ఊడలు కాదు.. గోళ్లు!
మర్రి ఊడలను తలపిస్తున్న పొడవాటి గోళ్లతో పోజిచ్చిన ఈ వ్యక్తి పేరు శ్రీధర్ చిల్లాల్. ఉండేది పుణేలో. ఏకంగా 62 ఏళ్లపాటు పెంచిన ఆ గోళ్లతో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కేశారు. కానీ ఇందుకోసం చాలా కష్టాలే ఎదుర్కొన్నారు. హైస్కూలులో ఉండగా తన టీచర్ చేతి గోరును అనుకోకుండా విరగ్గొట్టడంతో ఆయన కోప్పడ్డారట. పొడవైన గోళ్లు పెంచడం అంత తేలికైన విషయం కాదు అని టీచర్ చెప్పేసరికి శ్రీధర్‌లో పట్టుదల పెరిగింది. అంతే.. అప్పటి నుంచి తన చేతి గోళ్లను పెంచడం ప్రారంభించారు. ఎవ్వరు వద్దన్నా, చివరకు టీచరే వ్యతిరేకించినా సరే విన్లేదు. గోళ్ల కారణంగా శ్రీధర్‌కు సరైన ఉద్యోగం కూడా రాలేదు. పెళ్లీడు వచ్చినా పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.
అయినా సరే గోళ్లను కట్ చేయడానికి మాత్రం ఆయన ససేమిరా అన్నారు. చివరకు 29 ఏళ్ల వయసులో బంధువుల అమ్మాయితో ఎలాగోలా పెళ్లి కుదిరింది. అప్పటివరకు రెండు చేతుల గోళ్లూ పెంచిన శ్రీధర్.. భార్య మాట విని కుడి చేతి గోళ్లు కట్ చేశారు. మొత్తమ్మీద 1952 నుంచి ఇప్పటివరకు ఎడమచేతి గోళ్లను కట్ చేయకుండా అలా ఉంచేయడంతో అవి ఇలా పెరిగిపోయాయి. వీటన్నింటినీ కలిపితే దాదాపు 30 అడుగుల పొడవు ఉంటుంది. ఇటీవలే తన పేరు గిన్నిస్‌లోకి ఎక్కడంతో ఇక ఆ గోళ్లను కట్ చేసి, మ్యూజియంలో భద్రపరచాలని 80 ఏళ్ల శ్రీధర్ భావిస్తున్నారు.