విచారణ కమిటీ వివాదాస్పదం!
ముగ్గురు సభ్యులపైనా అభ్యంతరాలు
నేడు సుప్రీం ముందుకు బీసీసీఐ ప్రతిపాదన
ముంబై: ఐపీఎల్ ఫిక్సింగ్ వివాదంపై స్వతంత్రంగా మరోసారి విచారిస్తామంటూ బీసీసీఐ ప్రతిపాదిస్తున్న కొత్త కమిటీపై వివాదం కొనసాగుతూనే ఉంది. ముగ్గురు సభ్యుల కమిటీలో ముందుగా రవిశాస్త్రి ఎంపికపై అభ్యంతరాలు ఎదురు కాగా...ఇప్పుడు మిగతా ఇద్దరి నేపథ్యంపై కూడా కొత్త చర్చ మొదలైంది.
వీరు ముగ్గురూ బీసీసీఐతో ఏదో ఒక రకంగా సంబంధం కలిగి ఉండటం కమిటీ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. బీసీసీఐ చేస్తున్న ఈ ప్రతిపాదన మంగళవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. కోర్టు దీనికి అంగీకారం తెలుపుతుందా, అభ్యంతరం వ్యక్తం చేస్తుందా చూడాలి. ఈ కమిటీని వ్యతిరేకిస్తామని బీహార్ క్రికెట్ సంఘం ఇప్పటికే ప్రకటించింది.
రవిశాస్త్రి: ఈ మాజీ క్రికెటర్ బీసీసీఐ ఉద్యోగిగా ఉన్నారు. కామెంటేటర్‌గా బోర్డునుంచే జీతభత్యాలు పొందుతున్నారు. ఫిక్సింగ్ వివాదం బయటపడిన తర్వాత అనేక సందర్భాల్లో బహిరంగంగానే శ్రీనివాసన్‌కు మద్దతు ప్రకటించారు. కమిటీలో తనను చేర్చడం పట్ల స్వయంగా శాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరిగ్గా తన బాధ్యత ఏమిటో కూడా తనకు తెలీదని ఆయన అన్నారు.
జై నారాయణ్ పటేల్: కలకత్తా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అయిన పటేల్, బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు స్వయానా బావ (సొంత సోదరి భర్త) కావడం వివాదానికి కారణమైంది. అయితే బోర్డు సమావేశంలో ఆయన పేరును శివలాల్ వర్గం కాకుండా శశాంక్ మనోహర్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి తన ఎంపికపై అభ్యంతరం అనవసరం అని ఆయన చెబుతున్నారు.
ఆర్కే రాఘవన్: సీబీఐ మాజీ డెరైక్టర్ రాఘవన్‌కు సంబంధించి కొత్త నేపథ్యం సోమవారం బయటపడింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ)కు అనుబంధంగా ఉన్న కామ్యుత్ క్లబ్‌కు ఆయన స్వయంగా యజమాని/కార్యదర్శి. రాఘవన్‌కు టీఎన్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా ఉంది. దీంతో ఆయనా శ్రీనివాసన్‌కు సన్నిహితుడేనని తెలుస్తోంది.