ఎక్కడున్నారయ్యా..!
ఎక్కడున్నావయ్యా.. రోజు బడికిపోయేటోడివి.. ఉండలేక నాయినవెంట పోయి చావుతెచ్చుకుంటివి.. పండగపూట ఇంటికాడున్నా సరిపోయేది.. చేతులారా నిన్ను పోగొట్టుకుంటిమి కదరా..అంటూ నదిలో గల్లంతైన కుమార్ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కలిచివేసింది. ఉదయం నుంచి చీకటి పడే వరకు బాధిత కుటుంబసభ్యులు నది ఒడ్డున ఉంటూ పిల్లలకోసం విలపించారు. ఈ విషాదకరమైన పరిస్థితిని చూసిన వారి కళ్లు చెమర్చాయి. - అలంపూర్
తుంగభద్ర నదిలో మరబోటు బోల్తాపడి గల్లంతైన కుమార్(11), వేణు(26)ల ఆచూకీ రెండోరోజు కూడా లభించనే లేదు. స్థానిక మత్స్యకారులు నదిలో ఆచూకీ కోసం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించినా ఫలితం దక్కలేదు. సుమారు దాదపు 20 మంది మత్స్యకారులు నదిలో ఉదయం గాలాలతో వెతికారు. లాభం లేకపోవడంతో పెద్ద వల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఆర్డీఓ అబ్దుల్ హమీద్, తహశీల్దార్ మంజుల, ఎస్ఐ వెంకటేష్‌లు సంఘటన స్థలంలోనే ఉంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గురువారం జిల్లాలోని గత ఈతగాళ్లను రప్పించి గాలింపు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మత్స్య శాఖ అధికారులను అలంపూర్‌కు పిలిపించి వారితో సమావేశమయ్యారు. ఇదిలావుండగా పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా ఈ సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు.
తుంగభద్ర నది, మరబోటు, బోల్తాపడి గల్లంతైన