గైరమ్మ సంబరం నేడు
ఉత్తరాంధ్రకే తలమానికం
59 స్టేజి కార్యక్రమాలతో సందడి
భారీగా తరలిరానున్న భక్తులు
అనకాపల్లి, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్రలో సుదీర్ఘ చరిత్ర కలిగిన అనకాపల్లి గవరపాలెం గైరమ్మ మహోత్సవం ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ దీపాలంకరణ చేశారు. కొణతాల జగ్గారావు వ్యవస్థాపక అధ్యక్షునిగా రూపుదిద్దుకున్న ఈ మహోత్సవాన్ని ఆయ న తదనంతరం కొణతాల మనోహరనాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ప్రస్తుతం మనోహర్‌నాయుడు కుమారుడు కొణతాల సంతోష అప్పారావునాయుడు ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పంట పొలాలు కాపాడే గైరమ్మ...
ప్రస్తుతం ఉన్న గైరమ్మ విగ్రహాల వద్ద ఒక దిబ్బ, మునగచెట్టు ఉండేవని పూర్వీకులు చెబుతుంటారు. ఈ ప్రాంతంలోని పంట పొలాలను కాపాడేందుకై గ్రామదేవతైన గైరమ్మను గేదెల పైడయ్య, చదరం నూకయ్య, కొణతాల నాగన్నలు ప్రతిష్టించారు. చిన్న పాకలో ఉండే అమ్మవారిని వారు భక్తిశ్రద్ధలతో పూజించేవారు. కాలక్రమేణా కొణతాల జగ్గారావు హయాంలో గుడిని అభివృద్ధిచేసి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాన్ని నిర్వహించేవారు. నాడు పంటపొలాలను రక్షించే గైరమ్మ నేడు సతకంపట్టు గైరమ్మగా విరాజిల్లుతోంది. ఉత్సవంలో భాగంగా పట్టణంలోని పలు వీధుల్లో 59 స్టేజీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.