ఆన్లైన్లో భద్రాద్రి రాముడి సేవలు
హైదరాబాద్: పుష్కరాల సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రాచలం దేవాలయంలో శీఘ్రదర్శనం, నిత్య కల్యాణం, సహస్ర నామార్చన, ఊంజల్ సేవల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకునే ఈ సదుపాయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ నెల 14 నుంచి 25 వరకు 12 రోజుల పాటు జరిగే సేవలకు సంబంధించిన టికెట్ల బుకింగ్ తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం రోజుకు 1,500 శీఘ్ర దర్శనం, 800 నిత్య కల్యాణం, 800 సహస్ర నామార్చన, 800 ఊంజల్ సేవ టికెట్లు అందుబాటులో వుంటాయన్నారు. భక్తులు తమ ఫొటోతో పాటు, ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు వివరాల నమోదుతో ఆన్లైన్లో నిర్దేశిత రుసుము చెల్లించాలన్నారు. పుష్కరాల సమయంలో రోజుకు 20 గంటల పాటు దర్శనం కల్పిస్తామన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తుల కోసం దర్శన సమయాలను స్లాట్లుగా విభజించినట్లు మంత్రి వెల్లడించారు.