Michael Schumacher
-
పదకొండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షూమాకర్!
రేసింగ్ రారాజు మైకేల్ షూమాకర్ పదకొండేళ్ల తర్వాత తొలిసారి బయట కనిపించినట్లు సమాచారం. తన కూతురు గినా పెళ్లి సందర్భంగా ఈ దిగ్గజ డ్రైవర్ ప్రపంచం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూకేకు చెందిన మెట్రో సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా ఏడుసార్లు ఫార్ములా వన్ చాంపియన్‌గా నిలిచిన షూమాకర్ 2013లో ఘోర ప్రమాదానికి గురయ్యాడు.ఫ్రాన్స్‌లో ఆల్ఫ్ పర్వతాల్లో కుటుంబంతో కలిసి స్కీయింగ్ చేస్తుండగా.. పట్టుతప్పి పడిపోయాడు. ఈ క్రమంలో బండరాయికి తల బలంగా తగలడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. పేరుకు బతికి ఉన్నాడే గానీ పూర్తిగా అచేతనంగా మారిపోయాడు. ఆ తర్వాత అతడి మళ్లీ పూర్తిస్థాయిలో కోలుకోనే లేదనే వార్తలు వచ్చాయి.అయితే, తాజాగా తన కుమార్తె గినా వివాహ బంధంలో అడుగుపెడుతున్న వేళ షూమాకర్ బయటకు వచ్చినట్లు కథనాలు రావడం అతడి అభిమానులకు ఊరటనిచ్చాయి. కాగా గినా అథ్లెట్. గుర్రపుస్వారీలో ఆమెకు అనుభవం ఉంది. ఇక గినా పెళ్లి విషయానికొస్తే.. తన చిరకాల స్నేహితుడు ఇయాన్ బెత్కెను ఇటీవలే వివాహమాడింది. మూడు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది.అయితే, అందులో షూమాకర్ సహా మిగతా కుటుంబ సభ్యులెవరూ లేకపోవడం గమనార్హం. ఇక స్పెయిన్‌లోని మాలోర్కాలో గల లగ్జరీ విల్లాలో గినా వెడ్డింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా జర్మనీకి చెందిన 55 ఏళ్ల షూమాకర్ కుమారుడు మిక్ షూమాకర్ కూడా ఎఫ్1 రేసింగ్‌లో పాల్గొన్నాడు. -
తను తండ్రితో.. చెల్లి తల్లితో! నాన్న వల్లే ఇప్పుడిలా.. రికార్డులు కొల్లగొడుతూ!
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు .. ఏడాదిలో ఇలా రేస్‌ల సంఖ్య మారుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేదికలు కూడా మారిపోతున్నాయి. కానీ ఫలితం మాత్రం మారడం లేదు. ఒకే ఒక్కడు ఫార్ములా వన్ సర్క్యూట్‌ను శాసిస్తున్నాడు. బరిలో నిలిచిన మిగతావారంతా ఇక రెండో స్థానం కోసమే పోటీ పడాలి అన్నట్లుగా ఆధిపత్యం సాగింది. సంవత్సరం క్రితం తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఈ ఏడాది అంతకు మించిన వేగంతో దూసుకుపోయి తన రికార్డులను తానే బద్దలు కొట్టాడు. 26 ఏళ్ల వయసులోనే వరుసగా మూడు సీజన్లు ఎఫ్1 చాంపియన్‌గా నిలిచి మరిన్ని సంచలనాలకు సిద్ధమైన ఆ డ్రైవర్ పేరే మ్యాక్స్ వెర్స్టాపెన్.. 2022 సీజన్లో 15 రేస్‌లను గెలిచి కొత్త రికార్డు నమోదు చేసిన అతను.. ఈసారి తొలి 19 రేస్‌లు ముగిసే సరికే 16 సార్లు విజేతగా నిలవడంతో తన ఘనతను తానే అధిగమించి సత్తా చాటాడు. ‘పిన్న వయసు’ ఘనతలన్నీ 17 ఏళ్ల 166 రోజులు.. తొలిసారి ఫార్ములా వన్ ట్రాక్‌పై రయ్యిమంటూ దూసుకుపోయినప్పుడు వెర్స్టాపెన్ వయసు! దీంతో ఎఫ్1 బరిలో దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. ‘పిన్న వయసు’ ఘనతలన్నీ వరుసగా అతని ఖాతాలోనే చేరుతూ వచ్చాయి. పాయింట్లు సాధించడంలో, రేస్ గెలవడంలో, పోడియం ఫినిష్‌లో భాగం కావడంలో, ఫాస్టెస్ట్ ల్యాప్.. ఇలా అన్నింటిలో అతను అందరికంటే చిన్నవాడే. ఈ రికార్డుల వరుస చూస్తుంటేనే అతను ఎంత వేగంగా ఎదిగాడనేది స్పష్టమవుతోంది. 2021లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచిన తొలి నెదర్లాండ్స్ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన వెర్స్టాపెన్ ఆ తర్వాత వరుసగా రెండు సీజన్ల పాటు తన టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం! తండ్రి మార్గనిర్దేశనంలో.. 107.. వెర్స్టాపెన్ తండ్రి జోస్ వెర్స్టాపెన్ ఫార్ములా వన్‌లో పోటీ పడిన రేస్‌ల సంఖ్య. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్క రేస్‌లో కూడా అతను విజేతగా నిలవలేకపోయాడు. ఆ తర్వాత పోటీల నుంచి తప్పుకొని ఎఫ్1 టీమ్‌ల సహాయక సిబ్బందిలో అతను చేరాడు. జోస్ మనసులో కూడా కొడుకు గురించి ఒక ప్రణాళిక ఉంది. కానీ దానికి తొందరపడదల్చుకోలేదు. అయితే నాలుగున్నరేళ్ల వయసున్న మ్యాక్స్ తండ్రిని గోకార్టింగ్ కారు కొనివ్వమని కోరగా.. ఆరేళ్లు వచ్చాకే అవన్నీ అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. కానీ మ్యాక్స్ వదల్లేదు. తండ్రిని పదేపదే అడగటంతో పాటు నాకంటే చిన్నవాళ్లు కూడా కార్టింగ్ చేస్తున్నారంటూ తల్లితో కూడా చెప్పించాడు. దాంతో జోస్ దిగిరాక తప్పలేదు. చివరకు ఇద్దరూ రాజీ పడి అయితే ఒక చిన్న కార్టింగ్ కారులో మొదలైన తన కొడుకు ప్రస్థానం అంత వేగంగా, అంత అద్భుతంగా సాగుతుందని ఆయనా ఊహించి ఉండడు. అయితే మ్యాక్స్ ఎదుగుదలలో ఒక్క ఆసక్తి మాత్రమే కాదు.. అతని కఠోర శ్రమ, సాధన, పట్టుదల, పోరాటం అన్నీ ఉన్నాయి. 15 ఏళ్ల వయసులో స్థానికంగా జరిగిన ఒక గోకార్టింగ్ చాంపియన్‌షిప్ దాదాపు చివరి వరకు ఆధిక్యంలో ఉండి కూడా మ్యాక్స్ ఓటమిపాలయ్యాడు. ఇది తండ్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కొంత కాలం పాటు వీరిద్దరి మధ్య మాటలే లేవు. చివరకు ఇద్దరూ రాజీ పడి మరింత సాధన చేసి ఫలితాలు సాధించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. తను నాన్నతో... చెల్లి అమ్మతో మరోవైపు అదే సమయంలో తన తల్లిదండ్రులు అనూహ్యంగా విడిపోవడం కూడా వెర్స్టాపెన్పై మానసికంగా ప్రభావం చూపించింది. తన చెల్లి.. తల్లితో వెళ్లిపోగా.. తాను తండ్రితో ఉండిపోయాడు. తండ్రికి ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్‌తో ఉన్న స్నేహం.. అతనికి ఆటపై మరింత ఆసక్తిని పెంచడమేకాకుండా సరైన దిశానిర్దేశమూ చేసింది. ముందుగా ఎఫ్1తోనే.. వెర్స్టాపెన్ 2015లో తొలిసారి ఫార్ములా వన్ రేస్‌లోకి అడుగు పెట్టాడు. ఈ సీజన్లో 19 రేస్‌లలో పాల్గొన్న అతను 12వ స్థానంతో ముగించాడు. ఆసక్తికర అంశం ఏమిటంటే అతనికి అప్పటికి 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. ఎఫ్1 లైసెన్స్ అందుకొని ట్రాక్‌పై రయ్యంటూ పరుగులు పెట్టిన కొద్ది రోజులకు గానీ వెర్‌స్టాపెన్‌కు అధికారికంగా రోడ్ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు. ఏదైనా సాధించగలననే నమ్మకం తొలి సీజన్ గొప్పగా లేకపోయినా అతనిలో మంచి ప్రతిభ ఉన్నట్లుగా సర్క్యూట్లో గుర్తింపు లభించింది. తర్వాతి ఏడాది వెర్స్టాపెన్ ఎఫ్1లో బోణీ చేశాడు. మొదటిసారి రెడ్‌బుల్ జట్టు తరఫున బరిలోకి దిగి.. 17 రేస్‌లలో పాల్గొని ఒక రేస్‌లో విజేతగా నిలిచాడు. ఇది అతని అద్భుత భవిష్యత్తుకు పునాది వేసిన మొదటి విజయం. మొత్తంగా సీజన్‌ను ఐదో స్థానంతో ముగించడంలో వెర్స్టాపెన్ సఫలమయ్యాడు. 2017లో కీలక దశలో కాస్త తడబడి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా.. తర్వాతి సీజన్లో నాలుగో స్థానంలో నిలవడం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా 11 పోడియంలు వెర్‌స్టాపెన్‌కు తాను ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని కలిగించాయి. ఆ తర్వాత పైపైకి దూసుకుపోవడమే తప్ప మళ్లీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఇక అగ్రస్థానానికి చేరే సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌తో పాటు అతని తండ్రి జోస్‌కు కూడా అర్థమైంది. ఆపై వచ్చే ఏ అవకాశాన్నీ వదలకూడదని భావించిన తండ్రీ కొడుకులు తర్వాతి సీజన్‌పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. తొలిసారి విజేతగా.. 2021 ఎఫ్1 సీజన్ వచ్చేసింది. అప్పటి వరకు ఎఫ్1 చరిత్రలో 71 సార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ అందజేయగా.. 33 మంది విజేతలుగా నిలిచారు. గత ఏడు సీజన్లలో ఆరు సార్లు చాంపియన్‌గా నిలిచి మెర్సిడీజ్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ మంచి ఊపు మీదున్నాడు. అంతకు ముందు కూడా ఒకసారి టైటిల్ సాధించిన అతను అత్యధిక టైటిల్స్‌తో షుమాకర్ (7 టైటిల్స్) రికార్డును కూడా సమం చేసేశాడు. బహ్రెయిన్‌లో జరిగిన తొలి రేసును కూడా హామిల్టన్ గెలుచుకొని తన ఫామ్‌ను చూపించాడు. సమ ఉజ్జీలు తర్వాతి రేసు ఇటలీలోని ఇమోలాలో. ఈసారి కూడా పోల్ పొజిషన్ సాధించి హామిల్టన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే ఇక్కడే వెర్స్టాపెన్లోని అసలు సత్తా బయటకు వచ్చింది. మొదటి కార్నర్‌లోనే హామిల్టన్‌ను ఓవర్టేక్ చేసిన అతను ఆ తర్వాత అంతే వేగంగా దూసుకుపోయాడు. చివరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొని సీజన్లో తొలిరేస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఈ సీజన్ మొత్తం వీరిద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. ఒకరు ఒక రేస్‌లో విజేతగా నిలిస్తే ఆ వెంటనే మరొకరు తర్వాతి రేస్‌ను సొంతం చేసుకొని సమ ఉజ్జీగా నిలిచారు. ఆపై ఆబూ ధాబీలో జరిగిన చివరి రేస్‌లోనే (మొత్తం 22 రేస్‌లు) సీజన్ ఫలితం తేలడం విశేషం. సరిగ్గా ఈ రేస్‌కు ముందు సమానంగా 369.5 పాయింట్లతో వెర్స్టాపెన్, హామిల్టన్ ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వెర్స్టాపెన్ విజయనాదం తొలి ల్యాప్‌లోనే ముందంజ వేసి హామిల్టన్ శుభారంభం చేసినా.. ఆ తర్వాత వెర్స్టాపెన్ ఎక్కడా తగ్గలేదు. అత్యంత ఆసక్తికరంగా సాగిన పోరులో చివరిదైన 58వ ల్యాప్‌లో హామిల్టన్‌ను వెనక్కి తోసి వెర్స్టాపెన్ విజయనాదం చేశాడు. 8 పాయింట్ల తేడాతో అగ్రస్థానం సాధించి తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. దాంతో ఎఫ్1లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. తర్వాతి ఏడాది ఏకంగా 146 పాయింట్ల ఆధిక్యంతో తన సమీప ప్రత్యర్థి చార్ల్స్ లెక్లర్క్ను చిత్తుగా ఓడించి టైటిల్ నిలబెట్టుకోవడం వెర్స్టాపెన్ ఆధిక్యాన్ని చూపించింది. ఇక ఇదే జోరును కొనసాగించి 2023 సీజన్లో చాలా ముందుగానే విజేత స్థానాన్ని ఖాయం చేసుకొని వెర్స్టాపెన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 26 ఏళ్ల వయసులోనే అసాధారణ వేగంతో దూసుకుపోతున్న వెర్స్టాపెన్ మున్ముందు సర్క్యూట్లో మరిన్ని సంచలన విజయాలతో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
రేసింగ్ రారాజు.. ఏడు సార్లు చాంపియన్‌గా నిలిచిన షుమాకర్
వేగం.. వేగం.. వేగం.. చిన్నప్పుడు వేగాన్ని ఇష్టపడ్డాడు..అదే అతడిని ఆట వైపు మళ్లించింది.. ట్రాక్‌పై వేగాన్నే నమ్ముకున్నాడు.. అదే అతడిని శిఖరాన నిలిపింది.. ట్రాక్ బయటా వేగం తగ్గించలేదు.. దురదృష్టవశాత్తు అదే అతడిని చావుకు దగ్గరగా తీసుకెళ్లింది.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లే కార్ రేసింగ్‌లో అతను రారాజుగా వెలుగొందాడు.. ఫార్ములా వన్ అభిమానుల వినోదానికి కొత్త ఫార్ములాను రుచి చూపించాడు.. సుదీర్ఘ కాలం ఆటను శాసించి, పరుగులు పెట్టించి, ఏకంగా ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆ డ్రైవరే మైకేల్ షుమాకర్. 1994 ఫార్ములా వన్ చాంపియన్ షిప్.. గత ఏడాది విజేత అలెన్ ప్రాస్ట్ అప్పటికే రేసింగ్‌కు గుడ్‌బై చెప్పడంతో ఈ సారి బరిలోకి దిగడం లేదు. మొత్తం 46 మంది డ్రైవర్లు బరిలో ఉండగా, వీరిలో 14 మంది తొలిసారి ఎఫ్1 సర్క్యూట్‌లోకి అడుగు పెడుతున్నారు. పాతికేళ్ల షుమాకర్‌కు ఇది మూడో ప్రయత్నం. అంతకు ముందు రెండు ప్రయత్నాల్లో 3వ, 4వ స్థానాల్లో నిలిచి తన సత్తా నిరూపించుకున్నాడు. అయినా సరే, ఎవరూ చాంపియన్ ను ఊహించలేని విధంగా రేస్‌లు సాగాయి. మొత్తం 16 రేస్‌లలో 15 ముగిసినా తుది విజేత ఎవరో తేలలేదు. హోరాహోరీగా సాగిన ఆఖరి గ్రాండ్‌ప్రి ఆస్ట్రేలియాలో కొత్త చాంపియన్ బయటకు వచ్చాడు. ఓవరాల్‌గా 92 పాయింట్లు సాధించిన షుమాకర్ ఒకే ఒక పాయింట్ తేడాతో డామన్ హిల్ (91)ను వెనక్కి నెట్టాడు. అదీ ఎఫ్1 చరిత్రలో ఒక అద్భుతానికి ఆరంభంగా నిలిచింది. ఆ తర్వాత మరో ఆరు సార్లు అతను జగజ్జేతగా నిలిచి ట్రాక్‌ను శాసించాడు. అయితే ఇద్దరు డ్రైవర్ల మరణం, గాయాలు, సాంకేతిక సమస్యలు తదితర అంశాలతో అత్యంత వివాదాస్పదంగా ఈ సీజన్ సాగడంతో ఆట నిబంధనల్లో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. దాంతో కొత్త చాంపియ¯Œ గా షుమాకర్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదు. అయితే తర్వాతి ఏడాది ఇదే జట్టు (బెనెటాన్ ) తరఫున మళ్లీ చాంపియన్ గా నిలిచి షుమీ తానేంటో చూపించాడు. అక్కడే మొదలు.. కార్టింగ్.. ఎఫ్1 స్థాయికి చేరినా, దిగ్గజ డ్రైవర్లంతా మొదలు పెట్టింది స్థానికంగా కార్టింగ్ ద్వారానే. అలాంటిది తండ్రే కార్టింగ్ ట్రాక్ నడిపిస్తుంటే ఆకర్షితుడు కాకుండా ఉంటాడా! నాలుగేళ్ల షుమాకర్కూ అలాగే ఆసక్తి కలిగింది. చిన్న పెడల్ కార్టింగ్‌తో ఆడుకుంటున్న అతడిని చూసి తండ్రి దానికి చిన్నపాటి మోటార్ సైకిల్ ఇంజిన్ బిగించడంతో ఆట మలుపు తిరిగింది. ఒక అద్భుతానికి అదే ఆరంభంగా మారింది. ఆరేళ్లకే తొలి సారి కార్టింగ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలవడంతో అతని బంగారు భవిష్యత్తు తండ్రికి కళ్ల ముందు కనిపించింది. దాంతో స్థానిక వ్యాపారుల నుంచి స్వల్ప స్పాన్సర్షిప్ సహా అతడిని ప్రోత్సహించేందుకు అన్ని వనరులూ ఉపయోగించాడు. ఆ ప్రోత్సాహం షుమాకర్‌ను ముందుకు నడిపించింది. తాను పుట్టిన జర్మనీలో కార్టింగ్ లైసెన్స్ ఇవ్వాలంటే కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. కానీ 12 ఏళ్లకే దూసుకుపోతున్న అతను అదే వయసుకు లైసెన్స్ ఇచ్చే పొరుగు దేశం లగ్జెంబర్గ్‌కు వెళ్లి లైసెన్స్ తెచ్చుకున్నాడు. దాంతోనే పోటీ పడి జర్మన్ జూనియర్ కార్టింగ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచాడు. ఆపై సింగిల్ సీట్ రేసింగ్, ఫార్ములా 3 చాంపియన్ షిప్ మీదుగా సాగిన ప్రస్థానం 1991లో తొలిసారి ఎఫ్1 అరంగేట్రం వరకు చేరింది. అదే ప్రత్యేకత... ‘ఫార్ములా వన్ చరిత్రలో అత్యంత పరిపూర్ణమైన డ్రైవర్’.. ఒక్క మాటలో షుమాకర్ గురించి సహచరులు చెప్పే మాట ఇది. సహజసిద్ధమైన ప్రతిభతో పాటు అమిత ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, అంకితభావం మాత్రమే కాకుండా రేసింగ్‌పై ఉన్న పిచ్చి ప్రేమ, ప్రతీ రోజు ఏదో ఒక విషయంలో మెరుగవ్వాలనే బలమైన కోరిక వెరసి షుమీని చాంపియన్ ను చేశాయి. ‘రేసు కొనసాగే సమయంలో అర సెకండ్∙వ్యవధిలో నిర్ణయాలు తీసుకోగలిగే మానసిక దృఢత్వం, అమిత వేగంలోనూ ప్రణాళికలు మార్చుకోగలిగే తత్వం అతడిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాయి’ అంటూ ఎఫ్1 సర్క్యూట్లో ఈ స్టార్ గురించి అందరూ చెబుతారు. అన్నింటినీ మించి రేసు ముగియగానే తన పని ముగిసినట్లుగా భావించకుండా తాను ఉపయోగించే కారు ఫ్యాక్టరీకి వెళ్లి లోపాల గురించి మాట్లాడటం, ఇంజినీర్లకు సూచనలు ఇవ్వడం, వారిని ప్రోత్సహించడం.. ఇలా అన్ని చోట్లా తన భాగస్వామ్యం కనిపిస్తుంది. కెరీర్లో ఐదు సార్లు ‘చాంపియన్’గా నిలిచిన ఫెరారీ టీమ్‌తో అతనికి కుటుంబ సభ్యుడి తరహాలో అనుబంధం ఉంది. విజయాల గాథ.. ఎఫ్1 అంటే షుమాకర్.. షుమాకర్ అంటే ఎఫ్1.. కార్ రేసింగ్ గురించి కాస్తయినా అవగాహన ఉన్న ఒక తరం మొత్తానికి అతనే ఏకైక హీరో. 1979 తర్వాత తమ టీమ్ నుంచి ఒక్క చాంపియన్ కూడా లేని ‘ఫెరారీ’ టీమ్ షుమాకర్‌తో చేసుకున్న ఒప్పందం అద్భుతాలు చేసింది. తొలి రెండు చాంపియన్ షిప్ విజయాల తర్వాత నాలుగు సీజన్లు తడబడిన షుమీ ‘ఫెరారీ’తో వేసిన అడుగు చరిత్ర సృష్టించింది. ఎదురు లేని ప్రదర్శనతో ట్రాక్‌పై చెలరేగిన అతను వరుసగా ఐదు సీజన్ల పాటు చాంపియన్ గా నిలవడం అతని కెరీర్లో అత్యుత్తమ సమయం. ఏకంగా ఏడు టైటిల్స్‌తో శాసించిన అతని కెరీర్లో అంకెలు చెప్పే విశేషాలెన్నో ఉన్నాయి. 2002లో ఆరు రేస్‌లు మిగిలి ఉండగానే చాంపియన్ గా ఖరారు కావడం, ఒకే గ్రాండ్‌ప్రి వేదికపై ఎక్కువ విజయాలు, వరుసగా 15 సీజన్లు కనీసం ఒక్క రేస్ అయినా గెలవడం, ఎక్కువ సంఖ్యలో ఫాస్టెస్ట్ ల్యాప్‌లు.. ఇలా ట్రాక్‌పై అతని ఘనతల జాబితా చాలా పెద్దది. అతను ఆట మొదలుపెట్టే సమయానికి జర్మనీలో కారు రేసింగ్ సరదాకు మాత్రమే. కానీ షుమాకర్ ఘనతల తర్వాత జర్మనీపై ఎఫ్1 ముద్ర ఎంత బలంగా పడిందంటే అతను రిటైరయ్యే సమయానికి ప్రపంచ టాప్–10 డ్రైవర్లలో ముగ్గురు జర్మనీవాళ్లే. ఆటతో అనుబంధమే.. చాలా మంది దిగ్గజ క్రీడాకారుల్లాగే ‘ఇక సమయం వచ్చింది’ అంటూ 2006 చాంపియన్ షిప్లో రెండో స్థానంలో నిలిచిన తర్వాత షుమీ తన ఆట ముగించాడు. అయితే కారు స్టీరింగ్ వెనక ఇన్నేళ్లుగా సాగిన ప్రస్థానం అతడిని కుదురుగా కూర్చోనీయలేదు. అందుకే నేనున్నానంటూ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేశాడు. రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు గడిచిన తర్వాత 2010లో కొత్త జట్టు మెర్సిడెజ్ తరఫున అతను బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. 41 ఏళ్ల వయసులో ఇది మళ్లీ అవసరమా, తాను సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలను పోగొట్టుకోవడం తప్ప మరేమీ దక్కదు అంటూ అతని గురించి విమర్శలు వినిపించాయి. అయితే ట్రాక్ అంటే తనకు ఉన్న అభిమానం వల్లే మళ్లీ వచ్చానని, ఫలితాల గురించి బెంగ లేదని అతను చెప్పుకున్నాడు. ఊహించినట్లుగానే ఫలితాలు గొప్పగా రాలేదు. 9వ, 8వ, 13వ స్థానాల్లో నిలిచిన తర్వాత పూర్తిగా తప్పుకున్నాడు. అయితే ‘నాకంటే కనీసం పదేళ్లు చిన్నవారైన ఐదుగురు ప్రపంచ చాంపియన్ లతో పోటీ పడ్డాను. ఓటమినుంచి ఏం నేర్చుకోవచ్చో కూడా తెలిసింది’ అంటూ వ్యాఖ్యానించాడు. వెంటాడుతున్న విషాదం... షుమాకర్ మొదటి నుంచి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిచ్చేవాడు. అతనికి భార్యాపిల్లలతోనే లోకం. ప్రపంచంలో అత్యంత పాపులర్ ఆటగాడిగా ఉంటూ ఏడాదికి 100 మిలియన్ డాలర్ల చొప్పున సంపాదించిన సమయంలోనూ అతని కుటుంబం బయట ఎప్పుడూ కనిపించలేదు. అలాంటి సమయంలోనే ఒక దురదృష్టకరమైన రోజు 29 డిసెంబర్, 2013 వచ్చింది. ఆల్ఫ్స్ పర్వతాల్లో కుటుంబంతో సహా విహారానికి వెళ్లి స్కీయింగ్ చేస్తుండగా అనూహ్యంగా పట్టు జారి పడ్డాడు. వేగంగా దూసుకొచ్చి అతను నియంత్రణ కోల్పోవడంతో తల ఒక రాయిని ఢీకొట్టింది. అంతే.. పేరుకే చావు నుంచి తప్పించుకున్నాడు. కానీ ఆ క్షణం నుంచి షుమీ ఈ లోకంలో లేనట్లు ఉండిపోయాడు. కోమాలోకి చేరుకున్న అతను మళ్లీ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయాడు. తొమ్మిదేళ్లుగా వేర్వేరు చికిత్సలు చేయిస్తూ ‘పరిస్థితి మెరుగైంది’ అంటూ సన్నిహితులు చెబుతూవస్తున్నా దానిపై ఏరోజూ స్పష్టత లేదు. ఆ ఘటన తర్వాత షుమాకర్ మళ్లీ బయట ఎవరికీ కనిపించలేదు. తండ్రి బాటనే ఎంచుకున్న కొడుకు మిక్ షుమాకర్ గత రెండు సీజన్లలో ఎఫ్1 రేసింగ్లలో పాల్గొన్నాడు. -
నాడు తండ్రి... నేడు తనయుడు...
తన తండ్రి మైకేల్ షుమాకర్ ఏ జట్టుకైతే ప్రాతినిధ్యం వహించాడో అదే జట్టు తరఫున వచ్చే ఏడాది ఫార్ములావన్ సీజన్లో మిక్ షుమాకర్ బరిలోకి దిగనున్నాడు. 2023 సీజన్ కోసం మిక్ మెర్సిడెస్ జట్టు తరఫున రిజర్వ్ డ్రైవర్‌గా నియమితుడయ్యాడు. రెగ్యులర్ డ్రైవర్లు హామిల్టన్, జార్జి రసెల్లలో ఒకరు అందుబాటులో లేకపోతే మిక్కు అవకాశం వస్తుంది. ఈ ఏడాది హాస్ జట్టు తరఫున మిక్ పోటీపడ్డాడు. మైకేల్ షుమాకర్ 2010–2012 వరకు మెర్సిడెస్ తరఫున బరిలోకి దిగాడు. చదవండి: BBL 2022: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే? -
ఎఫ్-1 రేసులో అపశ్రుతి.. రేసర్ వెన్నుముక విరిగింది
ఎఫ్-1 రేస్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. రేసులో భాగంగా జరిగిన యాక్సిడెంట్లో ఫార్ములావన్ దిగ్గజం మైకెల్ షుమాకర్ అల్లుడు డేవిడ్ షుమాకర్ వెన్నుముక విరిగింది. వెన్నుముకకు సర్జరీ అవసరం లేకపోయినప్పటికి డేవిడ్ షుమాకర్ కోలుకోవడానికి ఆరువారాల సమయం పట్టే అవకాశముంది. హాకెన్‌హీమ్ డీటీఎమ్ రేస్‌లో ఈ దుర్ఘటన జరిగింది. రేసులో భాగంగా లాప్-6 జరుగుతున్న సమయంలో టర్న్-8 వద్ద షుమాకర్ మెర్సిడెస్ కారు.. మరో కారుతో క్రాష్ అయింది. ఈ సమయంలో రెండు కార్లు బారికేడ్లను తాకడంతో షుమాకర్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత షుమాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా వెన్నుముక కింది భాగమైన లంబర్ వర్టిబ్రే విరిగినట్లు రిపోర్ట్స్‌లో తేలింది. దీనికి సర్జరీ అవసరం లేకపోయినప్పటికి ఆరు వారాల విశ్రాంతి మాత్రం కచ్చితంగా అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఫార్ములావన్‌లో మైకెల్ షుమాకర్ దిగ్గజంగా పేరుపొందాడు. ఎఫ్-1 రేసులో ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించిన షుమాకర్ అందులో ఐదు ఫెరారీ డ్రైవర్‌గా.. మిగతా రెండు టైటిల్స్ మెర్సిడెస్ ద్వారా అందుకున్నాడు. ఇక 2013లో తీవ్రమైన యాక్సిడెంట్‌కు గురైన షుమాకర్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2014లో కోమా నుంచి బయటపడిన షుమాకర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నాడు. ఇక షుమాకర్ రికార్డును లూయిస్ హామిల్టన్ 2021లో బ్రేక్ చేశాడు. షుమాకర్ తర్వాత మెర్సిడెస్కు ఎఫ్-1 రేసర్‌గా మారిన హామిల్టన్ ఏడు వరల్డ్ టైటిల్స్ సాధించి షుమాకర్‌తో సమానంగా నిలిచాడు. చదవండి: 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్ అంబటి రాయుడు, షెల్డన్ జాక్సన్ వాగ్వాదం.. వీడియో వైరల్ -
టైటిల్ గెలవకపోయినా ప్రపంచ రికార్డు బద్దలు
ఫార్ములావన్‌లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ఎఫ్1 రేసును మూడో స్థానంతో ముగించాడు. టైటిల్ గెలవడంలో విఫలమైనప్పటికి 16 ఏళ్ల తన రికార్డును మాత్రం కాపాడుకున్నాడు. ఎఫ్1 రేసులో హామిల్టన్ పోడియంను మూడో స్థానంతో ముగించాడు. ఒక గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ తన స్థానాన్ని పోడియంతో ముగించడం వరుసగా 16వ ఏడాది కావడం విశేషం. ఇంతకముందు లెజెండరీ ఫార్ములావన్ డ్రైవర్ మైకెల్ షుమాకర్ మాత్రమే ఉన్నాడు. తాజాగా హామిల్టన్ ఆ ఘనత సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు 250 రేసుల్లో పాయింట్లు సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ నిలిచాడు. ఇక క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: Indian Wells Final: నాదల్కు ఊహించని షాక్.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్ చేశాడు -
షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు.. ఏం జరిగింది?
రష్యన్ టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్ మాజీ చాంపియన్ మైకెల్ షుమాకర్‌లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్ పోలీసులు షరపోవా, షుమాకర్ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షఫాలీ అగర్వాల్ మాట్లాడుతూ.. రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్ 73లోని షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స అపార్టమెంట్లో ఒక ఫ్లాట్ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్‌ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్‌లు అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్‌లు డిన్నర్ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది. ఫార్ములావన్‌లో మెర్సిడెస్కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్ షుమాకర్ ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్ లుయీస్ హామిల్టన్ కూడా ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌ను గెలిచాడు. ఇక షుమాకర్ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్, 1566 కెరీర్ పాయింట్లు, 68 పోల్ పోజిషన్స్, 77 ఫాస్టెస్ట్ లాప్స్ అందుకున్నాడు. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్‌లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్ గ్రాండ్‌స్లామ్(యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు -
షుమాకర్ అరుదైన వీడియోలతో... త్వరలో డాక్యుమెంటరీ విడుదల
జెనీవా: ఫార్ములావన్ (ఎఫ్1)కు చిరునామాగా నిలిచిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) జీవితానికి సంబంధించి అరుదైన అంశాలతో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందుతోంది. ఏడుసార్లు ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచిన ఈ జర్మన్ స్టార్ 2013లో ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ చేస్తూ తీవ్ర ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. నాటినుంచి ఇప్పటి వరకు అతను బయటి ప్రపంచానికి కనపడలేదు. ఒకవైపు అతనికి చికిత్స కొనసాగిస్తూనే... మరోవైపు 52 ఏళ్ల షుమాకర్ తాజా ఆరోగ్య స్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతని కుటుంబ సభ్యులు గోప్యత పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొత్త డాక్యుమెంటరీలో పలు ఆసక్తికర అంశాలు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు అతని ఆరోగ్యం గురించి కూడా స్పష్టత రావచ్చు. ముఖ్యంగా 2013 ప్రమాదం తర్వాత అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇందులో ఉండవచ్చని, షుమాకర్ భార్య ఈ ప్రైవేట్ రికార్డింగ్‌లను స్వయంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే రానున్న డాక్యుమెంటరీలోని అరుదైన వీడియోలు అభిమానులను అలరిస్తాయని రూపకర్తలు మైకేల్ వెక్–బ్రూనో కమర్టన్స్ భావిస్తున్నారు. డాక్యుమెంటరీ నిర్మాణం పూర్తయిందని, గత డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉన్నా... కరోనా కారణంగా ఆలస్యమైందని వారు చెప్పారు. -
ఫార్ములా–2 చాంపియన్ మిక్ షుమాకర్
సాఖిర్ (బహ్రెయిన్): వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) లో అరంగేట్రం చేయనున్న దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఆదివారం ముగిసిన ఫార్ములా–2 చాంపియన్ షిప్లో 21 ఏళ్ల మిక్ ఓవరాల్ చాంపియన్‌గా అవతరించాడు. 12 రేసుల ఈ సీజన్లో ప్రెమా రేసింగ్ జట్టు తరఫున పోటీపడిన మిక్ మొత్తం 215 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది మిక్ ఫార్ములావన్‌లో అమెరికాకు చెందిన హాస్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. జిహాన్ దారూవాలాకు తొలి ఎఫ్2 టైటిల్... భారత్‌కు చెందిన రేసర్ జిహాన్ దారూవాలా తన కెరీర్లో తొలిసారి ఎఫ్2 రేసులో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ ఎఫ్2 రేసులో 22 ఏళ్ల జిహాన్ స్ప్రింట్ రేసు విభాగంలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. బ్రిటన్‌కు చెందిన కార్లిన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జిహాన్ 34 ల్యాప్‌ల స్ప్రింట్ రేసును 37 నిమిషాల 26.570 సెకన్లలో ముగించి తొలి స్థానాన్ని పొందాడు. ముంబైకి చెందిన జిహాన్ ఎఫ్2 సీజన్లో 72 పాయింట్లు స్కోరు చేసి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. జిహాన్–యుకీ సొనోడా సభ్యులుగా ఉన్న కార్లిన్ జట్టు ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందడం విశేషం. -
ఒకే ఒక్కడు...
పోర్టిమావో (పోర్చుగల్): ఫార్ములావన్ (ఎఫ్1)లో అద్భుతం చోటు చేసుకుంది. 14 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు తెరమరుగైంది. గత ఏడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఘనత సాధించాడు. ఆదివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 92వ విజయం నమోదు చేశాడు. ఈ క్రమంలో 91 విజయాలతో జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును 35 ఏళ్ల హామిల్టన్ బద్దలు కొట్టాడు. 2007లో తొలి ఎఫ్1 విజయం సాధించిన హామిల్టన్ 2013లో మెర్సిడెస్ జట్టులో చేరాడు. మెర్సిడెస్ జట్టులో షుమాకర్ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్ అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. షుమాకర్ ఏడు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్స్ (సీజన్ ఓవరాల్ విన్నర్) ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉండగా... ఈ ఏడాదీ హామిల్టన్‌కే ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కడం దాదాపు ఖాయమైంది. ఫలితంగా ఈ సీజన్లో మరో ఐదు రేసులు ముగిశాక షుమాకర్ పేరిట ఉన్న ఈ రికార్డునూ హామిల్టన్ సమం చేసే చాన్స్ ఉంది. 2006లో చైనా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత షుమాకర్ అదే ఏడాది ఎఫ్1కు వీడ్కోలు పలికాడు. నాలుగేళ్ల తర్వాత రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని ఎఫ్1లో పునరాగమనం చేసిన షుమాకర్ 2012 వరకు మెర్సిడెస్ జట్టుతో కొనసాగినా మరో రేసులో గెలుపొందలేకపోయాడు. ఆరంభంలో వెనుకబడ్డా... 24 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించాడు. అయితే రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మొదట్లోనే హామిల్టన్‌ను ఓవర్టేక్ చేశాడు. అయితే 20వ ల్యాప్‌లో హామిల్టన్ ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత అదే జోరును చివరిదైన 66వ ల్యాప్ వరకు కొనసాగించాడు. చివరకు గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో రేసును ముగించిన హామిల్టన్ కెరీర్లో 92వ విజయాన్ని దక్కించుకున్నాడు. బొటాస్‌కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొం దాడు. ప్రస్తుత సీజన్‌లోని 17 రేసుల్లో 12 పూర్తయ్యాయి. తదుపరి రేసు ఎమీలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఇటలీలో నవంబర్ 1న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్ షిప్ రేసులో హామిల్టన్ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బొటాస్ (179 పాయింట్లు), వెర్స్టాపెన్ (162 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ 435 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
షుమాకర్ సరసన లూయిస్ హామిల్టన్
నుర్బర్గ్రింగ్ (జర్మనీ): ఈసారి అందివచ్చిన అవకాశాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వదులుకోలేదు. ఫార్ములావన్ (ఎఫ్1)లో అత్యధిక విజయాలు సాధించిన దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును హామిల్టన్ సమం చేశాడు. ఆదివారం జరిగిన జర్మనీ ఐఫెల్ గ్రాండ్‌ప్రి రేసులో 35 ఏళ్ల హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ నిర్ణీత 60 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 35 నిమిషాల 49.641 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ విజయంతో ఎఫ్1లో అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్‌గా 2006 నుంచి మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేశాడు. షుమాకర్ కెరీర్లో 306 రేసుల్లో పాల్గొని 91 విజయాలు అందుకోగా... హామిల్టన్ 261 రేసుల్లోనే ఈ ఘనతను సాధిం చాడు. ఈ సీజన్లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్న నేపథ్యంలో షుమాకర్ రికార్డును హామిల్టన్ బద్దలు కొట్టడం ఖాయం. సీజన్ లోని తదుపరి రేసు పోర్చుగల్ గ్రాండ్‌ప్రి ఈనెల 25న జరుగుతుంది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ బొటాస్ 13వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్ 13వ ల్యాప్‌లో బొటాస్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. బొటాస్ 18వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకోగా... అటునుంచి ఈ బ్రిటన్ డ్రైవర్ వెనుదిరిగి చూడలేదు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. తన తండ్రి రికార్డును సమం చేసిన హామిల్టన్‌కు షుమాకర్ తనయుడు మిక్ ఓ జ్ఞాపిక ఇచ్చాడు. షుమాకర్ తన కెరీర్ చివరి సీజన్ (2012)లో ఉపయోగించిన హెల్మెట్‌ను హామిల్టన్‌కు మిక్ బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు ఈ రేసులో బరిలోకి దిగడం ద్వారా ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ (ఆల్ఫా రోమియో) అత్యధికంగా 323 ఎఫ్1 రేసుల్లో పాల్గొన్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పాడు. 322 రేసులతో బారికెల్లో (బ్రెజిల్) పేరిట ఉన్న రికార్డును రైకోనెన్ బద్దలు కొట్టాడు. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
నూర్బర్గ్ (జర్మనీ): మెర్సిడెస్ డ్రైవర్లు మరోసారి సత్తా చాటారు. వరుసగా 11వ రేసులోనూ ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వాల్తెరి బొటాస్... అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 25.269 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ను దక్కించుకున్నాడు. తాజా సీజన్లో బొటాస్‌కు ఇది మూడో ‘పోల్’ కావడం విశేషం. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. మరో వైపు ఎఫ్1 దిగ్గజం మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్ ప్రి విజయాల (91 టైటిల్స్) రికార్డును సమం చేయడానికి చూస్తోన్న లూయిస్ హామిల్టన్... ల్యాప్‌ను 0.256 సెకన్లు వెనుకగా పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. అనారోగ్యంతో రేసిం గ్ పాయింట్ డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ ఐఫెల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌తో పాటు ప్రధాన రేసుకు కూడా దూరమయ్యాడు. దాంతో అతడి స్థానాన్ని నికో హల్కెన్‌బర్గ్ (జర్మనీ)తో రేసింగ్ పాయింట్ టీమ్ భర్తీ చేసింది. క్వాలిఫయింగ్ సెషన్లో హల్కెన్‌బర్గ్ 20వ స్థానంలో నిలిచి రేసును అందరికంటే చివరగా ఆరంభించనున్నాడు. సీజన్ ఆరంభంలో హల్కెన్‌బర్గ్ రేసింగ్ పాయింట్ తరఫున పాల్గొన్నాడు. -
హామిల్టన్ @ 90
బుడాపెస్ట్: అచ్చొచ్చిన ట్రాక్‌పై మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దూసుకెళ్లాడు. తన కెరీర్లో 90వ పోల్‌ను సాధించాడు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను పోల్ సిట్టర్‌గా నిలిచాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా పోల్ విజయంతో ఏడో సారి ఈ ఘనత సాధించిన హామిల్టన్... ఇదే ట్రాక్‌పై అత్యధిక పోల్ పొజిషన్ల మైకేల్ షూమాకర్ రికార్డును సమం చేశాడు. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 13.447 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్ అగ్రస్థానంలో నిలవగా... మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ 0.107 సెకన్లు తేడాతో ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సారి మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 4. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. వెటెల్ (ఫెరారీ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. నోరిస్ (మెక్లారెన్), 9. సెయింజ్ (మెక్లారెన్), 10. గాస్లీ (అల్ఫా టోరి). -
హామిల్టన్‌దే విక్టరీ
బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ కైవసం స్పా–ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): ఫార్ములావన్ సీజన్లో లూయిస్ హామిల్టన్ మరో టైటిల్ సాధించాడు. ఆదివారం బెల్జియం గ్రాండ్‌ప్రిలో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాది హామిల్టన్ సాధించిన ఐదో టైటిల్ ఇది. ఓవరాల్‌గా 32 ఏళ్ల ఈ బ్రిటన్ రేసర్ తన 200వ గ్రాండ్‌ప్రి రేసును విజయంతో ముగించాడు. తన కెరీర్లో అతనికిది 58వ విజయం కావడం మరో విశేషం. శనివారం 68వ పోల్ పొజిషన్‌తో జర్మనీ రేసింగ్ దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును సమం చేసిన హామిల్టన్ అదే జోరును ప్రధాన రేసులోనూ కనబరిచాడు. 44 ల్యాప్‌ల ఈ ట్రాక్‌లో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గట్టి పోటీనిచ్చాడు. కొన్ని ల్యాపుల్లో హామిల్టన్‌కు అత్యంత చేరువైనా... అతని విజయాన్ని మాత్రం ఆపలేకపోయాడు. చివరకు రేసును మెర్సిడెస్ డ్రైవర్ అందరి కంటే ముందుగా గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 2.358 సెకన్ల వ్యవధిలో వెటెల్ రన్నరప్‌గా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో మూడో స్థానంతో పోడియంలో నిలిచాడు. జోరుమీదున్న హామిల్టన్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 3) ఇటాలియన్ గ్రాండ్‌ప్రి గెలిస్తే ఈ ఏడాది చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఆధిక్యంలోకి వస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లలో ఈస్ట్బన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ రేసును పూర్తిచేయలేకపోయాడు. 42 ల్యాపుల్ని పూర్తి చేసిన అతను 17వ స్థానం దక్కించుకున్నాడు. -
'షుమాకర్ ఆరోగ్యంలో మెరుగుదల లేదు'
లండన్: గత మూడు సంవత్సరాల క్రితం స్కీయింగ్ చేస్తూ గాయపడి, ఆపై కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్యపరిస్థితిలో ఇంకా ఎటువంటి మెరుగుదల కనిపించలేదని ఫెరారీ మాజీ చీఫ్ లుకా డి మోన్ టేజ్ మోలో తెలిపారు. అతని ఆరోగ్యం ఎప్పటిలానే ఉండటం తమను మరింత ఆందోళనకు గురి చేస్తుందన్నారు. షూమాకర్ శరీరం నుంచి ఏ విధమైన స్పందనా పూర్తి స్థాయిలో కనిపించకపోవడం నిజంగా చెడు వార్తేనన్నారు. అతనికి 1997లో జరిగిన ఫార్ములావన్ ప్రమాదాన్ని ఈ సందర్భంగా లుకా గుర్తు చేశారు. అతి పెద్ద ప్రమాదం కాకపోయినా, తమ తప్పిందవల్లే అప్పడు ఆ ప్రమాదం జరిగిందన్నారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే షూమాకర్ జీవితాన్ని స్కీయింగ్ పూర్తిగా చిన్నాభిన్నం చేసిందన్నారు. ఏడు సార్లు ఫార్ములావన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన షుమాకర్ కు ఇలా కావడం చాలా బాధకరమన్నారు. 2013 డిసెంబర్ లో ఫ్రెంచ్ ఆల్ప్స్ లో స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కోమాలోకి జారుకున్న షూమాకర్ కు ఆరు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం స్విట్జర్లాండ్ లోని అతనికి ఇంటికి తీసుకొచ్చి యథావిధిగా చికిత్స కొనసాగిస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. -
షుమాకర్‌కు మాట పడిపోయింది!
లుసానే: స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురై 11 నెలలు కావస్తున్నా ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య స్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. తాజాగా అతనికి పక్షవాతం సోకి పూర్తిగా చక్రాల కుర్చీకే అంకితమైనట్లు తెలిసింది. షుమీని కలిసిన అనంతరం షుమాకర్ మిత్రుడు, ఎఫ్1 మాజీ డ్రైవర్ ఫిలిప్ స్ట్రిఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గతం కంటే కాస్త బాగున్నట్లు అనిపించింది. అయితే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా ఉంది. అతను వీల్‌చైర్‌లోనే ఉంటున్నాడు. కనీసం మాట్లాడలేకపోతున్నాడు. పైగా జ్ఞాపక శక్తి సమస్య కూడా వెంటాడుతోంది. సైగలతోనే ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా అర్థం కావడం లేదు’ అని ఫిలిప్ చెప్పారు. -
షుమాకర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది
రేసర్ భార్య వెల్లడి బెర్లిన్: కోమా నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అతని భార్య కొరినా షుమాకర్ వెల్లడించింది. ‘నెమ్మదిగా అయినా, కచ్చితంగా షుమీ ఆరోగ్యం బాగవుతుంది. ప్రస్తుతమైతే పరిస్థితి చాలా మెరుగ్గా, ప్రోత్సాహకరంగా ఉంది’ అని కొరినా పేర్కొంది. గతేడాది డిసెంబర్లో షుమాకర్ స్కీయింగ్ యాక్సిడెంట్ తర్వాత ఆమె బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. దాదాపు ఆరు నెలల పాటు ఫ్రాన్స్‌లోని గ్రెనోబా ఆసుపత్రిలో చికిత్స పొందిన షుమాకర్ కోమా నుంచి బయటపడటంతో జూన్ 16న స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తరలించారు. -
షుమాకర్ మెడికల్ డాక్యుమెంట్లు చోరీ
జెనీవా: ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ చికిత్సకు సంబంధించిన వైద్య పత్రాలు చోరీకి గురైనట్లు అతని మేనేజ్మెంట్ వెల్లడించింది. ఈ స్టార్ రేసర్ కోమాకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయని, వీటిని అమ్ముతామని ఎత్తుకెళ్లిన దొంగలు చెబుతున్నారు. ‘గత కొన్ని రోజులుగా దొంగిలించబడిన పత్రాలు, డాటాను అమ్మకానికి పెట్టారు. ఇవి షుమాకర్‌కు సంబంధించిన పత్రాలని వాళ్లు చెబుతున్నారు. అయితే ఇవి నిజమైనవో కావో మేం తెలుసుకోలేకపోతున్నాం. కానీ వైద్య పత్రాలైతే చోరీకి గురయ్యాయి’ అని షుమీ అధికార ప్రతినిధి సబీనా కెమ్ తెలిపింది. పత్రాలను దొంగిలించిన నేరస్తుడు కొంత మంది ఫ్రెంచ్, స్విస్, జర్మన్ జర్నలిస్ట్‌లతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నాడని, 67 వేల డాలర్లకు వీటిని అమ్మకానికిపెట్టాడని వార్తలు వచ్చాయి. -
షుమాకర్ మెడికల్ రిపోర్టులు చోరి
జెనీవా: ఫార్మూలా వన్ స్టార్ మైఖేల్ షూమాకర్ మెడికల్ రిపోర్టులు చోరికి గురైన సంఘటన జెనీవాలో సంచలనం రేపుతోంది. గత డిసెంబర్ లో ఫ్రాన్స్‌లోని మెరిబెల్లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కోమాకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు చోరికి గురయ్యాయని షుమాకర్ మేనేజర్ తెలిపారు. చోరికి గురైన డాక్యుమెంట్లను గత కొద్దిరోజులుగా వేలానికి పెట్టారు. షూమాకర్ కు సంబంధించిన మెడికల్ రిపోర్టులని వేలానికి పెట్టిన వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు. అయితే వేలానికి పెట్టిన మెడికల్ రిపోర్టులు నిజమైనవా లేదా అనే విషయంపై సందేహాలున్నాయాన్నారు. మెడికల్ రిపోర్టులు చోరికి గురైన విషయం వాస్తవమేనని జర్మనీ కి చెందిన అధికారి సబైన్ కెమ్ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ రిపోర్టులు పూర్తిగా వ్యక్తిగతమైనవి. పబ్లిక్ కు అందుబాటులో ఉండకూడనివి. అలాంటి వాటిని ఎవరూ కొనుగోళు చేయకూడదు అని హెచ్చరించారు. Follow @sakshinews -
‘షుమాకర్ స్పృహలోనే ఉన్నాడు’
జెనీవా: కోమాలో నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌ను ఫ్రెంచ్ ఆసుపత్రి నుంచి తరలిస్తున్న సమయంలో స్పృహలోనే ఉన్నాడని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రైవేట్ అంబులెన్స్‌లో స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు కళ్లు తెరిచే ఉన్న షుమీ మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయలేదని తెలిపాయి. అయితే కళ్లతోనే సైగలు చేస్తూ తలను అటూ ఇటూ తిప్పినట్లు సమాచారం. షుమాకర్ తరలింపు వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా చేపట్టారు. షుమీ గురించి కనీసం అంబులెన్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు. సహాయక సిబ్బందికి సంబంధించిన మొబైల్స్‌ను తీసేసుకున్నారు. -
కోమాలోంచి బయటకు షుమాకర్
లియోన్: ఆరు నెలల పాటు కోమాలో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఎట్టకేలకు బయటపడ్డాడు. దీంతో ఇప్పటిదాకా చికిత్స పొందుతున్న ఫ్రాన్స్‌లోని ఆస్పత్రి నుంచి అతడిని సోమవారం స్విట్జర్లాండ్‌లో లుసానేలోని ఆస్పత్రికి తదుపరి చికిత్స కోసం తరలించారు. ఈ విషయాన్ని షుమాకర్ తరపు ప్రతినిధి సబినే కెమ్ అధికారికంగా ప్రకటించారు. భార్య, పిల్లలతో కలిసి షుమాకర్ స్విట్జర్లాండ్‌లోనే ఓ చిన్న పట్టణంలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది డిసెంబర్ 29న ఫ్రాన్స్‌లోని మెరిబెల్లో 45 ఏళ్ల షుమాకర్ స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్రెనోబుల్‌లో అతనికి చికిత్సనందించిన డాక్టర్లు.. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు రెండు శస్త్రచికిత్సలు చేశారు. షుమాకర్లో కదలికలు కనిపించినట్లు పలుమార్లు వార్తలు రాగా, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. అయితే అతడు తప్పక కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తూ వచ్చారు. సోమవారం షుమాకర్ తరలింపు సందర్భంగా మీడియా దృష్టంతా గ్రెనోబుల్ పైనే ఉన్నా.. ఎటువంటి హడావిడి లేకుండా, మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా అతడిని తీసుకెళ్లారు. అయితే గాయపడిన నాటి నుంచి షుమాకర్‌కు చికిత్సనందించిన వైద్యులకు, అతడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ అతని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు చెప్పినట్లు సబినే కెమ్ తెలిపారు. షుమాకర్ ప్రస్తుత ఆరోగ్యస్థితిపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. పూర్తిగా కోలుకునే దాకా ప్రపంచానికి దూరంగా ఉంచనున్నట్లు చెప్పారు. -
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
-
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకేల్ షుమాకర్ కోమా నుంచి బయటపడ్డాడు. గ్రెనోబుల్ ఆసుపత్రి నుంచి అతడు ఇంటికి చేరుకున్నాడని షుమాకర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అతడికి వైద్యపరమైన సపర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. షుమాకర్ చికిత్స చేసిన వైద్యులు, సేవలు అందించిన నర్సులు, ప్రాథమిక చికిత్స చేసిన వారిని అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. షుమాకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. 45 ఏళ్ల మైకేల్ గతేడాది డిసెంబర్ 29న ఫ్రాన్సులో స్కీయింగ్ చేస్తూ పడిపోయాడు. బండరాయికి తల బలంగా మోదుకోవడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. -
షుమాకర్‌పై దావా
గతంలో మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్ మాడ్రిడ్: స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌పై... గతంలో యాక్సిడెంట్ చేశాడన్న ఆరోపణలతో కోర్టులో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 17న బోర్మోజోస్ టౌన్ (స్పెయిన్)లో అద్దె కారులో ప్రయాణించిన షుమాకర్... మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఫ్రాన్సిస్కో ఎం.ఎ. అనే వ్యక్తిని ఢీకొట్టాడు. రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో పాటు సరైన వెలుతురు లేకుండా ప్రయాణిస్తూ రోడ్ మలుపు తిరిగే సమయంలో బైక్‌ను గుద్దాడు. ఈ యాక్సిడెంట్లో ఫ్రాన్సిస్కోకు మణికట్టు విరగడంతో పాటు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయాలంటే కోర్టులో కేసు విచారణ జరగాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న షుమాకర్ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో కేసు తేలేలా కనిపించడం లేదు. -
కొద్దికొద్దిగా స్పృహలోకి వస్తున్న షుమాకర్
స్కీయింగ్ ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకెల్ షుమాకర్ అప్పుడప్పుడు కోమా నుంచి బయటకి వస్తున్నారు. ఈ మేరకు షుమాకర్ పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోంది. 'ఆయన కళ్లు తెరిచి చూస్తున్నారు. కొద్దిగా కదులుతున్నారు' అని ఆయన మేనేజర్ సబీన్ కెహ్మ్ చెప్పారు. గత డిసెంబర్ 29 న ఒక ఫ్రెంచి రిసార్టులో స్కీయింగ్ కోసం వెళ్లిన షుమాకర్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైద్యులు ఆయన్ను కృత్రిమంగా కోమాలోకి పంపించారు. ఫార్ములా వన్ రేసింగ్ లో ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా గెలిచిన షుమాకర్ అప్పట్నుంచీ కోమాలోనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పరిస్థితి కాస్త మెరుగుపడిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు గ్రెనోబుల్ హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. అయితే షుమాకర్ పరిస్థితికి సంబంధించిన అదనపు వివరాలు ఇవ్వడానికి ఆయన మేనేజర్ నిరాకరించారు. షుమాకర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రైవసీని కాపాడేందుకే ఇలా చేస్తున్నామని ఆయన చెప్పారు.