ఇబ్రహీంపట్నంను సస్యశ్యామలం చేస్తాం
మంత్రి హరీష్‌రావు
హయత్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, నాలుగున్నర కోట్ల ఖర్చుతో బాచారంలోని మూసీనదిపై ఉన్న కత్వాను, కుత్బుల్లాపూర్‌లోని నారాయణరెడ్డి కత్వాలను అభివృద్ధి చేస్తామని భారీ నీటి పారుదల శాఖామంత్రి టి.హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజాపూర్, తొర్రూరు, తారామతిపేటలో విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు.
కొహెడలో మంచినీటి సంపు, లక్ష్మారెడ్డిపాలెంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణం పనులు, అబ్దుల్లాపూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఘట్కేసర్- అబ్ధుల్లాపూర్ రోడ్డు పనులను, గౌరెల్లిలో రోడ్డు వెడల్పు పనులను, కుంట్లూరులో ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదులను ఆయన రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువు అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తామని, వచ్చే రెండేళ్లలో వాటర్ గ్రిడ్ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాసబ్చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హయత్‌నగర్ మండలంలో స్థలం కేటాయిస్తే ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ గోదామును ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1300 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో బస్సులు వెళ్లడం లేదని గుర్తించామని, వాటికి రోడ్డు ఏర్పాటు చేసి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇందుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హయత్‌నగర్ మండలంలో యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల కోసం 2,600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఆర్జేడీ వరప్రసాద్‌రెడ్డి, ఈఈ వెంకటరమణ, ఎస్ఈ వెంకటేశం, ఎంపీపీ జి.హరిత, జెడ్పీటీసీ టీ.నర్సింహ్మ, పెద్దఅంబర్‌పేట నగర పంచాయతీ చైర్మన్ ఈ.ధనలక్ష్మీ, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సానెం కృష్ణగౌడ్, ఎంపీడీఓ జ్యోతి, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఫర్నీచర్, వైద్య పరికరాలు లేకుండానే ఆస్పత్రి ప్రారంభం
అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్మించిన ప్రాథమిక ఆస్పత్రిలో ఫర్నీచర్, మందులు, వైద్య పరికరాలు లేకుండానే మంత్రులు ఆస్పత్రిని ప్రారంభించారు. భవనం నిర్మించి 9 నెలల పూర్తయినా నేటి వరకు ఎలాంటి ఫర్నీచర్, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా రోగులను పరీక్షించడానికి కూడా ఎలాంటి వసతులు లేకపోవడంతో అక్కడికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.