బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్
ముంబై: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28, శనివారం నాడు బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది. శనివారం స్టాక్ మార్కెట్‌కు సెలవు అయినప్పటికీ, ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. అన్ని రోజులాగానే ఆ రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ స్టాక్ ఎక్స్ఛేంజ్లు పనిచేస్తాయని పేర్కొంది. బడ్జెట్ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్లను తెరచే ఉంచాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెబీ ఆదేశాలిచ్చింది.
స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే పలు అంశాలు బడ్జెట్లో ఉంటాయని, అందుకని ఆ రోజు స్టాక్ ఎక్స్ఛేంజ్లు తెరచే ఉంచాలని బీఎస్ఈ, ఎన్‌ఎస్‌ఈలతో సహా ట్రేడర్లు సెబీని కోరారు. కాగా 1991 తర్వాత, 1992, 1993,1999 ... ఈ మూడు సంవత్సరాల్లో శనివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ మూడు రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిర్వహించారు. సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజ్లను బడ్జెట్ రోజు తెరిచే ఉంచుతామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. ఆ రోజు కరెన్సీ డెరివేటివ్, డెట్ సెగ్మెంట్లలో మాత్రం ట్రేడింగ్ ఉండదని ఎన్ఎస్ఈ తెలిపింది. కాగా గత మూడు సంవత్సరాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.