'ఆ మాజీ సీఎం లంచాలు తీసుకున్నారు'
గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమావో ఇద్దరూ కూడా లూయీస్ బెర్జర్ స్కాములో లంచాలు తీసుకున్నారని గోవా పోలీసులు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే చర్చిల్ అలెమావో అరెస్టయిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి గోవా రాష్ట్రానికి భారీ నష్టం కలిగించారని వాళ్ల రిమాండు దరఖాస్తులో పోలీసులు తెలిపారు. 2010-11 సంవత్సరంలో వాళ్లకు లంచాలు ఇచ్చినట్లు లూయీస్ బెర్జర్ మాజీ అధికారి ఒకరు మేజిస్ట్రేట్ ఎదుట అంగీకరించిన విషయాన్ని కూడా రిమాండు దరఖాస్తులో పేర్కొన్నారు.
వెయ్యి కోట్ల తాగు, మురుగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టును ఓ కన్సార్షియంకు అప్పగించేందుకు వీళ్లు దాదాపు 6.5 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్కు రూ. 50-60 లక్షల వంతున రెండు సందర్భాల్లో చెల్లించారని, అలెమావోకు ఒకసారి 50 లక్షలు, మరోసారి 15 లక్షలు ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. అయితే వీళ్లిద్దరూ కూడా ఆరోపణలను ఖండిస్తున్నారు.