించారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా లెగ్గింగ్స్ ధరించిన యువతుల అనుమతి తీసుకోకుండా వారి ఫోటోలను ప్రచురించడంపై మరికొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యత అనేది చూసే కళ్ళలోనూ, మనసులోనూ ఉంటుంది తప్ప మహిళల్లో కాదంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు. అంతేకాదు దీనికి నిరసనగా 'స్కిన్ టైట్' దుస్తులతో వున్న ఫోటోలను ఆ పత్రికకు పంపాలంటూ సూచించారు.