బంగ్లాను గెలిపించిన నాసిర్
రెండో వన్డేలో భారత్ ‘ఎ’ ఓటమి
బెంగళూరు : మిడిలార్డర్ బ్యాట్స్మన్ నాసిర్ హుస్సేన్ (96 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్; 5/36) ఆల్రౌండ్ ప్రదర్శనతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (45), అనాముల్ హక్ (34), సౌమ్య సర్కార్ (24) ఓ మోస్తరుగా ఆడారు. ఆరంభంలో భారత పేసర్ల ధాటికి బంగ్లా 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
అయితే లిట్టన్ దాస్, నాసిర్లు ఆరో వికెట్కు 70 పరుగులు జోడించడంతో కోలుకుంది. రిషి ధావన్ 3, కర్ణ్ శర్మ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.2 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ (75 బంతుల్లో 56; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. మనీష్ పాండే (36), గురుకీరత్ సింగ్ (34), మయాంక్ అగర్వాల్ (24) కాసేపు పోరాడారు. భారత సీనియర్ ఆటగాడు సురేశ్ రైనా (17) మరోసారి విఫలమయ్యాడు. ఓ దశలో 5 వికెట్లకు 146 పరుగులు చేసిన టీమిండియాను చివర్లో బంగ్లా బౌలర్లు ఘోరంగా దెబ్బతీశారు. 41 పరుగుల తేడాలో చివరి 5 వికెట్లు తీయడంతో ఓటమి తప్పలేదు. రూబెల్కు 4 వికెట్లు దక్కాయి. ఆదివారం ఇదే వేదికపై ఇరుజట్ల మధ్య ఆఖరిదైన మూడో వన్డే జరుగుతుంది.