డీసీఎంఎస్ స్థలంపై టీడీపీ నేత కన్ను?
అనకాపల్లి, న్యూస్‌లైన్ : అనకాపల్లి నడిబొడ్డున ఉన్న కొట్లాది రూపాయల విలువైన డీసీఎంఎస్ స్థలంపై ఒక రాజకీయ నేత కన్నుపడింది. అప్పులలో కూరుకుపోయిన డీసీఎంఎస్ బకాయిలను చెల్లించేందుకు స్థలాలు అమ్ముకోవాల్సిన దుస్థితి రావడంతో, దీనిపై దృష్టి పెట్టిన తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన ఒక నేత తనకు అనుకూలంగా మలుచుకునేందుకు వ్యూహం రచించి నట్లు వినికిడి. వాస్తవానికి డీసీఎంఎస్ గతంలో ప్రత్యేకమైన పరిస్థితులలో డీసీసీబీ నుంచి రుణం తీసుకుంది.
అప్పు చాంతాడులా పెరగడంతో ప్రస్తుతం సింగిల్ సెటిల్మెంట్ కింద కోటీ 84 లక్షల రూపాయల వరకు చేరినట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే చోడవరం డీసీఎంఎస్ స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నించినా కోర్టు వివాదాలు అడ్డుగా నిలిచాయి. దీంతో చుట్టూ తిరిగి విలువైన అనకాపల్లి డీసీఎంఎస్ స్థలంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించిన తాజా తెలుగుదేశం నేత, తనకు దక్కేలా పాలకవర్గాన్ని పురమాయిస్తున్నట్టు సమాచారం. శనివారం డీసీఎంఎస్‌లో జరగనున్న సమావేశంలో అప్పును తీర్చేందుకు స్థలాన్ని సదరు నేతకు చెందేలా కొందరు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం గుప్పుమంది. అయితే దీనిని సహకార అధికారులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏడాది పాటు డీసీఎంఎస్ పాలకవర్గం చేసిందేమిటి?
గంటా మంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపు డీసీసీబీని, మరొక వైపు డీసీఎంఎస్‌ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ డీసీఎంఎస్ పురోభివృద్ధికి చేసిదేమీ లేదనే చెప్పాలి. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి స్థానిక మంత్రి కొణతాల సిఫార సు మేరకు ఇక్కడి డీసీఎంఎస్ చైర్మన్‌కు మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవిని ఇప్పించారు. దీంతో మార్క్‌ఫెడ్ చైర్మన్ గోపాలరాజు డీసీఎంఎస్‌లో అప్పులున్నప్పటికీ వ్యాపార లావాదేవీలను పెంచి సంస్థ పురోభివృద్ధికి ప్రయత్నించారు. కానీ ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్‌ను కైవసం చేసుకున్నా స్థానికంగా వ్యాపార లావాదేవీలు పెరగడం గాని, అటు డీసీసీబీ ద్వారా సహకారం గాని లభించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ అప్పులు తీర్చే నెంపతో స్థలంపే టీడీపీ నేత కన్నేసినట్లు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి.