వైభవంగా మరిడమ్మ జాతర
ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు
ఆకట్టుకున్న బ్యాండ్ మేళాలు, కోలాటాలు
పెద్దాపురం : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ జాతర శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢమాసంలో 37 రోజుల పాటు నిర్వహించే మహోత్సవాల్లో భాగంగా గరగల నృత్యం, అమ్మవారి రథం, బ్యాండ్ మేళాలు, కోలాటం మధ్య సాగింది. రాత్రి 8.30 గంటలకు మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఆలయ ట్రస్టీ చింతపల్లి బ్రహ్మాజీలు జాతరను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ సూరిబాబు రాజుకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి చైర్మన్ జాతరను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుష్పనాథంను ఆదేశించారు. మరిడమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న మనోజ్ చెరువును వచ్చే ఏడాది జాతర సమయానికి బ్లోట్క్లబ్ మాదిరి తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు సూరిబాబు రాజు వెల్లడించారు. అనంతరం అమ్మవారి గరగల నత్యం, కోలాటం, పులి ఆట, సంబరాల్లోని పలు సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి తిలకించారు. తొలుత ఆయన పాత పెద్దాపురం (కోటముందు) పురాతన చరిత్ర కలిగిన మరిడమ్మ అమ్మవారి ఆలయంలో గరగ ఎత్తి పాత పెద్దాపురం సంబంరాన్ని ప్రారంభించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కురుపూరి రాజు, తూతిక రాజు, బొడ్డు బంగారుబాబు, ఆకుల కృష్ణ బాపూజీ, వాసంశెట్టి గంగ, వంగలపూడి సతీష్, శివకృష్ణ, అ«ధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.