కళ్లు తెరిచిన రవాణాశాఖ!
విజయనగరంఫోర్ట్, న్యూస్‌లైన్ :. నిబంధనలకు తిలోదకాలిస్తూ.. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయంపై పత్రికల్లో ఎప్పటికప్పుడు కథనాలు వెలువడుతున్నా... రవాణాశాఖాధికారులు పట్టించుకున్న సందర్భం లేదు. తాజాగా మహబూబ్‌నగర్ దుర్ఘటనతో కళ్లు తెరిచారు. ట్రావెల్ బస్సులపై శుక్రవారం దాడులు నిర్వహించారు. 10 బస్సులపై దాడులు చేయగా.. అందులో మూడు సర్వీసులు నిబంధనలను విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. రెండు బస్సులపై కేసులు నమోదు చేసి విడిచిపెట్టారు. మరో బస్సును సీజ్ చేశారు. విజయనగరానికి చెందిన వెంకటరమణ ట్రావెల్స్ బస్సు నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్‌గా తిరుగుతుండడంతో సీజ్ చేశారు. దీనిని విశాఖ నగరంలోని మద్దిలపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. నవీన్ ట్రావెల్స్(ఛత్తీస్‌గఢ్)కు చెందిన రెండు బస్సుల్లో ప్రయాణికుల వివరాలతో కూడిన జాబితా లేదు. అదేవిధంగా అత్యవసర ద్వారం, నిప్పు ఆర్పే పరికరం, రెండో డ్రైవర్ లేకపోవడంతో ఈ రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు.
నేడూ కొనసాగనున్న దాడులు
శనివారం కూడా రవాణా శాఖ అధికారులు ట్రావెల్ బస్సులపై దాడులు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ బాగానే ఉన్నా.. ఈ దాడులను కొనసాగిస్తారా? లేదా గతంలో మాదిరి రెండు మూడు రోజులకే పరిమితం చేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నాళ్లూ ట్రావెల్ బస్సుల యజమానులు నిబంధనలు పాటించకపోయినా.. అధికారులు చూసీచూడనట్లు ఊరుకున్నారు. పత్రికల్లో కథనాలు వెలువడినా చలించలేదు. మహబూబ్‌నగర్ ఘటనలో 45 మంది అమాయకులు మృతి చెందడంతో స్పందించి దాడులు చేపడుతున్నారు. అంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతే గానీ అధికారులు కళ్లు తెరవరా? అని పలువురు చర్చించుకుంటున్నారు.