Lifer
-
కిడ్నాప్..దోపిడీ కేసులో 9 మందికి జీవితఖైదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కిడ్నాప్‌లు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్‌ప్రాసిక్యూటర్ రజిని కథనం ప్రకారం... కాటేదాన్ టీఎన్జీఓ కాలనీ నివాసి శ్రీనివాస్‌కు జూబ్లీహిల్స్‌కు చెందిన రాహుల్ తన వద్ద అతీతశక్తులు గల పురాతన రైస్‌పుల్లర్ ఉందని నమ్మించాడు. శ్రీనివాస్ ఆ రైస్‌పుల్లర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2009 మే 14న శ్రీనివాస్, తన మిత్రుడు కృష్ణారెడ్డితో కలిసి తన ఇంటి వద్ద ఉండగా.. అక్కడికి రాహుల్ స్కార్పియో వాహనంలో వచ్చాడు. వాహనంలో అతడి మిత్రులు వెంకటదుర్గారావు, శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ధనుష్‌కుమార్, పోతరాజు, రామలింగప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి కూడా ఉన్నారు. రైస్‌పుల్లర్ చూపిస్తామని శ్రీనివాస్, ఆయన మిత్రుడు కృష్ణారెడ్డిని తమ వాహనంలో జూబ్లీహిల్స్ తీసుకెళ్లి ఓ ఇంట్లో బంధించారు. దాడి చేసి వారి వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో పాటు బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో శ్రీనివాస్ రూ.3 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి వారి నుంచి తప్పించుకుని మిత్రుల సహాయంతో శివరాంపల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొగల్పురా పోలీస్ స్టేషన్లో మరో కేసులో నిందితులుగా ఉండి అరెస్టయిన ఈ తొమ్మిది మందినీ కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరిపి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గాంధీ.. నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
పిల్లలు పుట్టలేదని భార్య హత్య : భర్తకు జీవిత ఖైదు
కరీంనగర్: పిల్లలు పుట్టడంలేదని భార్యను హత్య చేసిన భర్తకు కరీంనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గత వారంలో తీర్పు వెలువడే రోజున నిందితుడు బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ(32)కి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన బిస్మిల్లా అలియాస్ గౌసియాబేగంతో 2002లో పెళ్లి జరిగింది. వీరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. యూసుఫ్ అలీ బీడీ కంపెనీలో పనిచేసేవాడు. వీరికి సంతానం కలగలేదు. యూసుఫ్ అలీకి అప్పులు ఎక్కువైపోయాయి. పోలీసులు, స్థానికులు, గౌసియా కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అప్పులు తీర్చేందుకు తల్లిగారింటి నుంచి డబ్బు తెమ్మని యూసుఫ్ అలీ భార్యతో తరచూ గొడవపడేవాడు. రెండోపెండ్లి చేసుకుంటే సంతానం కలుగుతుందని, అలాగే డబ్బు కూడా వస్తుందని అతను భావించాడు. దాంతో అతను గౌసియాను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 2011 అక్టోబర్ 3న భార్యను తీసుకొని బైకుపై కామారెడ్డి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గంమధ్యలో నిజామాబాద్ జిల్లా గంభీరరావుపేటలోని ఎగువ మానేరు వద్ద నర్మాల ప్రాజెక్టు చూద్దామని భార్యను అక్కడకు తీసుకువెళ్లాడు. ఎగువమానేరులో పడి గౌసియా మృతి చెందింది. ఆమెను భర్తే నీటిలో తోసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యూసుఫ్‌పై పోలీసులు హత్యానేరం కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ నెల 11న విచారణ జరిగింది. ఫ్యామిలీ కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో యూసుఫ్ కోర్టుహాల్లోనే బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమవడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాంతో అతనిపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. తీర్పును వాయిదావేశారు. భార్యను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో మహ్మద్ యూసుఫ్ అలీకి న్యాయమూర్తి ఈ రోజు జీవితకాల శిక్ష విధించారు. -
జీవితఖైదీలను విడుదల చేయొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: వివిధ జైళ్లలో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయరాదని అన్ని రాష్ట్రాలను ఆదేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఇతర కేంద్ర సంస్థలు వాదించిన కేసుల్లో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్నవారిని విడుదల చేసేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా? లేదా? అన్నదానిపై జూలై 18 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 22న జరిగేంతవరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయంది. మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషులకు శిక్ష తగ్గించాలన్న తమిళనాడు ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్రం సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారిస్తోంది.