కోటి దాటితే కొండెక్కినట్టే!
అంచనా విలువ రూ. కోటి దాటిన చెరువుల పనులు పక్కకు పెట్టే యోచన
అంచనాల పరిశీలనకు సమయం లేకపోవడమే కారణమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కోటి రూపాయల గరిష్ట అంచనావిలువ లు ఉండే పనులను పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోటి ఆపైన ఉండే చెరువుల పనులకు ప్రస్తుత పరిస్థితిలో సూక్ష్మ పరిశీలన చేయడం సాధ్యంకాని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన ను ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత నుంచి తొలగించింది. ఈ పనుల అంచనాలు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో వీటికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,545 చెరువులపై అధి కారులు సర్వే చేయగా 1917 చెరువులకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో 1,209 చెరువులకు సంబంధించిన అంచనా నివేదికలు చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.632 కోట్లుగా ఉంది. చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలకు వచ్చిన అంచనాల నివేదికలను ఉన్నత స్థాయిలో పరిశీలన చేసి 500 చెరువుల అంచనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా ఇందులో 304 చెరువులకు టెండర్లు పిలిచే ప్రక్రియ ముగిసింది.
అయితే క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న అంచనాల్లో చాలా చోట్ల లొసుగులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిపై పునఃపరిశీలకు ఆదేశించింది. ఇదిలా ఉండగా రూ.కోటికి మించి వచ్చే ప్రతిపాదనలపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయడం సాధ్యం కాని దృష్ట్యా వాటన్నింటినీ పక్కకు పెట్టేస్తున్నారు. దేవాదుల, జూరాల, ఎస్సారెస్పీ, మానేరు, ఏఎంఆర్పీ ప్రా జెక్టుల కింద నీటిని నింపిన పెద్ద చెరువులు వం దల్లో ఉన్నాయి. రూ.కోటి దాటిన అంచనాలతో 200 వరకు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి మరో 50 నుంచి 100 వరకు ప్రతిపాదనలు రూ.కోటికి మించిన అంచనాలతో నీటిపారుదల శాఖకు చేరాయి. వీటన్నింటినీ అధికారులు పక్కనపెట్టేశారు. తొలి దశ పనులు మొదలయ్యాక జనవరి రెండో వారం తర్వాత వీటిపై పూర్తి స్థాయి పరి శీలన జరిపి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.