Merit scholarships
-
ఆ కాలేజ్ మెరిట్ స్కాలర్‌షిప్‌లకు అడ్డా..
సాక్షి, తొగుట(దుబ్బాక): తొగుట ప్రభుత్వ కళాశాల విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికకు విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాల అధ్యాపకులు కృషి చేస్తున్నారు. చదువులతో పాటు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో విద్యార్థులు రాణిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన పోటీ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. కళాశాల నుంచి ఏటా ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు ప్రతి ఏటా ఎనిమిది మంది చొప్పున విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ చదివేందుకు ఐదు సంవత్సరాలకు సుమారు రూ.70 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యార్థులకు విద్యాబోదన అందిస్తున్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మెలకువలు నేర్పిస్తున్నారు. 2009లో కళాశాల స్థాపన తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009లో జూనియర్ కళాశాల ఏర్పాటైంది. గ్రీమీణ ప్రాంతాల పేద విద్యార్దులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో దివంగత దుబ్బాక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కళాశాలను ప్రారంభించారు. కళాశాల ఏర్పాటైన రెండో సంవత్సరంలోనే 200 మంది విద్యార్థులు చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్యకు కళాశాల సరిపోలేదు. దీంతో ముత్యంరెడ్డి తన సొంత భవనాన్ని కళాశాలకు అందజేశారు. అందులో చాలా కాలం పాటు విద్య కొనసాగింది. తర్వాత ఆరంపురంలో కళాశాలకు సొంత భవనం నిర్మించి అందజేశారు. దీంతో కళాశాలకు విశాలమైన భవనం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచారంటే విద్యా బోధన ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల ప్రోత్సాహం కళాశాలలో యువ అధ్యాపక బృందం విద్యాబోధనతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభతో ఎంపికవుతున్నారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో రాణించేలా బోధిస్తున్నాం. ఇప్పటివరకు కళాశాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇక్కడి విద్యార్థులు ప్రతి ఏటా ఎంపికవుతున్నారు. బోధనలో అధ్యాపకుల కృషి అభినందనీయం. – పరమేశ్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల రాంపురం ప్రత్యేక తరగతులు ఇంటర్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అధ్యాపకకులు బోధిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి తర్ఫీదునిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఉపకార వేతనాలకు కళాశాల నుంచి ఎంపికవుతున్నారు. అధ్యాపకుల సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. – చిప్ప నవీన, కళాశాల పూర్వ విద్యార్థిని -
చదువుకు ఉపకారం
ప్రయోజనం ఆదిలాబాద్, పెగడపల్లి, (ధర్మపురి) : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వపాఠశాలల్లో విద్యనభ్యసించే చిన్నారులను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ఎన్ఎంఎంస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) జాతీయ ఉపకార వేతనాన్ని 2008లో ప్రవేశపెట్టింది. ఈ పథకంతో ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. కొద్ది రోజుల క్రితం ఎన్ఎంఎంఎస్కు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రకటనజారీ చేసింది. ఏటా సెప్టెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించి అక్టోబర్‌లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఈ విద్యాసంవత్సరం అక్టోబర్ 4నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 5న అన్ని జిల్లా రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు ఇలా.. జాతీయఉపకార వేతనానికి దరఖాస్తు ఫారాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఈతెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ. 50 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జతచేయాల్సిన ధ్రువపత్రాలు అభ్యర్థులు దరఖాస్తు చేసేప్పుడు కులం, ఆదాయం, ఆధార్, రెండుపాస్‌ఫోర్టు సైజ్ ఫొటోలు జత చేయాలి. వాటిని సంబంధిత పాఠశాల హెచ్ఎం పరిశీలించి జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపిస్తారు. వీరు అర్హులు ప్రభుత్వ జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు. ఏడో తరగతిలో ఓసీ, బీసీలు 55శాతం, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు ఉపకార వేతనం అందిస్తారు. ఇలా ఇంటర్మీడియెట్ పూర్తి చేసేంతవరకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాన్ని అందజేస్తుంది. తద్వారా పేద విద్యార్థుల చదువుకు చాలా వరకు మేలు జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఈ జాతీయ ఉపకార వేతనాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వి నియోగం చేసుకోవాలి. – ఎం.శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్, సుద్దపల్లి ప్రోత్సహిస్తాం.. ఈ ఏడాది వీలైనంత మంది విద్యార్థులు అర్హత పరీక్షలో పాల్గొనేందుకు చర్య తీసుకుంటాం. ఉపాధ్యాయులు దీనిపై అవగాహన కల్పించాలి. దగ్గరుండి దరఖాస్తు చేయించాలి. ఇటువంటి పరీక్షల వల్లే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. – ఎం. అంజారెడ్డి, ఎంఈవో -
వెయ్యి మందికి మెరిట్ స్కాలర్షిప్!
ఎస్సీ విద్యార్థుల ఉన్నతికి విద్యాపరంగా మార్పులకు కసరత్తు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత శాఖల నివేదికలు {పతి జిల్లాలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి ఆధునిక వసతులతో హైటెక్ హాస్టళ్లు నిర్మించాలి అన్ని టీచర్, వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని సూచనలు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు సవాళ్లను అధిగమించి, ఆధునిక పోటీప్రపంచంలో ఇతర విద్యార్థులతో సమానంగా తలపడేందుకు విద్యాపరంగా అనేక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు అవసరమైన సలహాలు, సూచనలతో సంబంధిత శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. ఇందులో భాగంగా స్వల్పకాలిక ప్రణాళికలతోపాటు దీర్ఘకాలిక ప్రణాళికలను పొందుపరిచాయి. ఇందులో ప్రధానంగా ఎస్సీ విద్యార్థులకు సీఎం టాలెంట్ ఫండ్‌ను అందించాలని సిఫార్సు చేశాయి. షెడ్యూల్కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్నేషన్లో ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులకు డిగ్రీ పూర్తయ్యేవరకు ప్రముఖ కాలేజీల్లో చదివేందుకు వీలుగా ఏడాదికి వెయ్యి మందికి చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు అందించాలని సూచించాయి. ఈ స్కాలర్షిప్లు అందుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఎస్సీలు నివసించే ప్రాంతాల్లో ఏడాదిపాటు సామాజికసేవ చేస్తే స్వదేశంలో లేదా విదేశాల్లో తదుపరి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు ఆర్థికసహాయం పొందేందుకు అర్హులు చేయాలని తమ సిఫార్సుల్లో పేర్కొన్నాయి. స్వల్పకాలిక ప్రణాళికలో అంశాలివీ... ఇంటర్మీడియట్ తర్వాత ఎస్సీ విద్యార్థులకు డిగ్రీ విద్యను అందించేందుకు ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రైవేటు భవనాల్లో ఈ కళాశాలలను ప్రారంభిస్తే వేలాదిమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సీఎం కేసీఆర్ ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య’ కల సాకారమవుతుంది. మరో రెండేళ్లలో సొంత భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. బయట ఉన్న ఉద్యోగ, ఉపాధి డిమాండ్లను అందిపుచ్చుకునే విధంగా కంప్యూటర్ అప్లికేషన్స్, హాస్పటాలిటీ మేనేజ్మెంట్, డీఈడి, ఇతర వృత్తివిద్యాకోర్సులను అందించాలి. అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నిర్వహణ ఫండ్‌ను డైట్ చార్జీలుగా మార్చాలి. అన్ని హాస్టల్ సంక్షేమ అధికారుల ఖాళీలను భర్తీచేయాలి. సబ్‌ప్లాన్ నిధులతో ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపరచాలి. పాత, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లను కూలగొట్టి వాటి స్థానంలో అన్ని ఆధునిక వసతులతో హైటెక్ హాస్టళ్లను నిర్మించి, సమూల మార్పులు తీసుకురావాలి. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలోని అన్ని టీచర్, వార్డెన్లు పోస్టులను భర్తీచేయాలి. డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా లేదా బోధనా నైపుణ్యాన్ని పరీక్షించిన తర్వాత షరతులపై కాంట్రాక్ట్ టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలి దీర్ఘకాలిక ప్రణాళికల్లో సూచనలివీ... హైదరాబాద్, వరంగల్ తదితర నగరాలు, పట్టణాల్లో అన్ని వసతులతో హైటెక్ హాస్టళ్లను ఏర్పాటుచేస్తే షెడ్యూల్ కులాలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ప్రాంతాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఎలిమెంటరీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలను డేకేర్ సెంటర్లుగా మార్పు చేయడం ద్వారా స్కూళ్లలో చదవుకునే అవకాశాలను మెరుగుపరచవచ్చు. ఇప్పటికే సెర్ప్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ విధానాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేయాలి. రెసిడెన్షియల్ స్కూళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేజీ బాలవికాస్, మోడల్ స్కూళ్లను పూర్తిస్థాయి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడం ద్వారా వల్ల వేలాది మంది బాలబాలికలు బాలకార్మికులుగా మారకుండా, బాల్యవివాహాల బారిన పడకుండా నిరోధించే అవకాశం కలుగుతుంది.