Major reservoirs
-
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వలు
న్యూఢిల్లీ: దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలలో నీటి నిల్వలు 22 శాతం మేరకు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇదేసమయానికి 34 బిలియన్ క్యూబిక్ మీటర్లు ( బీఎంసీ) గా ఉన్న నీటి నిల్వలు ప్రస్తుతం 157 బీసీఎమ్ లుగా ఉన్నాయని, ప్రస్తుతం పదేళ్ల కనిష్ట స్థాయికి నీటి నిల్వల సామర్థం పడిపోయిందని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వల సామర్థ్యం బాగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో నీటి నిల్వలు కాస్త మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లో గతేడాదితో పోలిస్తే ఇప్పుడు సమానంగా నిల్వలున్నాయి. -
అడుగంటుతున్న జలాశయాలు
- వరుణుడు ముఖం చాటేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి - రాష్ట్ర జలాశయాల్లో సగటు నీటిమట్టం 26 శాతం - కొంకణ్‌లో అధికంగా 48, మరాఠ్వాడాలో అత్యల్పంగా 7 శాతం - తీవ్ర నీటి ఎద్దడిలో పలు గ్రామాలు సాక్షి, ముంబై: గతేడాది వర్షాభావ పరిస్థితులకు తోడు ఈ సారీ వరుణుడు ముఖం చాటేయడంతో ముంబైకు నీరందించే ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. రోజురోజుకూ జలాశయాల నీటి మట్టం కనిష్ట స్థాయిని మించి తగ్గిపోతున్నాయి. గతేడాది కంటే త్వరగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లోని సగటు నీటిమట్టం 26 శాతానికి చేరుకుంది. గతేడాది ఇదే సమయానికి 18 శాతం నీటి మట్టం ఉంది. ప్రస్తుతం కొంకణ్‌లో అత్యధికంగా 48 శాతం నీటి నిల్వలు ఉండగా, పుణేలోని జలాశయాల్లో 30 శాతం, నాగపూర్‌లో 27 శాతం, నాసిక్‌లో 21 శాతం నీటి నిల్వలున్నాయి. ఇక మరాఠ్వాడా పరిస్థితి దయనీయంగా మారింది. అక్కడ ఏడు శాతానికి నిల్వలు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి వర్షాలు సమయానికి వచ్చాయి. కానీ జూన్ మూడో వారం నుంచి పత్తాలేకుండా పోయాయి. అక్కడ అక్కడ చిరు జల్లులు కురిసినా మోస్తరు నుంచి భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా సాగు ప్రశ్నార్థకం కాగా, చాలా ప్రాంతాల్లో తాగు నీటి కొరత తీవ్రంగా ఉంది. మరాఠ్వాడాలోని బీడ్, ఉస్మానాబాద్, లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉంది. వర్షాలు కురవకపోతే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్య మరింత తీవ్రం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైకి మూడు నెలలు సరిపడా...! ముంబైకి మూడు నెలలు సరిపడా నీటి నిల్వలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రుతుపవనాల రాకతో కురిసిన భారీ వర్షానికి ముంబైకి నీటి సరఫరా చేసే జలాశయాల్లో కొంతమేర నీరు చేరుకుంది. ప్రస్తుతం వరుణుడు ముఖం చాటేసినా జులై నెలాఖరుకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ భావిస్తోంది.