బేస్ రేటును ప్రతి 3 నెలలకు సమీక్షించాలి: ఆర్బీఐ
ముంబై: రుణాలకు సంబంధించి కనీస రుణ రేటు(బేస్ రేటు)ను ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించుకోవాలని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకులకు సూచించింది. ఈ సందర్భంగా నిర్ణయించిన రేటును తప్పనిసరిగా ప్రకటించాలనీ (నోటిఫై) నిర్దేశించింది. ‘ఇంట్రస్ట్ రేట్స్ ఆన్ అడ్వాన్స్’ పేరుతో ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇప్పటివరకూ కనీస రుణ రేటు సమీక్షకు బ్యాంకులు నిర్దిష్ట స్థిర కాల పరిధిని ఏదీ పాటించడం లేదు. ఇక నుంచీ మాత్రం ఈ దిశలో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిధుల లభ్యత వ్యయాల ప్రాతిపదికన బ్యాంకులు ఈ రేటును సమీక్షిస్తుంటాయి. దాదాపు 20 నెలల తరువాత ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావుశాతం తగ్గించింది.
దీనితో ఈ రేటు 7.75%కి తగ్గింది. అయితే ఆర్బీఐ రెపో తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించడం లేదన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులకు తాజా నిర్దేశం చేసింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచీ ఈ ఆదేశం అమల్లోకి వస్తుంది. కాగా బేస్రేటు నిర్ణయానికి సంబంధించి అనుసరిస్తున్న విధానాన్ని కూడా ప్రస్తుత ఐదేళ్లు కాకుండా, మూడేళ్లకు తగ్గించుకోవాలని ఆర్బీఐ పేర్కొంది.