జీవితం నుంచి పారిపోయి భగవంతుని చేరుకోలేవు
మహారాష్ట్రలోని పూనాలో 1894 ఫిబ్రవరి 25న జన్మించిన మెహర్బాబా 1921లో ఆధ్యాత్మిక కృషిని ప్రారంభించారు. నియమనిష్ఠలతో, నిస్వార్థమైన సేవాభావంతో జీవించేటట్లుగా శిష్యులకు తర్ఫీదు నిచ్చారు. నీతిగా నడుచుకోవడం, దైవం పట్ల ప్రేమ, ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం అబ్బేలా వారిని తీర్చిదిద్దారు. తర్వాత బాబా, అహమద్నగర్ పొలిమేరల్లో ఒక నివాసాన్ని ఏర్పరచారు. అదే మెహెరాబాద్. నేడు ఆయన అమరతిథి. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మంచి మాటలు కొన్ని...
దేనినైతే మీరు సత్యమని, న్యాయమని నమ్ముతారో దాన్ని ఆచరించండి. అంతేకాని మీ విశ్వాసాన్ని, నమ్మకాల్ని ప్రదర్శనకు పెట్టవద్దు.
మనిషిగా మనగలగటం గొప్ప విషయం. అంతకంటే ఇంకా గొప్ప విషయం మనిషిని మనిషిగా చూడటం.
ఆధ్యాత్మికత పరమ లక్ష్యం మానవుడిని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దటమే.
భగవంతుడు నీ హృదయంలో నుంచి వచ్చే భాషకు మాత్రమే ప్రతిస్పందిస్తాడు.
నీవు చేసే ప్రార్థన షరతులతో కూడినది, బేరమాడినట్లు కాకుండా ఉండాలి.
మతం ముఖ్య లక్షణం మనిషిలో ఉదాత్తమైన గుణాన్ని, మానసిక పరిశుద్ధతను, దేవుడి ప్రేమను, సత్యాన్ని కనుగొనాలనే ఆకాంక్షను పెంపొందింపజేయటం.
మీ మతాన్ని మీరు వదులుకోనక్కరలేదు కాని, ఆచార వ్యవహారాలు, కర్మకాండ అనే పై పొట్టును పట్టుకు వేళ్లాడటం మానుకోవాలి.
ఆధ్యాత్మికతకు ఒక ప్రత్యేకమైన సమయంగానీ, స్థలంగానీ, పరిస్థితిగానీ అవసరం లేదు.
శాశ్వత విలువలు, మారుతున్న పరిస్థితులు, తప్పించుకోదగిన సంఘటనలు, నిశ్చయంగా జరిగే సంఘటన ల గురించి సరైన అవగాహన కలిగి ఉండటమే ఆధ్యాత్మికత. ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికత అంటే, మనసును, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం.
భగవంతుడి కృప నీ మీద ప్రసరించాలన్నా, నీవు భగవంతుణ్ణి చేరుకోవాలన్నా, నీవు భగవంతుడితో అనుసంధానమవాలి. ఆ అనుసంధానమే ప్రార్థన. భగవంతుణ్ణీ, నిన్ను కలిపేదే ప్రార్థన.
నిజమైన సన్యాసానికి అర్థం ప్రపంచంలోనే ఉంటూ, దానికి చెందకుండా ఉండటం, ప్రాపంచిక జీవితం జీవిస్తూ, స్వార్థాన్ని త్యజించి, కోరికల్ని విడనాడటం.
జీవితం నుండి పారిపోయి, భగవంతుడిని చేరాలనుకుంటే కుదరదు. అందరిలో ఉన్న ఆ ఒక్క భగవంతుడిని గుర్తించగలిగినప్పుడే అది సాధ్యపడుతుంది.
- దీవి సుబ్బారావు
బాబా చేసిన మంచి పనులు
మెహర్ బాబా ఉచిత పాఠశాల, ఉచిత వైద్యశాల, ఉచిత ఔషధశాలలను స్థాపించడంతోబాటు, వేరేచోట్ల నుండి అక్కడకు వచ్చే బీదాబిక్కి జనానికి నీడ కల్పించారు. ఆధ్యాత్మిక విలువల్ని నిత్యజీవితంలో ఎలా సమన్వయ పరచాలో నేర్పారు. కుష్టురోగులకు స్నానం చేయించటం, వేలమంది బీదలకి తిండి, బట్ట ఇవ్వడంతోబాటు వారూ వీరూ అని తేడా లేకుండా బాబా అందరితోనూ కలిసి మెలిసి ఉండేవారు.
మౌనమే ఉత్తమ ఉపదేశం
భగవంతుణ్ణి దర్శించడానికి సరళమైన ఆధ్యాత్మికమార్గం మౌనం. గురువు అనుగ్రహానికి అత్యుత్తమ ఉపదేశం కూడా మౌనమే. మౌనంలోనే సాధకుని ప్రార్థన పరాకాష్ఠకు చేరుతుంది. జీవితంలో పనికి వచ్చే అత్యంత విలువైన అనేక విషయాలనూ, వస్తువులనూ మౌనంగానే ఇచ్చిపుచ్చుకోవటం ఉత్తమమైనదని బాబా భావించారు. అందుకే 1925 జూలై 10 నుండి 1969 జనవరి 31న దేహత్యాగం వరకు 44 సంవత్సరాలపాటు మౌనంగా ఉండిపోయారు. తన భావాలు మౌనంగానే వ్యక్తీకరించేవారు.