హత్య కేసులో మాజీ మంత్రి అరెస్ట్
సిండెగ: హత్య కేసులో మాజీ మంత్రి, జార్ఖండ్ పార్టీ నాయకుడు అనోశ్ ఎక్కాను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిటన్లు తెలిపారు. అనంతరం ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారని తెలిపారు. ఉపాధ్యాయుడి హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అనోశ్ ఎక్కాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కొలిబెరా ప్రాంతంలో గురువారం ఉపాధ్యాయుడి మృతదేహం లభించింది. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా... ఈ హత్య కేసులో అనోశ్ ఎక్కా ప్రమేయం ఉందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
దీంతో అనోశ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనోశ్పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైయ్యారని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం జార్ఖాండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొలిబెరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జార్ఖండ్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగారు. ఆయన భార్య మీనన్ ఎక్కా కూడా అదే పార్టీ తరఫున సిండెగ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.