అలిపిరి ఘటన కేసులో ముగిసిన సాక్షుల విచారణ
తిరుపతి లీగల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై 2003 అక్టోబర్ 1వ తేదిన తిరుపతి అలిపిరి సమీపంలో జరిగిన క్లెమోర్‌మైన్ దాడి కేసులో సాక్షుల విచారణ సోమవారం ముగిసింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 7వ తేది నుంచి సాక్షుల విచారణ ప్రారంభమైంది. 52 మంది ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యం ఇచ్చారు. సుమారుగా 85 పత్రాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో కేసులో 25వ నిందితుడైన దామోదర్ అలియాస్ సాకే కృష్ణను సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు అధికారి, అప్పట్లో సిట్ డీఎస్పీగా ఉన్న ఎస్.ఎం.వల్లీ ఇచ్చిన సాక్ష్యాన్ని తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి రికార్డు చేశారు. ఎస్.ఎం.వల్లీని దామోదరం తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేసారు.
దీంతో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షుల విచారణ ముగిసింది. కాగా, కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్‌రెడ్డిలు మాత్రం కోర్టుకు హాజరై సాక్ష్యం ఇచ్చారు. ఇదిలా ఉండగా, దామోదరం స్టేట్మెంట్ రికార్డు చేయడానికి న్యాయమూర్తి కేసును ఫిబ్రవరి 4వ తేదికి వాయిదా వేశారు.