భార్యపై దాడి చేసిన కార్పొరేటర్
నిజామాబాద్ క్రైం : భార్యపై దాడి చేసిన నిజామాబాద్ నగరం 37వ డివిజన్ కార్పొరేటర్ మీర్ పర్వేజ్అలీ, అతని తమ్ముడు, మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, వారి సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఐదవ ఠాణా ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం, పర్వేజ్అలీ, అఖిల ఫాతిమా దంపతులు కొంత కాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వీరికి 20 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పర్వేజ్ అలీ పోటీ చేశాడు. డబ్బులు అవసరం ఉండడంతో భార్యను పుట్టించి నుంచి రూ. రెండు లక్షలు తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అందుకు ఫాతిమా నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆమె హైదరాబాద్లోనే ఉండి పోయింది. ఎన్నికల్లో పర్వేజ్ అలీ విజ యం సాధించాడు. బుధవారం నిజామాబాద్ వచ్చిన ఫాతిమాకు, పర్వేజ్ అలీ మధ్య గొడవ ప్రారంభమైంది.
ఇంతలో పర్వేజ్ అలీ, అతని తమ్ముడైన మీర్ మజాజ్ అలీ కలిసి ఫాతిమాపై దాడి చేశారు. తల్వార్ పిడితో తలపై, భుజంపై గాయపర్చారు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. అహ్మద్పురాలో నివాసం ఉండే ఆమె తండ్రి మంజూర్ అలీ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని అల్లుడిని నిలదీశాడు. మళ్లీ గొడవైం ది. అనంతరం ఫాతిమాను ఆస్పత్రిలో చేర్పించారు.