Louis Berger
-
'ఆ మాజీ సీఎం లంచాలు తీసుకున్నారు'
గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమావో ఇద్దరూ కూడా లూయీస్ బెర్జర్ స్కాములో లంచాలు తీసుకున్నారని గోవా పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే చర్చిల్ అలెమావో అరెస్టయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి గోవా రాష్ట్రానికి భారీ నష్టం కలిగించారని వాళ్ల రిమాండు దరఖాస్తులో పోలీసులు తెలిపారు. 2010-11 సంవత్సరంలో వాళ్లకు లంచాలు ఇచ్చినట్లు లూయీస్ బెర్జర్ మాజీ అధికారి ఒకరు మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించిన విషయాన్ని కూడా రిమాండు దరఖాస్తులో పేర్కొన్నారు. వెయ్యి కోట్ల తాగు, మురుగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టును ఓ కన్సార్షియంకు అప్పగించేందుకు వీళ్లు దాదాపు 6.5 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్‌కు రూ. 50-60 లక్షల వంతున రెండు సందర్భాల్లో చెల్లించారని, అలెమావోకు ఒకసారి 50 లక్షలు, మరోసారి 15 లక్షలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్లిద్దరూ కూడా ఆరోపణలను ఖండిస్తున్నారు. -
'మాజీ సీఎం, మంత్రులకు ముడుపులిచ్చాం'
వాషింగ్టన్: సంచలనం రేపిన నీటి ప్రాజెక్టుల్లో ముడుపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికా కేంద్రంగా నడుస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ సంస్థ.. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎవరెవరికి ఎంతెత ముడుపులిచ్చిందో ఫెడరల్ కోర్టుకు వెల్లడించింది. ఆ సంస్థ ప్రతినిధులు రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు కోర్టుకు చెప్పిన వివరాలను బట్టి.. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు దాదాపు రూ.6 కోట్లు లంచంగా ఇచ్చి లూయీస్ కంపెనీ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నమని, ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన ఆధారాలను సేకరించేపనిలో ఉన్నామని గోవా పోలీసులు చెప్పారు. 2009లో గోవాలో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి, సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టుల్లో ఈ ముడుపుల వ్యవహారం చోటుచేసుకుంది. కాగా, మాజీ సీఎం కామత్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా.. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే లూయీస్ బెర్గర్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది. కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మొదట లంచం తీసుకున్న వివరాలను వెల్లడించడానికి కోర్టు నిరాకరించినప్పటికీ తర్వాత ఆ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి. బెర్గర్ సంస్థ ప్రతినిధులకు విధించే శిక్షలకు సంబంధించి నవంబర్‌లో తుది తీర్పు వెలువడనుంది. ఈ కంపెనీకి హైదరాబాద్ నగరంలోనూ ఓ కార్యాలయం ఉడటం గమనార్హం. -
అమెరికా కంపెనీ.. ఆమ్యామ్యా కహానీ
వాషింగ్టన్: ప్రజలకు మంచినీరు అందించే ప్రాజెక్టుల కాంట్రాక్టును.. అరకొర అర్హతలున్న ఓ 'అంతర్జాతీయ స్థాయి' కంపెనీకి కట్టబెట్టి తద్వారా జాతి సంపదను కొల్లగొట్టిన వైనమింది. చివరికి ఈ వ్యవహారం అమెరికా కోర్టులో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ కంపెనీ మన దేశంలోని గోవా, గువహటిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టులను 6 కోట్ల ముడుపులిచ్చి దక్కించుకుంది. కాగా, లూయీస్ కంపెనీ భారత్‌లో ఏయే నాయకుడికి ఎంత మొత్తం ముట్టజెప్పింది.. ఏ శాఖ అధికారిని ఎలా ప్రలోభాలకు గురిచేసింది.. పూర్తి వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ వాటిని వెల్లడించేందుకు అమెరికా న్యాయ శాఖ నిరాకరించింది. ఒక వేళ ఆ వివరాలు వెలుగులోకి వస్తేగనుక తీవ్ర దుమారం చెలరేగే అవకాశముంది. అసలు ఈ కుంభకోణం వివరాలు ఎలా వెలుగుచూశాయంటే.. లూయీస్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది. కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. శిక్షలకు సంబంధించి నవంబర్‌లో తుది తీర్పు వెలువడనుంది. సదరు లూయీస్ బెర్గర్ కంపెనీకి హైదరాబద్లోనూ ఓ కార్యాలయం ఉండటం గమనార్హం.