2020లో మెట్రో-3 పరుగు
సాక్షి, ముంబై: కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టనున్న మెట్రో-3 ప్రాజెక్టు పనులు 2016 మార్చి నుంచి ప్రారంభ మవుతాయని ముంబై మెట్రో రైల్వే కార్పొరేషన్ ఎండీ అశ్విని బిడే వెల్లడించారు. రైలు మార్గం అత్యధిక శాతం భూగర్భంలో నుంచి ఉండడం వల్ల స్థల సేకరణకు ఇబ్బంది ఉండదని బిడే అభిప్రాయపడ్డారు. వర్లీ, ప్రభాదేవి, లోయర్ పరేల్, ముంబై సెంట్రల్, చర్చిగేట్ తదితర ప్రాంతాల్లో స్థల సేకరణ ఇబ్బందిగా మారడంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
తాత్కాలిక, శాశ్వత పునరావాసం కల్పించాల్సిన కుటుంబాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలు బృందం సేకరిస్తుందని చెప్పారు. పునరావసంపై మాడా, బీఎంసీ, ఎస్ఆర్ఏ, బీపీటీ తదితర సంస్థలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి 2016 మార్చి నుంచి పనులు ప్రారంభిస్తామని బిడే తెలిపారు.
అందుబాటులో చార్జీలు
2020లో మెట్రో-3 రైళ్లు పరుగులు తీస్తాయని, వాటి చార్జీలు కూడా నిర్ణయించామని బిడే చెప్పారు. ప్రాజెక్టు పనులు స్వయంగా ప్రభుత్వం చేపట్టడంతో చార్జీలు పేదలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెట్రో-3 చార్జీలు వర్సొవా-అంధేరీ- ఘాట్కోపర్ మధ్య సేవలు అందిస్తున్న మెట్రో-1తో చార్జీలతో సమానంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం మెట్రో-1 కనీస చార్జీలు రూ.10 ఉండగా గరిష్ట చార్జీలు రూ.40 వరకు ఉన్నాయి. కాగా, మెట్రో-3 చార్జీలు రూ.11 నుంచి రూ.37 వరకు ఉంటాయని చెప్పారు.
ప్రాజెక్టును 2020 ఆఖరు వరకు పూర్తిచేస్తామన్నారు. రైలు మార్గానికి భూగర్భంలో అడ్డువచ్చే నీటి పైపులు, విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లు, గ్యాస్, డ్రైనేజీ లైన్లను తొలగించేందుకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని, ఇప్పటికే కొన్ని శాఖల నుంచి తాత్కాలిక అనుమతులు లభించాయని చెప్పారు.
శరవేగంగా భూ సేకరణ
మెట్రో-3 ప్రాజెక్టు కోసం భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయని బీడే తెలిపారు. ప్రాజెక్టుకు మొత్తం 39.9 హెక్టార్ల స్థలం అవసరముందని, 27.29 హెక్టార్ల స్థలం తాత్కాలికంగా, 11.90 హెక్టార్ల స్థలాన్ని శాశ్వతంగా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2,044 చెట్లను నేలమట్టం చేయాల్సి రావడంతో ఇంతే సంఖ్యలో మరోచోట మొక్కలను నాటడానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించామన్నారు. పర్యావరణ, భౌగోళికంగా అధ్యయన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు.
రూ.23,136 కోట్లతో చేపట్టనున్న మెట్రో-3 వినియోగంలోకి వస్తే నగరంలో దాదాపు 35 శాతం ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రతీరోజు 2,43,390 లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని బీడే అన్నారు. ప్రస్తుతం కఫ్ పరేడ్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా గంటన్నరకుపైగా సమయం పడుతుండగా మెట్రో-3 ద్వారా కేవలం 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. మెట్రో-3 రైలు ద్వారా ప్రతీరోజు 14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 2030లో ఈ సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని అంచనా.