పిల్లలు పుట్టలేదని భార్య హత్య : భర్తకు జీవిత ఖైదు
కరీంనగర్: పిల్లలు పుట్టడంలేదని భార్యను హత్య చేసిన భర్తకు కరీంనగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గత వారంలో తీర్పు వెలువడే రోజున నిందితుడు బ్లేడుతో గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ(32)కి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన బిస్మిల్లా అలియాస్ గౌసియాబేగంతో 2002లో పెళ్లి జరిగింది. వీరు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థిరపడ్డారు. యూసుఫ్ అలీ బీడీ కంపెనీలో పనిచేసేవాడు. వీరికి సంతానం కలగలేదు. యూసుఫ్ అలీకి అప్పులు ఎక్కువైపోయాయి.
పోలీసులు, స్థానికులు, గౌసియా కుటుంబ సభ్యుల కథనం ప్రకారం అప్పులు తీర్చేందుకు తల్లిగారింటి నుంచి డబ్బు తెమ్మని యూసుఫ్ అలీ భార్యతో తరచూ గొడవపడేవాడు. రెండోపెండ్లి చేసుకుంటే సంతానం కలుగుతుందని, అలాగే డబ్బు కూడా వస్తుందని అతను భావించాడు. దాంతో అతను గౌసియాను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 2011 అక్టోబర్ 3న భార్యను తీసుకొని బైకుపై కామారెడ్డి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.
మార్గంమధ్యలో నిజామాబాద్ జిల్లా గంభీరరావుపేటలోని ఎగువ మానేరు వద్ద నర్మాల ప్రాజెక్టు చూద్దామని భార్యను అక్కడకు తీసుకువెళ్లాడు. ఎగువమానేరులో పడి గౌసియా మృతి చెందింది. ఆమెను భర్తే నీటిలో తోసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యూసుఫ్‌పై పోలీసులు హత్యానేరం కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ఈ నెల 11న విచారణ జరిగింది. ఫ్యామిలీ కోర్టులో న్యాయమూర్తి తీర్పు వెలువరించే సమయంలో యూసుఫ్ కోర్టుహాల్లోనే బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమవడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాంతో అతనిపై ఆత్మహత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. తీర్పును వాయిదావేశారు. భార్యను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో మహ్మద్ యూసుఫ్ అలీకి న్యాయమూర్తి ఈ రోజు జీవితకాల శిక్ష విధించారు.